
సాక్షి, నాగర్‌కర్నూల్: తెలంగాణ అమర్‌నాథ్ క్షేత్రంగా పేరుగాంచిన సలేశ్వరం బ్రహ్మోత్సవా లు గురువారం నుంచి ప్రారంభంకానున్నా యి. వచ్చేనెల 2 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. దట్టమైన నల్లమల అరణ్యంలో ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవాలంటే సాహస యాత్ర చేయకతప్పదు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో శివుడు కొలువైన ఈ క్షేత్రం ఉంది. పోలీసులు, అటవీ అధికారుల భద్రతా ఏర్పాట్ల నడుమ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది.
చైత్ర శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని నిర్వహించే సలేశ్వర క్షేత్రం బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు చాలా దూరం కాలినడకన ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. హైదరాబాద్ – శ్రీశైలం ప్రధాన రహదారి నుంచి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోపలికి వెళ్లే మట్టి రోడ్డుపై 20 కిలోమీటర్ల దూరం అతి కష్టం మీద వాహనాలపై ప్రయాణం సాగించాలి. ఆ తర్వాత 3 లోయలను కాలినడకన దాటుతూ వెళ్లాలి.
లోయల్లో చేతిలో కర్ర లేనిదే అడుగు ముం దుకు వేయలేని పరిస్థితులు ఉంటాయి. పున్న మి వెన్నెల కాంతుల మధ్య ఈ యాత్ర చేసేందుకు భక్తులు ఆసక్తి చూపుతారు. ఐదు కిలోమీటర్ల కాలినడక అనంతరం భక్తులు లోయలోకి వెళ్లి జలపాతాలను చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించి శివుడిని పూజిస్తారు. ఉత్సవాలకు సుమారు 10 లక్షలమంది వస్తారని జిల్లా అధికారులు అంచనా వేస్తున్నారు.
చెంచులే పూజారులు
వందలాది ఏళ్లుగా అడవినే నమ్ముకుని జీవిస్తున్న చెంచుల ఆరాధ్య దైవమైన సలేశ్వరుడిని ఇక్కడ వారు మల్లయ్య దేవునిగా పిలుచుకుంటారు. స్వామివారికి నిత్య పూజాది కార్యక్రమాలు కూడా చెంచులే నిర్వహిస్తారు. కేవలం ఉత్సవాల సమయంలోనే అడవిలోకి వెళ్లేందుకు అనుమతి ఉండటంతో ప్రకృతి అందాలను చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తారు.
Comments
Please login to add a commentAdd a comment