- ఆ ప్రాజెక్టుపై పార్టీ నేతలకు బాబు పాఠాలు
సాక్షి, హైదరాబాద్: పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై సొంత పార్టీ నేతలను ఒప్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక తంటాలు పడుతున్నారు. జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని నాలుగేళ్లలో పూర్తి చేయడానికి వీలున్న తరుణంలో మధ్యలో పట్టిసీమపై వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలన్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్న విషయం విదితమే.
ఈ నేపథ్యంలో ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు సొంత పార్టీ నేతలకు ఆ ప్రాజెక్టు ఆవశ్యకతను వివరిస్తున్నారు. ఈ ప్రాజెక్టు అనేక సందేహాలు వ్యక్తం చేస్తూ ఈ మధ్యనే ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. శాసనసభ సమావేశాలు జరుగుతున్నపుడు రెండు సార్లు టీడీపీ శాసనసభా పక్షం సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దాని ప్రాధాన్యతను వివరించడానికి ప్రయత్నించారు.
ఇప్పుడు పార్టీకి చెందిన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్లకు కూడా అలాంటి క్లాసులే సుదీర్ఘంగా తీసుకోవడం విశేషం. ఇదే సందర్భంలో ప్రతిపక్ష పార్టీపై విమర్శలు చేయాలంటూ వారికి ఉపదేశించారు. శనివారం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథి గృహంలో పార్టీ నేతలు, టీడీపీకి చెందిన జిల్లా పరిషత్ ప్రతినిధులతో చంద్రబాబు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. పట్టిసీమ ఎజెండాగా సాగిన ఈ సమావేశానికి లోకేశ్ కూడా హాజరయ్యారు. ప్రతిపక్షాల నుంచి ఈ ప్రాజెక్టుపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయని, వాటిపై నేతలంతా స్పందించాలని నేతలకు ఆదేశించినట్లు సమాచారం.