ఏ తల్లయినా, తండ్రయినా.. తమ సంతానానికి ఒక్కసారే జన్మనిస్తారు. కానీ, ఈ తండ్రి మాత్రం.. తన బిడ్డడికి పునర్జన్మ ప్రసాదించాడు. ఇదెలా సాధ్యం..? ఇదెక్కడ జరిగింది..? ఆ తండ్రీకొడుకులెవరు..? వీటన్నిటికి సమాధానమే ఈ కథనం...
ముదిగొండ : అతని పేరు దొంతగాని ఉప్పలయ్య. వికలాంగుడు. బీఈడీ పూర్తి చేశాడు. ఇతడికి భార్య లలిత.కుమారుడు శశికిరణ్ 9వ తరగతి, కుమార్తె 8వ తరగతి (మేడేపల్లిలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో) చదువుతున్నారు.
ఆ రోజు ఏమైందంటే...
ఒక రోజు, శశికిరణ్ బాగా నీరసించాడు. ఖమ్మంలోని ప్రయివేటు ఆసుపత్రికి తల్లిదండ్రులు తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి మందులు ఇస్తున్నారు. వాటిని వాడినా కూడా నీరసం తగ్గడం లేదు. సాధారణంగా, ఒకట్రెండు రోజుల్లో నీరసం తగ్గుతుంది. కానీ, శశికిరణ్‌ను మాత్రం అది వదలకుండా పట్టి పీడిస్తోంది. పదకొండు నెలలపాటు ఖమ్మం, హైదరాబాద్‌లోని అనేక ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
పిడుగులాంటి వార్త...
చివరికి, ప్రత్యేక వైద్య నిపుణులు పరీక్షించి, పిడుగులాంటి వార్తను బయటపెట్టారు. శశికిరణ్ నీరసానికి కారణాన్ని కనుగొన్నారు. అతడి కాలేయం పూర్తిగా పనిచేయడం లేదట. కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స చేయాలట. ఆ తల్లితండ్రులు తట్టుకోలేకపోయారు.
అప్పటికే ఆస్పత్రుల ఖర్చులకు పెద్ద మొత్తంలో ఖర్చయింది. కాలేయ మార్పిడికి లక్షల్లో ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. అవయవ దానానికి ఎవ్వరూ ముందుకు రాలేదు (బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి, వారి కుటుంబీకుల అంగీకారంతో అవయవాలను సేకరిస్తారు). ఆపరేషన్ ఆలస్యం చేస్తే ప్రాణానికే ముప్పు. ఆ తండ్రిలో నిరంతరం ఒక్కటే ప్రశ్న.. ఎలా...? ఎలా...? ఎలా...?
పునర్జన్మ ప్రసాదించాడు...
కాలేయ మార్పిడి ఆపరేషన్‌కు లక్షల రూపాయలు అవసరమవుతాయి. అదే, ఎవరైనా కాలేయ దానం చేస్తే ఖర్చు తగ్గుతుంది. చివరికి, తన కుమారుడు శశికిరణ్‌కు కాలేయం ఇవ్వడానికి ఆ తండ్రి ఉప్పలయ్య సిద్ధమయ్యాడు. అతడికి వైద్యులు అవసరమైన అన్ని పరీక్షలు చేశారు.
ఆపరేషన్ ద్వారా ఆయన కాలేయంలోని సగ భాగాన్ని తొలగించి, శశికిరణ్‌కు అమర్చారు. ఆరోగ్యశ్రీ ద్వారా హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో మూడు రోజుల క్రితం ఇది జరిగింది. ఉప్పలయ్య నుంచి తీసిన సగం కాలేయాన్ని శశికిరణ్ శరీరంలో అమర్చడానికి డాక్టర్లు ఒక రోజంతా శ్రమించారు (ఆపరేషన్ చేశారు). ఆపరేషన్ విజయవంతమైంది. శశికిరణ్ కోలుకునేందుకు దాదాపుగా నెల రోజులు పడుతుంది. అప్పటివరకు అతడిని స్పెషల్ ఐసీయూలో ఉంచుతారు.
అందరిలోనూ ఆనందం...
ఇప్పుడు ఉప్పలయ్య–లలిత దంపతులు హ్యాపీ... తమ బిడ్డడిని బతికించుకున్నందుకు..! వారి కుమార్తెకు హ్యాపీ... తన సోదరుడు కోలుకుంటున్నందుకు...!! పునర్జన్మ ప్రసాదించినందుకు తండ్రి ఉప్పలయ్యకు, పునర్జన్మ పొందినందుకు కుమారుడు శశికిరణ్‌కు డబుల్ హ్యాపీ...!!!
అభినందనల వెల్లువ
కాలేయ దానం ద్వారా కుమారుడికి పునర్జన్మ ప్రసాదించిన ఉప్పలయ్యకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. శశికిరణ్ వైద్య ఖర్చుల కోసం మేడేపల్లి పాఠశాల ఉపాధ్యాయులు 25వేల రూపాయలను తల్లికి లలితకు అందజేశారు. ఉప్పలయ్యకు తమ అభినందనలను తెలపాలని ఆమెను కోరారు. తమ విద్యార్థి శశికిరణ్ సంపూర్ణ ఆరోగ్యంతో రావాలని వారు ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment