మెదక్ పార్లమెంట్ బరిలో నిలిచేందుకు కాంగ్రెస్ నేతల్లో పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే లోక్‌సభ టికెట్ కోరుతున్న నేతల సంఖ్య తక్కువగానే ఉంది. కాంగ్రెస్ పార్టీలోని బడా నేతలు ఎవరూ లోక్‌సభ బరిలో దిగేందుకు ఉత్సాహం చూపడం లేదు. ఈ నెలాఖరు వరకు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దీంతో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. పోటీ చేసే ఆశావహుల నుంచి పీసీసీ వర్గాలు దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. మెదక్ స్థానానికి ఇప్పటి వరకు కేవలం మూడు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఈనెల 20వ తేదీ వరకు పీసీసీ చీఫ్ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
సాక్షి,మెదక్: దరఖాస్తులను 20వ తేదీ తర్వాత పీసీసీ వర్గాలు ఏఐసీసీకి పంపనున్నారు. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ఈ నెలాఖరున కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నారు. కాగా మెదక్ ఎంపీ స స్థానం నుంచి పోటీచేసేందుకు కాంగ్రెస్ నేతలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మాజీ ఎంపీ విజయశాంతి పోటీచేస్తారని ముందుగా ప్రచారం సాగింది. అయితే ఆమెకూడా పోటీ చేసేందుకు ఇష్టపడటం లేదని ఆమె అనుచరులు చెబుతున్నారు. తెలంగాణలోని మరోస్థానం నుంచి ఆమె పోటీలో నిలవాలని యోచిస్తున్నట్లు సమాచారం. మాజీ మంత్రి సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి కూడా పోటీచేస్తారని భావించినప్పటికీ ఆమె కూడా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. కాంగ్రెస్ ముఖ్యనేతలు ఎవరూ పోటీచేసేందుకు ఆసక్తి కనబర్చడం లేదు.
అయితే జిల్లాకు చెందిన కొందరు నేతలు మాత్రం ఎంపీగా పోటీచేస్తామని ముందుకు వస్తున్నారు. అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేత డాక్టర్ శ్రవణ్ కుమార్‌రెడ్డి సోమవారం పీసీసీకి దరఖాస్తు చేసుకున్నాడు. ఆయనతోపాటు కాంగ్రెస్ నాయకుడు మద్దుల సోమేశ్వర్‌రెడ్డి, తన భార్య మద్దుల ఉమాదేవికి టిక్కెట్ ఇవ్వాలని దరఖాస్తు సమర్పించారు. అలాగే యువజన కాంగ్రెస్ నాయకుడు సంతోష్‌రెడ్డి మంగళవారం దరఖాస్తు చేసుకున్నాడు. ఇదిలా ఉంటే సంగారెడ్డి ఎమ్మెల్యే జయప్రకాశ్‌రెడ్డి తన భార్య నిర్మలారెడ్డిని మెదక్ ఎంపీ బరిలో దింపాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం తన భార్య నిర్మలకు టిక్కెట్ ఇస్తే ఎంపీగా గెలిపిస్తానని చెబుతున్నారు.
తూర్పు జయప్రకాశ్‌రెడ్డి తన భార్య నిర్మలకు టిక్కెట్ ఇప్పించేందుకు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. పటాన్‌చెరువు నియోజకవర్గానికి చెందిన మైనార్టీ నాయకుడు ఎం.ఏ. ఫయీం సైతం ఎంపీ టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం జిల్లా నేతలకు టిక్కెట్ ఇస్తుందా? బయటి నేతలకు టికెట్ ఇస్తుందా? అన్నది వేచి చూడాల్సి ఉంది. మరోవైపు బీజేపీ పార్టీలోనూ ఎంపీ అభ్యర్థుల ఎన్నికపై కసరత్తు జరుగుతుంది. ఇటీవల మెదక్ అసెంబ్లీనుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన రాజయ్య ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. ఆయన మినహా నాయకులు ఎవరూ పోటీ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment