నిధుల గ్రహణం
సాక్షి, ఖమ్మం: జిల్లాలో అంగన్‌వాడీ భవన నిర్మాణాలకు నిధుల గ్రహణం పట్టింది. భవనాలు మంజూరై సంవత్సరాలు గడుస్తున్నా సరిపడా డబ్బు మంజూరు కాకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో ఈ ఏడాది కూడా అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగించాల్సి వస్తోంది. అయితే కొత్త ప్రభుత్వాలపై అంగన్‌వాడీ ఉద్యోగులు కోటి ఆశలు పెట్టుకున్నారు. నిధులు మంజూరు చేస్తే అద్దె భవనాల్లో అవస్థల నుంచి విముక్తి లభిస్తుందని వారు ఎదురుచూస్తున్నారు.
జిల్లాలో మొత్తం 3,670 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 1,634 సొంత భవనాలు కాగా, 2,036 కేంద్రాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. వీటిలో వసతులు సరిగా లేకపోవడం, శిథిలావస్థకు చేరుకోవడంతో ఆయా కేంద్రాల సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. నూతన భవనాలు మంజూరైనా అవి కాగితాలకే పరిమితం కావడంతో సిబ్బంది, పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత ఐదేళ్లలో జిల్లాకు బీఆర్‌జీఎఫ్, నాబార్డు, ఎల్‌డబ్ల్యూఈఏ, ఐఏపీ (ఇంప్లిమెంటేషన్ ఆన్యువల్ ప్రోగ్రామ్) కింద మొత్తం 1,364 అంగన్‌వాడీ భవనాలు మంజూరయ్యాయి. అయితే నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో ఏళ్లు గడిచినా ఇందులో ఇప్పటి వరకు 583 భవనాల నిర్మాణం మాత్రమే పూర్తయింది.
మిగిలిన కేంద్రాల పనుల్లో ఏమాత్రం పురోగతి లేదు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచే విడుదలయ్యే నిధులు కావడంతో జిల్లా స్థాయిలో అధికారుల పర్యవేక్షణ కూడా కొరవడింది. రూ.కోట్లలో నిధులు అవసరమని సంబంధిత అధికారులు ప్రతిపాదనలు పంపుతున్నా వాటికి మోక్షం కలగడం లేదు. చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు మిగతా పనులు పూర్తి చేయడానికి ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది కూడా అంగన్‌వాడీ నూతన భవనాల నిర్మాణం పూర్తయి, ఉపయోగంలోకి వచ్చేలా కనిపించడం లేదు.
పనులు ప్రారంభించని 159 కేంద్రాలు...
కొన్ని భవనాలు మంజూరైనట్లు కాగితాల్లో చూపిస్తున్నా.. ఏళ్లు గడిచినా ఇంకా నిర్మాణ పనులే ప్రారంభం కాకపోవడం గమనార్హం. బీఆర్‌జీఎఫ్ కింద మంజూరైన వాటిలో 2, ఐఏపీ ద్వారా మంజూరైన 157 భవనాల పనులు ప్రారంభానికే నోచుకోలేదు. ఇందులో అత్యధికంగా వెంకటాపురం మండలంలోనే 62 కేంద్రాలున్నాయి. ఇవి మంజూరైతే అయ్యాయి కానీ.. నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని ఐసీడీఎస్ అధికారులు చెపుతున్నారు.
వీటి కోసం పలుమార్లు ప్రతిపాదనలు పంపినా కేంద్రం నుంచి స్పందన లేదంటున్నారు. నిధులు విడుదల కాకపోవడంతో అసలు ఈ భవనాల నిర్మాణం పూర్తవుతుందా..? లేక మంజూరు రద్దు అవుతుందా..? అనే సందిగ్ధం నెలకొంది. కాగా, ప్రస్తుతం ఉన్న సొంత భవనాల్లోనూ 371 కేంద్రాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటి మరమ్మతుకు ఒక్కో భవనానికి రూ.లక్ష వరకు అవసరం. అయితే అంగన్‌వాడీ కేంద్రాలు తెరుచుకునే సమయం దగ్గర పడతున్నా.. ఈ నిధులూ మంజూరు కాలేదు. ఈ పరిస్థితుల్లో శిథిలావస్థకు చేరిన భవనాల్లోనే కేంద్రాలు నిర్వహించాల్సి రావడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడడంతో ఇకనైనా నిధులు విడుదలవుతాయని సిబ్బంది ఆశగా ఎదురుచూస్తున్నారు.