సాక్షిప్రతినిధి, నల్లగొండ : లోక్‌సభ ఎన్నికలపై అధికార టీఆర్‌ఎస్ ముందస్తు ఏర్పాట్లలో బిజీగా ఉంది. పార్టీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ఎదుటి పక్షం బలాబలాలను అంచనా వేయడంలో మునిగిపోయింది. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దాదాపు పూర్తిగా టీఆర్‌ఎస్‌కే అనుకూలంగా వెలువడ్డాయి. ఒక్కో పార్లమెంటు నియోజకర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజారిటీ టీఆర్‌ఎస్ స్థానాలు ఖాతాలో చేరాయి. ఉమ్మడి నల్లగొండకు సంబంధించి నల్లగొండ, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాలు ఉండగా, భువనగిరి నుంచి గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున గెలిచిన ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్‌కు మళ్లీ టికెట్ ఖాయమని చెబుతున్నారు. దీంతో ఇక్కడ కొత్తగా అభిప్రాయ సేకరణ, పరిస్థితిపై అంచనాకు రావాల్సిన అవసరం అంతగా లేదని తెలుస్తోంది.
కానీ, గత ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైన నల్లగొండపై పార్టీ నాయకత్వం పట్టుదలగా ఉందని పేర్కొంటున్నారు. దీంతో ఈ స్థానంలో ఈసారి ఎలాగైనా గెలిచి తీరేలా వ్యూహాన్ని రచిస్తోందని సమాచారం. ప్రస్తుత నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇప్పుడు టీఆర్‌ఎస్‌లోనే ఉన్నా.. ఆయన 2014 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచింది కాంగ్రెస్ నుంచి. దీంతో ఈ సారి టీఆర్‌ఎస్ గుర్తుపైనే ఇక్కడ విజయం సాధించాలన్న కసి పార్టీ అగ్రనాయకత్వంలో ఉంది. దీంతో ఈ స్థానం నుంచి సీఎం కేసీఆర్ కూడా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే, కేసీఆర్ పోటీ చేస్తారని కానీ, చేయరని కానీ ఇద్దమిద్దంగా చెప్పే పరిస్థితిలో పార్టీ వర్గాలు లేవు. ఈ కారణంగానే ఎరు పోటీ చేసే అవకాశం ఉంటుందన్న అంశంపై భిన్నాభిప్రాయం వ్యక్తమవుతుండగా, మరో వైపు పార్టీ అధినాయకత్వం మాత్రం నల్లగొండ ఎంపీ స్థానంపై తన వ్యూహంలో తనుందని అంటున్నారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని అంచనా వేయడం.. ఎవరు అభ్యర్థి అయితే గెలుపు తేలికవుతుంది..? వంటి వివరాల సేకరణ కోసం ఆ నాయకత్వం ఒక సర్వే జరిపించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
రహస్య సర్వే ?
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే.. నల్లగొండ ఎంపీ స్థానంలో టీఆర్‌ఎస్ పూర్తి ఆధితప్యం ప్రదర్శించింది. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో హుజూర్‌నగర్ మినహా ఆరు చోట్ల ఆ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. మొత్తంగా వారందరి మెజారిటీ లక్ష ఓట్లకు పైగానే ఉంది. ఇదే ఫలితం పునరావృతం అయితే.. ఎంపీ స్థానంలో గెలుపు టీఆర్‌ఎస్‌కు నల్లేరుపై నడకే కానుంది. కానీ, టీఆర్‌ఎస్ అభ్యర్థి, కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగే ప్రత్యర్థిని బట్టి పోటీ ఉండే వీలుంది. దీంతో చాలా ముందస్తుగానే అభ్యర్థి ఎవరైతే ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు, ఓ అంచనాకు వచ్చేందుకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ రహస్యంగా ఓ సర్వే జరిపించారని తెలిసింది. వాస్తవానికి ఈ నియోజకవర్గం నుంచి రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి, ఎన్‌ఆర్‌ఐ జలగం సుధీర్ టికెట్ ఆశావహుల్లో ఉన్నారు.
ఒకవేళ సీఎం కేసీఆర్ ఇక్కడినుంచి పోటీ చేస్తే ఇక, ఎలాంటి శషబిషలు లేవు. మరోవైపు గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచే పోటీ చేసిన ప్రస్తుత ఎమ్మెల్సీ, శాసన మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మరో మారు నల్లగొండ నుంచి ఎంపీ స్థానంలో పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. అధినేత ఆదేశిస్తే.. ప్రస్తుతం ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పోటీ చేయరని చెప్పలేమన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. వీరందరిలో ఎవరు ఎంపీ అభ్యర్థి అయితే మెరుగ్గా ఉంటుందో తెలుసుకునేందుకు పార్టీ అగ్రనాయకత్వం ఒక సర్వే జరిపించిందని సమాచారం. ముందుగా ఇద్దరు నాయకుల పేర్లతో నియోజకవర్గంలో సర్వే జరిగిందని చెబుతున్నారు. మార్చి 11వ తేదీన నల్లగొండలో పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ లోగా సర్వేలపై మరికొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment