తాళం వేసి ఉన్న వక్ఫ్‌బోర్డు కార్యాలయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు తాళం పడింది. ఇటీవల మైనారిటీ సంక్షేమంపై సీఎం సమీక్షలో వక్ఫ్ భూమలపై అధికారులు చెప్పిన వివరాలకు ఆయన సంతృప్తి చెంద లేదు. బోర్డు అవినీతి అంశాన్ని సీఎం కేసీఆర్ సీరియస్‌గా తీసుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి కీలక రికార్డులను స్వాధీనం చేసుకుని, ఆయా విభాగాల గదుల న్నింటిని సీజ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వక్ఫ్ బోర్డు కార్యకలాపాలపై పూర్తిగా ఆరా తీయాలన్న కేసీఆర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు మంగళవారం అర్ధరాత్రి నుంచి తనిఖీలు చేపట్టారు.
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణా, రెవెన్యూ డివిజన్ అధికారి చంద్రకళ, డిప్యూటీ సీఎం ఓఎస్‌డి అసదుల్లా, పలువురు మండల రెవెన్యూ అధికారులతో హైదరాబాద్ హజ్‌హౌస్‌లోని వక్ఫ్‌బోర్డు కార్యాలయంపై ఆకస్మిక దాడి చేశారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల వరకు రికార్డులను పరిశీలించి.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. తిరిగి బుధవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెవెన్యూ డివిజన్ అధికారి కె.చంద్రకళ ఆధ్వర్యంలో అధికారుల బృందం హజ్ హౌస్‌లోని వక్ఫ్‌బోర్డు విభాగాల్లోని రికార్డులను పరిశీలించి.. ఎక్కడికక్కడే సీజ్ చేసింది. వక్ఫ్‌బోర్డు సీఈవో, చైర్మన్ గదులు వదిలి పెట్టి మిగతా వక్ఫ్ బోర్డు రికార్డు విభాగంతో పాటు గణాంకాల, కంప్యూటర్, పరిపాలన, వివాహాల రిజిస్ట్రేషన్, జిల్లా ల్యాండ్ రికార్డుల విభాగం గదులన్నింటినీ రెవెన్యూ అధికారులు సీల్ చేసి ముద్ర వేశారు. దీంతో వక్ఫ్‌బోర్డు కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి.
వక్ఫ్ భూముల స్వాహా: కోట్లాది విలువైన వేలాది ఎకరాల వక్ఫ్ భూములు స్వాహాకు గురయ్యాయి. దేవుడి భూములను పర్యవేక్షించాల్సిన వక్ఫ్ అధికారుల అండదండలతో ముతవల్లిలు దర్జాగా దందా సాగించారు. అక్రమంగా భూముల విక్రయం, లీజు, నిర్మాణాల పేరుతో కోట్లాది రూపాయల ఆదాయాన్ని దిగమింగారు. దర్గా, మసీదు, ఆశ్రుఖానా, చిల్లాల స్థలాలతో పాటు శ్మశాన వాటికల స్థలాలు సైతం వదలకుండా స్వాహా చేశారు. వక్ఫ్ చట్టాలు, నోటీసుల జారీ కాగితాలకే పరిమితమవడంతో అక్రమార్కులకు అడ్డూ అదుçపూ లేకుండా పోయింది.
57,423.91 ఎకరాల భూమి అన్యాక్రాంతం: రాష్ట్రంలో వక్ఫ్‌బోర్డుకు సంబంధిం చిన సుమారు 74 శాతం భూమి ఆక్రమణకు గురైనట్లు అధికార లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. వక్ఫ్ పరిధిలోని 33,929 సంస్థలకు ఉన్న 77,538.07 ఎకరాల భూమిలో 57,423.91 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. అధికంగా ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో వక్ఫ్ భూములు అన్యాక్రాంతమయ్యాయి. కాగా, రాష్ట్ర వక్ఫ్ బోర్డులో అక్రమాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్‌మెంట్ గ్రేటర్ అధ్యక్షుడు అబ్దుల్లా సొహెల్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు ముందు ధర్నా చేశారు. సీఎం వక్ఫ్ రికార్డులను సీజ్ చేయడాన్ని స్వాగతిస్తున్నామని, ఈ అక్రమాలపై సీఐడీతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment