
సాక్షి, హైదరాబాద్: రైతు రుణాలపై బ్యాం కులు వసూలు చేసిన వడ్డీ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించిన ఫైల్‌ను వెంటనే సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ముందు బ్యాంకుల వారీగా లెక్కలు తీసి, తనకు అందించాలని ఆర్థిక శాఖకు సూచించారు. రూ.లక్ష లోపు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది.
ఇందుకు అనుగుణంగా నాలుగు దశల్లో రూ.17 వేల కోట్ల రుణాలు మాఫీ చేసింది. కానీ బ్యాంకులు రైతుల నుంచి వడ్డీ అదనంగా వసూలు చేశాయని ఆరోపణలు వచ్చాయి. ప్రతిపక్షాలు ఇదే విషయాన్ని అసెంబ్లీలో లేవనెత్తాయి. దీనిపై స్పందించిన సీఎం వడ్డీ కట్టిన రైతుల వివరాలు ఇస్తే చెల్లిస్తామని ప్రకటించారు. ఆ వివరాలను స్పీకర్ ద్వారా పంపాలని కోరారు. ప్రతిపక్షాలు కొన్ని వివరాలు అందించడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది.
ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా.. తామే లెక్కలు తీసి చెల్లించాలని సీఎం నిర్ణయించారు. ఒకట్రెండు రోజుల్లో ఆర్థిక శాఖ అధికారులు కొన్ని బ్యాంకులను సందర్శించి లెక్కలు తీయనున్నారు. దీన్నిబట్టి ఓ ఫార్మాట్ రూపొందించి బ్యాంకుల నుంచి పూర్తి వివరాలు సేకరించనున్నారు. ఇందులో భాగంగా అధికారులు మంగళవారం రంగారెడ్డి జిల్లాలోని బ్యాంకులకు వెళ్లనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment