సాక్షి,విజయనగరం ఫోర్ట్: గంట్యాడ మండలానికి ఓ మహిళ తలనొప్పి, కాలు నొప్పులకు నొప్పి మాత్రలు (పెయిన్ కిల్లర్స్) ఎక్కువుగా వినియోగించింది. డాక్టర్ సలహా లేకుండా సొంతంగా మెడికల్ షాపుల్లో మాత్రలు కొనుగోలు చేసుకుని వేసుకునేది. కొద్ది కాలానికి ఆమె రెండు కిడ్నీలు పాడయ్యాయి. ప్రస్తుతం ఆమె డయాలసిస్ చేయించుకుంటోంది. అలాగే విజయనగరం మండలానికి చెందిన ఓ వ్యక్తి కూడా పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వినియోగంచడంతో అతని కిడ్నీలు కూడా పాడయ్యాయి.
ఇలా వీరిద్దరే కాదు.. ఎంతోమంది ప్రజలు చిన్నపాటి నొప్పికి కూడా పెయిన్‌కిల్లర్స్ వినియోగిస్తూ కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారు. తాత్కలికంగా నొప్పి తగ్గడం కోసం వినియోగిస్తున్న ఈ మాత్రలు కొత్త అనారోగ్యాన్ని తెచ్చి పెడుతున్నాయి. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోయే దానికి కూడా చాలా మంది మోతాదుకు మించి మాత్రలు వేసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
రూ. 5 కోట్లకు పైగా మాత్రల వినియోగం..
జిల్లా వ్యాప్తంగా క్లినిక్‌లు, కార్పొరేట్ ఆస్పత్రులు, నర్సింగ్‌హోమ్‌లు 350 నుంచి 400 వరకు ఉన్నాయి. అదేవిధంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో 68 పీహెచ్‌సీలు, 20 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 11 సీహెచ్‌సీలు, జిల్లా కేంద్రాస్పత్రి, పార్వతీపురం ఏరియా ఆస్పత్రి, ఘోషా ఆస్పత్రి ఉన్నాయి. అదేవిధంగా ఆర్‌ఎంపీలు1500 నుంచి 2 వేల వరకు ఉంటారు. ఆయా ఆస్పత్రులు, ఆర్‌ఎంపీలు, నేరుగా కొనుగోలు ద్వారా ఏడాదికి జిల్లాల్లో రూ. 5 కోట్లకు పైగా పెయిన్ కిల్లర్స్ విక్రయాలు జరుగుతున్నాయి.
వైద్యుల సలహాలు పాటించడం లేదు:
ఏ జబ్బుకైనా డాక్టర్లు పరీక్ష చేసి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. కాని ఇప్పుడు మందుల దుకాణాల్లో ఉండే సేల్స్‌బాయ్స్ వైద్యులైపోయారు. డాక్టర్ల చీటీ లేకుండానే నేరుగా మందులు ఇచ్చేస్తున్నారు.
వేసుకోరాదు..
సొంతంగా పెయిన్ కిల్లర్స్ మాత్రలు కొనుగోలు చేసి వేసుకోరాదు. తప్పనిసరిగా డాక్టర్ సలహా మేరకే మందులు వాడాలి. ఎక్కువగా వాడితే కిడ్నీలపై ప్రభావం పడుతుంది. అలాగే కాలేయం, జీర్ణాశయం దెబ్బతింటాయి.
డాక్టర్ బోళం పద్మావతి, జనరల్ ఫిజీషియన్
Comments
Please login to add a commentAdd a comment