Diagnose The Disease Before Going To The Doctor - Sakshi
Sakshi News home page

గూగుల్‌లో సెర్చ్‌ చేస్తున్నారా?.. డేంజర్‌లో పడ్డట్టే.. డాక్టర్ల వార్నింగ్‌ ఇదే..

Published Sat, Mar 18 2023 4:50 AM | Last Updated on Sat, Mar 18 2023 9:43 AM

Diagnose the disease before going to the doctor - Sakshi

లబ్బీపేట (విజయవాడ తూర్పు): సాధారణంగా ఒంట్లో నలతగా ఉంటే ఏం చేస్తాం.. డాక్టర్‌ దగ్గరకు వెళ్లి సమస్యను చెప్పుకుంటాం. బాధితుడు చెప్పిన లక్షణాల ఆధారంగా ఆయన  అందుకు అవసరమైన మందులు రాసి వాడమంటారు. ఆ తర్వాత ఫార్మసీకి వెళ్లి వాటిని కొనుక్కుని వాడుతుంటాం. ఇది రివాజు.  కానీ, ఇప్పుడు నయా ట్రెండ్‌ మొదలైంది. డాక్టర్‌ స్థానంలో గూగుల్‌ వచ్చి చేరింది. జనాలకు ఏ ఇబ్బంది వచ్చినా ముందుగా గూగుల్‌లో ఆ లక్షణాలను సెర్చ్‌ చేసేసి అది ఏ రోగమో తెలుసుకుని ఆ తర్వాత డాక్టర్‌ దగ్గరికి వెళ్లి తమకు ఫలానా రోగం ఉంది.. వైద్యం చేయమంటున్నారు.

కరోనా తదనంతర కాలంలో యువత, విద్యావంతుల్లో ఈ తరహా సంస్కృతి పెరిగిపోతోందని వైద్యులంటున్నారు. ఈ సిండ్రోమ్‌ను ‘ఇంటర్నెట్‌ డిరైవ్డ్‌ ఇన్ఫర్మేషన్‌ అబ్‌స్ట్రక్షన్‌ ట్రీట్‌మెంట్‌’ అని సంబోధిస్తారని డాక్టర్లు చెబుతున్నారు. ఆరోగ్యంపట్ల అతిగా ఆదుర్దా పడడం.. అనవసరంగా దీని గురించి నెట్‌లో సెర్చ్‌ చేయడం ఈ సిండ్రోమ్‌ ప్రధాన లక్షణం. ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఇటీవల కాలంలో ఎక్కువవుతున్నారు.

అంతేకాదు.. వైద్యుడు మందులు రాసిన తర్వాత కూడా వాటి గురించి గూగుల్‌లో వెతుకుతున్నారు. అక్కడ చూపించే దుష్ఫలితాలను చూసి మందులు వాడకుండా మానేస్తున్నారని.. ఇలాంటివి కోవిడ్‌ సమయంలో ఎక్కువగా జరిగినట్లు వైద్యులంటున్నారు. ఇంటర్నెట్‌ బాగా  విస్తృతమవడంతో ప్రజల్లో కూడా ఈ తరహా వెతుకులాట ఎక్కువైందని వారు అభిప్రాయపడుతున్నారు.  

 కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు 
ఇక ఇలా ప్రతి విషయాన్ని గూగుల్‌లో సెర్చ్‌ చేయడం ద్వారా ప్రజలు కొత్త సమస్యలను కొనితెచ్చుకుంటున్నారని డాక్టర్లు చెబుతున్నారు. మందులు, జబ్బు విషయంలో ఏదైనా సందేహం ఉంటే వైద్యుడిని అడిగి నివృత్తి చేసుకోవాలే కానీ, గూగుల్‌లో వెతకడం సరైన విధానం కాదని వారంటున్నారు.

ఒక రకం మందు లక్ష మంది వాడితే వారిలో ఒకరికో ఇద్దరికో దుష్ఫలితాలు కనపడినా గూగుల్‌లో పెడుతుంటారని, దానిని చూసి మందు వాడకుంటే, జబ్బు ముదిరి ప్రాణాల మీదకు వస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చివరికి జ్వరానికి వాడే క్రోసిన్‌కు కూడా దుష్ఫలితాలు ఉన్నట్లు గూగుల్‌లో చూస్తారని, వైద్యులు అంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. 

అవసరం మేరకు టెక్నాలజీని వాడుకోవాలి  
ఇంటర్నెట్‌ టెక్నాలజీని అవసరం మేరకు మాత్రమే వాడుకోవాలి. అంతేకానీ, జబ్బు చేసినప్పుడు వైద్యుడిని సంప్రదించకుండా గూగుల్‌లో చూసి మందులు వాడటం, గూగుల్‌లో చూసి జబ్బును నిర్ధారించడం సరైన పద్ధతి కాదు.

అలాగే, వైద్యుడు రాసిన మందులను సైతం గూగుల్‌లో సెర్చ్‌చేసి, అక్కడున్న దుష్ఫలితాలను చూసి మందులు వాడటం మానేస్తున్నారు. దీంతో జబ్బు ముదిరి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కోవిడ్‌ సమయంలో ఇలాంటి ఘటనలు ఎక్కువుగా చూశాం. ఏదైనా సమస్య ఉంటే వైద్యుడిని సంప్రదించి పరిష్కరించుకోవాలి. 
– డాక్టర్‌ గర్రే శంకరరావు, సైకాలజిస్ట్, విజయవాడ  

జబ్బును నిర్ధారించేది వైద్యుడే  
ఏదైనా సమస్యతో వైద్యుని వద్దకు వచ్చే రోగి, తనకున్న రోగం ఏమిటో చెప్పేస్తున్నారు. గూగుల్‌లో చూశామండి.. దానికి చికిత్స అందించమని అడుగుతున్నారు. అస­లు లక్షణాలు చెప్పమంటే ఏదేదో చెబుతున్నారు. ఇది సరైన విధానం కాదు.

గూగుల్‌లో అంతా ఖచ్చితమైన సమాచారం ఉంటుందని చెప్పలేం. ఎవరి అనుభవాల­నైనా దానిలో షేర్‌ చేసుకోవచ్చు. వాటిని చూసి తమకూ అలా జరుగుతుందని భావించడం సరైన విధానం కాదు. పారాసిటమాల్‌ మందుకు కూడా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉన్నట్లు గూగుల్‌లో చూపుతుంది. కానీ, వైద్యులు దానిని కామ­న్‌ మందుగా సిఫార్సు చేస్తారు. గూగుల్‌తో కొత్త సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు.     – డాక్టర్‌ విశాల్‌రెడ్డి ఇండ్ల, మానసిక వైద్య నిపుణులు  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement