వరంగల్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబరుచుకుని, పెళ్లికి నిరాకరించిన యువకుడికి వరంగల్ మొదటి అదనపు జిల్లా జడ్జి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. పోలీసుల కథనం ప్రకారం...సంగెం మండలం నార్లవాయికి చెందిన బాలిక మొండ్రాయి గ్రామంలోని పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన రాజమౌళి ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంట పడేవాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఆపై మరొకరిని వివాహం చేసుకోవటానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. బాధిత బాలిక తల్లిదండ్రులు కులపెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించగా రాజమౌళి పెళ్లికి నిరాకరించాడు.
దీంతో బాధితురాలు 2014 మేలో పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు రాజమౌళిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చారు. పదహారు మంది సాక్ష్యుల వాంగ్మూలాలను విచారించిన కోర్టు నేరం రుజువు కావటంతో ఐపీసీ సెక్షన్ 376(2) కింద యావజ్జీవ కారాగార శిక్ష, అత్యాచారాల నిరోధక చట్టం ఐపీసీ సెక్షన్ 417 కింద మరో మూడేళ్ల జైలు, రూ.25,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. పై శిక్షలన్నీ ఏకకాలంలో అమలు చేయాలని తీర్పులో పేర్కొన్నారు.