టూరుకు 'ప్లాన్' చేశారా? | Have a plan to 'tour'? | Sakshi
Sakshi News home page

టూరుకు 'ప్లాన్' చేశారా?

Published Mon, May 1 2017 1:01 AM | Last Updated on Tue, Sep 5 2017 10:04 AM

టూరుకు 'ప్లాన్' చేశారా?

టూరుకు 'ప్లాన్' చేశారా?

ప్రణాళిక ఉంటే ఖర్చు తక్కువలోనే పర్యటన
► ముందు నుంచే సన్నద్ధం కావటం తప్పనిసరి
► అప్పటికప్పుడు నిర్ణయించుకుంటే ఖర్చులెక్కువే
► రవాణా, వసతి, ఇతర ఖర్చులన్నీ ఆన్‌లైన్లో లభ్యం
► అందుకు తగ్గట్టు ప్లాన్‌ చేసుకుంటే పర్యటన సక్సెస్‌  


సెలవులొచ్చేశాయి. రోజూ కాసేపు స్కూలుకు వెళ్లి... ఆ తరవాత ఇంటికొచ్చి హోమ్‌వర్కుల వంటివి చేసే పిల్లలు... రోజంతా ఇంట్లో ఉంటే భరించటం కష్టమే. అందుకే సెలవులకు ఊళ్లకు పంపిస్తుంటారు. కానీ ఇప్పుడంతా ఎండలమయం. ఎక్కడికి పంపించాలన్నా చాలా కష్టం. పోనీ సమ్మర్‌ క్యాంపుల్లో చేరిస్తే... అవి గంటా రెండు గంటల కన్నా ఎక్కువసేపు లేవు. ఇవన్నీ పక్కనబెడితే... పిల్లలే కాదు, ఇంట్లో వాళ్లు కూడా వేసవిలో ఏదో ఒక చల్లని ప్రాంతానికి విహారయాత్రకు తీసుకెళ్లమంటుంటారు. ఒకవేళ వాళ్లు అడగకపోయినా కూడా వేసవిలో ఏదైనా టూర్‌కు వెళ్లాలని చాలామంది ప్లాన్‌ చేస్తుంటారు. అయితే... అనుకున్న వెంటనే ఏదో ఒక ఆపరేటర్‌ను సంప్రతించటం, తాము వెళ్లాలనుకున్న ప్రాంతం కనక తమ బడ్జెట్లో లేకపోతే బాధపడటం... చివరకు తమ బడ్జెట్లో ఏది ఉందో చూసుకుని, ఆ ప్రాంతానికి వెళ్లటం చేస్తుంటారు. నిజానికి కాస్తంత ముందే ప్లాన్‌ చేసుకుని... దాని ప్రకారం అడుగులు వేస్తే తక్కువ బడ్జెట్లోనే అనుకున్న టూర్‌ సాధ్యమవుతుంది. ఆ వివరాలన్నీ తెలియజేసేదే ఈ ప్రత్యేక కథనం...

వేసవి సెలవుల్లో యాత్రలకు వెళ్లాలని ముందుగానే చాలామంది ఫిక్స్‌ అవుతారు. కానీ ఎక్కడికి వెళ్లాలో, కచ్చితంగా ఏఏ తేదీల్లో వెళ్లాలో నిర్ణయించుకోరు. వీటిపై చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఖర్చులు తడిసిమోపెడవుతాయి. ముందుగానే ప్లాన్‌ చేసుకోకపోవడం వల్ల అనుకున్నంత ఎంజాయ్‌మెంట్‌ కూడా ఉండకపోవచ్చు.

అందుకే ఎక్కడికి వెళ్లాలన్నది ముందుగానే డిసైడ్‌ అవ్వాలి. పర్యటన కొంచెం ఎక్కువ రోజులుపాటు ఉండాలనుకుంటే అందుకు ఎంత బడ్జెట్‌ కావాలి? తామెంత కేటాయించగలరు? వంటివన్నీ చూసుకోవాలి. ఎందుకంటే నలుగురు సభ్యులున్న కుటుంబం రూ.50,000 బడ్జెట్‌తో కశ్మీర్‌ సహా ఉత్తర భారతాన్ని చుట్టొద్దామనుకుంటే సాధ్యం కాకపోవచ్చు. అలాగే, ఇదే బడ్జెట్‌తో సింగపూర్‌ వెళ్లాలనుకున్నా అసాధ్యమే. కాకపోతే విమానాల బదులు రైలు ప్రయాణాన్ని ఎంచుకుని... కశ్మీర్‌ బదులు ఊటీ, కులుమనాలీ వంటి ప్రాంతానికి వెళ్లిరావాలనుకుంటే... ఇదే బడ్జెట్‌తో మరీ లగ్జరీకి పోకుండా టూర్‌ పూర్తిచేయొచ్చు.

ధరల గురించి పూర్తి సమాచారం
ఇపుడు ఆన్‌లైన్‌లో దాదాపు అన్ని రకాల సమాచారమూ అందుబాటులో ఉంటోంది. కాబట్టి ఏ ప్రాంతానికి వెళ్లాలనుకున్నారో అక్కడ వసతి, ఆహార ఖర్చులు, వెళ్లి వచ్చేందుకు అయ్యే రవాణా ఖర్చుల గురించి ముందుగానే పూర్తిస్థాయిలో ఓ అంచనాకు రావచ్చు. ఇలా బయల్దేరిన దగ్గర్నుంచి, తిరిగి వచ్చే వరకు అయ్యే వ్యయాలను ఓ జాబితాగా రాసుకోవడం వల్ల ఎంత మేర ఖర్చవుతుందీ తెలిసిపోతుంది. దీనికి ఓ పది శాతం అదనంగా కలుపుకోవాలి. ఊహించని ఖర్చులు, చివరి నిమిషంలో టూర్‌ పొడిగించుకోవడం వంటి  అంశాలే దీనికి కారణం.

క్రెడిట్‌ కార్డు వాడకుంటేనే బెటర్‌...
పర్యటనల సమయంలో క్రెడిట్‌ కార్డు వాడకాన్ని తగ్గించుకుంటే మంచిది. ముందుగానే పర్యటనకు ప్లాన్‌ చేసుకోవడం అదనపు వ్యయాలకు కళ్లెం వేయాలనే కదా!!. కానీ, కొందరికి తమ దగ్గర క్రెడిట్‌ కార్డు ఉంటే ఎంత ఖర్చు చేస్తున్నామనేది లెక్క ఉండదు. అందుకే క్రెడిట్‌ కార్డు వాడకాన్ని తగ్గించాలి. క్రెడిట్‌ కార్డు బిల్లులపై నెలకు 2 నుంచి 3 రూపాయల వడ్డీని బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. మరో విషయం విదేశీ పర్యటనల సమయంలో క్రెడిట్‌ కార్డును వాడితే విదేశీ లావాదేవీల రుసుము చెల్లించుకోవాలి. ఇది లావాదేవీ విలువపై 3%గా ఉంటుంది.

ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ తప్పనిసరి
పర్యటన ఎక్కడికైనా ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ పాలసీతో రక్షణ కల్పించుకోవడం ఎంతో అవసరం. విదేశీ పర్యటనల్లో స్వదేశంలో తీసుకున్న హెల్త్‌ పాలసీ అక్కరకు రాదు. అదే ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ అయితే ఊహించని ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లోను, ప్రమాదాల కారణంగా తలెత్తే వైద్య చికిత్సలకు ఆసరాగా నిలుస్తుంది.

హాస్పిటల్‌లో అయ్యే వ్యయాలతో పాటు, అవుట్‌ పేషెంట్‌ చికిత్సలకూ ఇది ఉపయోగపడుతుంది. అదేకాక... లగేజీ మిస్సయినా, పాస్‌పోర్ట్‌ పోగొట్టుకున్నా, ట్రిప్‌ ఆలస్యమైనా, పర్యటన రద్దు కావడం వల్ల అయ్యే వ్యయాలను కూడా పాలసీ భరిస్తుంది. ఆస్తులు, వ్యక్తిగత నష్టాలకు థర్డ్‌ పార్టీ కవరేజీ కూడా ఉంటుంది. ఇంకా దంత సంబంధ చికిత్సలకు, ప్రమాదాల్లో మరణిస్తే స్వదేశానికి తరలించేందుకు అయ్యే ఖర్చులను భరించే పాలసీలూ ఉన్నాయి. ఇన్ని విధాల రక్షణనిస్తున్న ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ను బడ్జెట్‌లో భాగం చేసుకోవడం మంచిది.

తొలిసారి.. ప్యాకేజ్‌ టూరే బెటర్‌
పర్యాటక సంస్థలు వివిధ రకాల ప్రాంతాలకు టూర్‌ ప్యాకేజీలను ఇపుడు చౌకగానే అందిస్తున్నాయి. వీటిని ఎంపిక చేసుకోవడం వల్ల తోడుగా ఇతర పర్యాటకులు ఉంటారు. అలాగే, ఆయా ప్రాంతాల గురించి తెలియజేసే గైడ్లు కూడా వెంట ఉంటారు. పర్యటన పరిమితంగా ఉండాలని, తక్కువ ఖర్చులోనే పూర్తి చేసుకోవాలని అనుకునే వారికి ఈ ప్యాకేజీలు అనుకూలం.  అయితే ఎక్కువ సమయం పాటు, అదే ప్రాంతంలోని అన్ని విశేషాలనూ చూసేందుకు అవకాశం ఉండదు. మొదటిసారి విదేశీ పర్యటనలకు వెళ్లేవారికి ఇవి అనువైనవి.

స్వయంగానూ ప్లాన్‌ చేసుకోవచ్చు
ఒకవేళ తగిన సమయం, బడ్జెట్, అవగాహన ఉంటే కనక స్వయంగానూ ప్లాన్‌ చేసుకోవచ్చు. కాకపోతే తెలియని కొత్త ప్రాంతాల సందర్శనకు వెళుతుంటే మాత్రం ముందుగానే తగినంత సమాచారాన్ని రాబట్టుకుని అందుకు తగిన విధంగా ప్లాన్‌ చేసుకోవాలి. ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు రవాణా సదుపాయాలు చక్కగా ఉంటాయి. ధరలు కూడా అందుబాటులో ఉంటాయి. అదే అంతగా ప్రాచుర్యంలో లేని వాటిని ఎంచుకుంటే బడ్జెట్‌ ఎక్కువ అవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement