‘లోకల్’ ఫైట్..
ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఒక్కసారిగా ఎన్నికల వేడి పుట్టింది. నాలుగేళ్లుగా ఖాళీగా ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ జారీ చేయడమే ఇందుకు కారణం.
సార్వత్రిక ఎన్నికలకు ముందే స్థానిక సంస్థల షెడ్యూల్ జారీ కావడంతో రాజకీయ నాయకులతోపాటు అధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారు. తక్కువ సమయంలో ఎన్నికల నిర్వహణ వీరికి సవాల్‌గా మారింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మునిసిపల్, సాధారణ ఎన్నికలు ఒకేసారి వచ్చిన దాఖలాలు ఇప్పటివరకు లేవు. సుప్రీంకోర్టు జోక్యంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక ఎన్నికలను నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ఎన్నికల అధికారి రమాకాంత్‌రెడ్డి సోమవారంఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. జిల్లాల వారీగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈనెల 17వ తేదీన జారీ చేయనున్నట్లు వెల్లడించారు.
జెడ్పీలో జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ
జిల్లాలోని 50 మండలాల్లో జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులుగా పోటి చేసే అభ్యర్థుల నామినేషన్లను జిల్లా పరిషత్ కాార్యాలయంలో స్వీకరించనున్నారు. రెవెన్యూ డివిజన్ల వారీగా జిల్లాపరిషత్‌లో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఎస్‌డీసీ, ఆర్డీఓ కేడర్ అధికారులను నియమించనున్నారు.
మండల కార్యాలయాల్లో ఎంపీటీసీల నామినేషన్లు...
మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులుగా పోటి చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణకు ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఆయా మండల ప్రత్యేక అధికారులే ఆర్‌ఓలుగా ఈ నామినేషన్లను స్వీకరించనున్నారు.
ఆర్‌ఓలు, ఏఆర్‌ఓ నియామకానికి కసరత్తు
మండల పరిషత్ కార్యాలయాల్లో ఎంపీటీసీల నుంచి నామినేషన్లు స్వీకరించడమే కాకుండా ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ తదితర కార్యక్రమాలు నిర్వహించేందుకు మండల రిటర్నింగ్ అధికారులు (ఆర్‌ఓ), అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ (ఏఆర్‌ఓ) నియామకానికి జిల్లా పరిషత్ ఎలక్షన్ విభాగం కసరత్తు ప్రారంభించింది. ఆయా మండలాలకు చెందిన స్పెషల్ ఆఫీసర్లను రిటర్నింగ్ అధికారులుగా, తహసీల్దార్, ఎంపీడీఓలను ఏఆర్‌ఓ (సహాయక రిటర్నింగ్ అధికారి)లుగా నియమించనున్నారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్.
మార్చి 17 : జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీ, ఓటర్ల జాబితా ప్రద ర్శన
మార్చి 17 : నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
మార్చి 20 : నామినేషన్ల స్వీకరణకు తుది గడువు
మార్చి 21 : నామినేషన్ల స్క్రూటినీ, తిరస్కరణ
మార్చి 22 : తిరస్కరణ నామినేషన్లపై అప్పీళ్ల స్వీకరణ
మార్చి 23 : అప్పీళ్ల పరిష్కారం
మార్చి 24 : నామినేషన్ల ఉపసంహరణ (మ. 3 గంటల లోపు),
బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రదర్శన
ఏప్రిల్ 6 : పోలింగ్ (ఉ. 7-సా. 5గం.)
ఏప్రిల్ 7 : రీపోలింగ్ (అవసరముంటే)
ఏప్రిల్ 8 : ఓట్ల లెక్కింపు (ఉ. 8గం.కు షురూ), ఫలితాల ప్రకటన