విద్యారణ్యపురి : పాఠశాలల రేషనలైజేషన్ ప్రక్రియకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ డీఎస్సీ అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లింది. రేషనలైజేషన్‌లో భాగంగా 20 మంది లోపు విద్యార్థులు ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, 75 మంది లోపు ఉన్న ఉన్నత పాఠశాలలను మూసివేసి సమీప పాఠశాలల్లో విలీనం చేస్తారు. ఈ మేరకు ఉపాధ్యాయులు, విద్యార్థులను సర్దుబాటు చేయనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయితే టీచర్ పోస్టుల నియామకాలు పెద్దగా ఉండకపోవచ్చని భావిస్తున్నారు. కొత్తగా డీఎస్సీ నిర్వహించినా జిల్లాలో అతి తక్కువ పోస్టులు మాత్రమే భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
త్వరలోనే షెడ్యూల్
ప్రభుత్వ పాఠశాలల్లో రేషనలైజేషన్ ప్రక్రియకు ఆమోదిస్తూ జీవో నంబర్ 6ను ప్రభుత్వం జారీ చేసింది. ఈ ప్రక్రియను అమలు చేసేందుకు సాధికారిక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. త్వరలోనే మార్గదర్శకాలు సైతం జిల్లా విద్యాశాఖాధికారులకు రానున్నాయి. ఇప్పటికే జిల్లా అధికారులు సైతం దీనిపై కసరత్తు మొదలు పెట్టారు. త్వరలోనే షెడ్యూల్‌ను సైతం ప్రకటించనున్నట్లు తెలిసింది. మార్గదర్శకాల షెడ్యూల్ అందగానే కొన్ని రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేయనున్నారు. జిల్లాలో 700 నుంచి 800 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సి ఉంటుందని విద్యాశాఖాధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా వందలాది పాఠశాలలు మూసివేత దిశగా కొనసాగుతుండడంపై ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
సర్దుబాటుతో సరి
తెలంగాణ రాష్ర్ట నూతన ప్రభుత్వం 2014లో డీఎస్సీ నిర్వహిస్తుందని బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వేలాది మంది అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారి ఆశలు అడియాసలయ్యాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో వివిధ కేటగిరీల్లో ఉపాధ్యాయ పోస్టుల వేకెన్సీల వివరాలను కొన్ని రోజుల క్రితం జిల్లా విద్యాశాఖ అధికారులు పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ కార్యాలయానికి పంపారు.
అందులో ఎస్‌జీటీ 672, పీజీహెచ్‌ఎం 40, ఎల్‌ఎఫ్‌ఎల్‌హెచ్‌ఎం 44, సీఐ 55, డ్రాయింగ్ మాస్టర్లు 25, పీఈటీలు 31 వేకెన్సీలు ఉండగా, స్కూల్ అసిస్టెంట్ల కేటగిరీలో ఎస్‌ఏ మ్యాథ్స్ 26, ఎస్‌ఏ ఇంగ్లిష్ 23, ఎస్‌ఏ తెలుగు 30, ఎస్‌ఏ ఉర్దూ 1, ఎస్‌ఏ హిందీ 18, ఎస్‌ఏ బయాలజికల్‌సైన్స్ 13, ఆర్ట్స్ 82, పీడీ 2, హిందీ పండిట్లు 39, తెలుగు పండి ట్లు 32 పోస్టులు వేకెన్సీలుగా పేర్కొన్నారు. ఇప్పుడు ఉపాధ్యాయుల రేషనలైజేషన్ ప్రక్రియ చేపడితే ఎస్‌జీటీ పోస్టులు అవసరం ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా మూతపడనున్న పాఠశాలల నుంచే ఖాళీగా ఉన్న ఎస్‌ఏ పోస్టులను సర్దుబాటు చేసే అవకాశం ఉంది.
అత్యధికం ప్రాథమిక పాఠశాలలే..
రేషనలైజేషన్ ప్రక్రియతో జిల్లాలో వందలాది పాఠశాలు మూత పడే అవకాశాలు ఉన్నాయి. 20 మంది లోపు ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, 75 మంది లోపు ఉన్న ఉన్నత పాఠశాలలకు తాళం పడనుంది. జిల్లాలో 2,298 ప్రాథమిక పాఠశాలలు ఉండగా రేషనలైజేషన్ ప్రక్రియతో 501 వరకు మూతపడే అవకాశాలు ఉన్నాయి. వీటిలో పదిలోపు విద్యార్థులున్న పాఠశాలలు 121 కాగా, 20లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు 380 ఉన్నాయి.
ఇక ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1నుంచి 5తరతగతకులకు కూడా ప్రాధమిక పాఠశాలల్లోగానే 20మంది విద్యార్థులుండాల్సిందే.అంతేగాకుండా 6,7 ,8తరగతుల్లోను 20లోపు విద్యార్థులుంటే వాటిని కూడా మూసివేస్తారు.
జిల్లాలో 397 ప్రాథమికోన్నత పాఠశాలలు(యూపీఎస్‌లు) ఉండగా అందులో 151 మూతపడే అవకాశం ఉంది. ఆయా పాఠశాలల్లోని విద్యార్థులను మూడు కిలోమీటర్ల పరిధిలోని పాఠశాలలకు తరలించనున్నారు. జిల్లాలో 601 ఉన్నత పాఠశాలలు ఉండగా 75 మంది లోపు ఉన్నవి 18 ఉన్నాయి. వీటిని కూడా మూసివేసే అవకాశం ఉంది.సక్సెస్ ైెహ స్కూళ్ల లో ఇంగ్లిష్ మీడియంలో 75మంది విద్యార్థులు ఉండా లి. లేకుంటే ఇంగ్లిష్ మీడియం కొనసాగించబోరని సమాచారం. మరోవైపు 30 మంది లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు 700 వరకు ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
చైర్మన్‌గా కలెక్టర్
2013-14 డైస్ లెక్కల ప్రకారం పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యను పరిగణలోనికి తీసుకుంటారు. జిల్లా పరిధిలో రేషనలైజేషన్ ప్రక్రియ కమిటీ చైర్మన్‌గా కలెక్టర్, జెడ్పీ సీఈఓ, డీఈఓ, ఆర్‌వీఎం పీఓ, ఐటీడీఏ పీఓలు సభ్యులుగా ఉంటారు. రెండేళ్ల క్రితం ఈ ప్రక్రియ చేపట్టినప్పుడు పదిమంది లోపు ఉన్న 171 పాఠశాలలు మూతపడ్డాయి. ఈసారి రేషన్‌లైజేషన్‌లో విద్యార్థుల సంఖ్య 20గా నిర్దేశించడంతో మూతపడను న్న పాఠశాలల సంఖ్య గణనీయంగా పెరిగింది. మార్గదర్శకాలు షెడ్యూల్ రాగానే డిప్యూటీ డీఈఓలతో సమావేశం ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.విజయకుమార్ యోచిస్తున్నారు.
డీఎస్సీ అభ్యర్థుల ఆశలు గల్లంతు
Published Mon, Sep 29 2014 5:14 AM | Last Updated on Fri, May 25 2018 5:44 PM
Advertisement