బతకాలని ఒకరు.. బతికించుకోవాలని మరొకరు
► కిడ్నీ ఫెయిల్యూర్‌తో చావుబతుకుల్లో యువకుడు
► ఆర్థిక సాయం కోసం ఎదురుచూపు
సాక్షి, హైదరాబాద్: భర్తను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమెకు కొడుకే ఓ ధైర్యం అనుకుంది. కానీ విధి ఆమెపట్ల మరోలా ఆలోచించింది. తోటి స్నేహితుల మధ్య సరదాగా గడపాల్సిన ఆ యువకుడు అకస్మాత్తుగా అనారోగ్యంతో మంచం పట్టాడు. కడుపు తీపికి కడుపు కోతకు మధ్య జీవచ్ఛవంలా కన్నకొడుకు కళ్లముందే కదల్లేక మంచానికి పరిమితం కావడంతో చూడలేక ఆ తల్లి తల్లడిల్లిపోతోంది. కన్నకొడుకుని బతికించుకు నేందుకు వైద్యం చేయించే స్తోమత లేక సాయం కోసం ఆ తల్లి ఆశగా ఎదురు చూస్తోంది. హైదరాబాద్ రాయదుర్గానికి చెందిన గోపాలకృష్ణ, ఈశ్వరమ్మ దంపతుల చిన్న కుమారుడు కందాళ రజినీకాంత్ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
2014లో ఉన్నట్టుండి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అప్పటికే తండ్రి గోపాలకృష్ణ కూడా చనిపోయాడు. తల్లి ఈశ్వరమ్మ తన కుమారుడిని చికిత్స కోసం నిమ్స్‌లో చేర్పించగా, పరీక్షించిన వైద్యులు కిడ్నీ పనితీరు దెబ్బతిన్నట్లు గుర్తించారు. దీంతో తల్లి ఈశ్వరమ్మ తన రెండు కిడ్నీల్లో ఒక కిడ్నీని కుమారుడికి దానం చేసేందుకు ముందుకు వచ్చింది. 2015లో నిమ్స్‌లోని డాక్టర్ గంగాధర్ ఆయనకు కిడ్నీ మార్పిడి చికిత్స చేశారు. ఇందుకోసం రూ.15 లక్షల వరకు ఖర్చు చేశారు. ఇన్‌ఫెక్షన్ కావడం, సర్జరీ సక్సెస్ కాకపోగా రజినీకాంత్ సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.
దీంతో ఏడాది క్రితం ఆయన మరోసారి నిమ్స్ వైద్యుడు డాక్టర్ గంగాధర్‌ను సంప్రదించాడు. మరోసారి కిడ్నీ మార్పిడి చేయాలని సూచించారు. ప్రస్తుతం వారానికి 3 సార్లు డయాలసిస్ నిర్వహిస్తున్నారు. ఆయన అక్క వినోద తన రెండు కిడ్నీల్లో ఒక కిడ్నీని తమ్ముడు రజినీకాంత్‌కు దానం చేసేందుకు అంగీకరించింది. ఇప్పటికే కొడుకు వైద్యం కోసం తల్లి ఉన్న ఆస్తినంతా అమ్మేయడంతో ప్రస్తుతం ఆమె ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. బిడ్డ ఆరోగ్య పరిస్థితి చూడలేక, వైద్యం చేయించే స్తోమత లేక ఆ తల్లి విలవిల్లాడిపోతోంది. ఎవరైనా దాతలు ఆర్థిక సాయం చేస్తే తన కుమారుడిని కాపాడుకుంటానని వేడుకుంటోంది. మరిన్ని వివరాల కోసం 79897 57052 ఫోన్ నంబర్‌లో సంప్రదించవచ్చు.