
ఫీజుకు ప్రాతిపదిక 1956
స్థానికత నిర్ధారణపై కేసీఆర్ ఆదేశం
వేరే రాష్ట్ర విద్యార్థులకు ‘ఫీజులు’ చెల్లించకూడదు
పకడ్బందీ చట్టం రూపొందించాలని అధికారులకు సీఎం సూచన
వారం రోజుల్లో ఉత్తర్వులు!
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో స్థానికత నిర్ధారణకు 1956 కన్నా ముం దు నుంచీ తెలంగాణలో నివసించడాన్నే ప్రాతిపదికగా తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. దీనికి న్యాయపరమైన అడ్డంకులు ఎదురుకాకుండా పకడ్బందీ చట్టాన్ని రూపొందించాలని, తెలంగాణ విద్యార్థులు నష్టపోకుండా చూడాలని స్పష్టం చేశారు. తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు 1956 కన్నా ముందు నుంచీ తెలంగాణలో నివసించిన వారినే స్థానికులుగా గుర్తించాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఏ ఆధారంగా స్థానికతను గుర్తిస్తారనే వాదనలూ వచ్చాయి. ఈ నేపథ్యలో ఈ అంశంపై ఇప్పటికే సమీక్షించిన సీఎం కేసీఆర్ శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఆర్థిక, విద్యా, సంక్షేమ, న్యాయశాఖ అధికారులతో మరోసారి సమీక్షా సమావేశం నిర్వహించారు. ‘‘తెలంగాణ బిడ్డలకే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇద్దామని ఇప్పటికే స్పష్టం చేశాం. దానికే కట్టుబడి ఉన్నాం. తెలంగాణ పిల్లలు ఆంధ్రప్రదేశ్‌లో చదివినా.. దేశంలో ఎక్కడ చదువుకుంటున్నా అర్హులైన వారందరికి తెలంగాణ ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుంది. దీనిపై రాద్ధాంతం అనవసరం. హైదరాబాద్ స్టేట్ ఆంధ్రరాష్ట్రంలో కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తరువాతే సీమాంధ్ర వాళ్లు తెలంగాణ జిల్లాలకు వచ్చారు. అంటే వారి బీజాలన్నీ ఆంధ్రావే కదా. అలాంటి వారికి తెలంగాణ ప్రభుత్వం ఎలా ఫీజులు చెల్లిస్తుంది. మరోసారి పూర్తిగా అధ్యయనం చేసి నివేదికలు రూపొందించండి. రెండు మూడు రోజుల్లో మరోసారి సమావేశమవుదాం. క చ్చితమైన చట్టాన్ని రూపొందిద్దాం. ఏ కోర్టుకు వెళ్లినా మన పిల్లల ప్రయోజనాలకు భంగం కలగకూడదు. అలాగే వేరే రాష్ట్రం వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం ఫీజులు చెల్లించకూడదు..’’ అని కేసీఆర్ అధికారులకు స్పష్టం చేశారు. అయితే ఈ సమావేశంలో 1969, 1973 సంవత్సరాలలో ఒకదానిని కటాఫ్ ఏడాదిగా గుర్తించి, ఆయా సంవత్సరాలకు ముందు నుంచీ నివసిస్తున్న వారిని స్థానికులుగా గుర్తించాలన్న అంశంపైనా చర్చ జరిగింది. కానీ ముఖ్యమంత్రితో పాటు అధికారులు కూడా 1956 సంవత్సరాన్నే కటాఫ్ ఏడాదిగా గుర్తించాలని అభిప్రాయం వ్యక్తం చేశారని విశ్వసనీయ సమాచారం. దీనికి సంబంధించి వారం రోజుల్లోపే స్పష్టమైన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎస్ రాజీవ్ శర్మ, ఏజీ రామకృష్ణారెడ్డి, అదనపు ఏజీ రాంచందర్‌రావు, విద్యాశాఖ కార్యదర్శి నాగిరెడ్డి, సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.