సిరిసిల్లలో నేత కార్మికుడి ఆత్మహత్య
సిరిసిల్ల: సిరిసిల్లలో ఓ నేతన్నను అప్పులు బలిగొన్నాయి. పనిచేసినా పెద్దనోట్ల రద్దు కారణంగా ఆసామి కూలి డబ్బులు ఇవ్వకపోవడం, కూతురి పెళ్లికి చేసిన అప్పులు పెరిగిపోవడంతో దిక్కుతోచక బలవన్మ రణానికి పాల్పడ్డాడు. సిరిసిల్ల కేంద్రంలోని నెహ్రూనగర్‌కు చెందిన నేత కార్మికుడు దోమల రమేశ్(44) సోమవారం మానేరు నదీ తీరంలోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన కుటుంబాన్ని ఆదుకో వాలని కోరుతూ మంత్రి కేటీఆర్, కలెక్టర్ కృష్ణభాస్కర్ పేరిట సూసైడ్ నోట్ రాశాడు.
చేతిలో చిల్లిగవ్వ లేక..
రమేశ్ స్థానికంగా కోడం భిక్షపతి అనే ఆసామి వద్ద మరమగ్గాలు నడిపిస్తాడు. వారానికి రూ.1,500 కూలి వస్తుంది. ఏడాదిన్నర క్రితం తన పెద్దకూతురు రచనకు వివాహం చేశాడు. ఆ సమయంలో కొంత అప్పయింది. భార్య రేఖ బీడీ కార్మికురాలు. మరో కూతురు సౌమ్య(15) పదో తరగతి చదువుతోంది. సాంచాలు నడిపిన కూలి డబ్బులు రమేశ్‌కు అందలేదు. పెద్దనోట్ల రద్దుతో కొత్తనోట్లు లేక ఆసామి కూలి ఇవ్వలేదు. భార్య రేఖ బీడీలు తయారు చేసిన సొమ్ము చేతికందలేదు. చేతి లో చిల్లిగవ్వ లేకపోవడంతో.. కుటుంబ పోష ణ ఎలా అంటూ దిగులుపడ్డాడు. మరోవైపు అప్పు ఇచ్చిన వాళ్ల వేధింపులు ఎక్కువ య్యాయి. దీంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
రూ. వెయ్యి అప్పు కూడా పుట్టలే..
‘‘చేతిలో డబ్బులు లేవు.. చేసిన కాడ పైసలు రాలేదు.. బీడీల పైసలు కూడా ఇవ్వలేదు’’ అంటూ రమేశ్ భార్య రేఖ కన్నీరుమున్నీరైంది. ‘‘వెయ్యి రూపాయలు అప్పు అడిగినా ఎక్కడా పుట్టలేదు.. చేతిలో వంద రూపాయలు కూడా లేవు’’ అని ఆమె చెప్పింది. బాకీల బాధలతోనే ప్రాణం తీసుకున్నాడంటూ కన్నీరు పెట్టుకుంది.
మంత్రి సమావేశానికి హాజరై వచ్చి..
స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ సోమవారం సిరిసిల్లకు వచ్చారు. వెంకట్రావునగర్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సమావేశానికి రమేశ్ కూడా హాజరయ్యాడు. మంత్రి అక్కడ్నుంచి వెళ్లిపోగానే నేరుగా ఇంటికి చేరుకున్నాడు. టీ పెట్టుకొని తాగాడు. తర్వాత మానేరు వాగు తీరం వరకు వెళ్లి అక్కడే చెట్టుకు ఉరివేసుకున్నాడు.
సూసైడ్‌నోట్‌లో ఏం రాశాడు..?
‘‘శ్రీయుత గౌరవనీయులైన మంత్రి కేటీఆర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి..
నా పెద్దకూతురు వివాహం కోసం కొంత అప్పు చేసిన. అది తీర్చేదారిలేక ఆత్మహత్య చేసుకుంటున్న. నా కుటుంబాన్ని మీరే ఆదుకోవాలి. సిరిసిల్లలో 8 గంటల పని విధానం అమలు చేయాలి. ఒక్కో నేత కార్మికుడికి కూలి రోజూ రూ.500 వచ్చేలా చూడాలి. సౌమ్య నన్ను క్షమించమ్మా... నీ కడుపున కొడుకునై పుడతా. మనవరాలు రవళికి ఆఖరి ముద్దులు..’’ అని రమేశ్ సూసైడ్ నోట్ రాశాడు.
నేతన్న మెడకు అప్పుల ఉరి
Published Tue, Dec 13 2016 2:05 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM
Advertisement
Advertisement