నిద్రిస్తున్న హమాలీ పైనుంచి లారీ వెళ్లడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతిచెందాడు.
తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి
ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లిలో ఘటన
ఆదిబట్ల (రంగారెడ్డి జిల్లా): నిద్రిస్తున్న హమాలీ పైనుంచి లారీ వెళ్లడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతిచెందాడు. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగల్‌పల్లిలో చోటుచేసుకుంది. సీఐ జగదీశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. యాచారం మండలం పరిధిలోని చింతుల్ల గ్రామానికి చెందిన గ్యార యాదయ్య(36) మంగల్‌పల్లి గ్రామ సమీపంలోని వైష్ణవి అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో హమాలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈక్రమంలో ఆదివారం తెల్లవారుజామున ఆయన తన పని ముగించుకొని రైస్ మిల్లు ఆవరణలో నిద్రిస్తున్నాడు. అదే రైస్ మిల్లుకు చెందిన లారీ (ఏపీ 12 టీ 6304) ప్రమాదవశాత్తు నిద్రిస్తున్న యాదయ్య పైనుంచి వెళ్లింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యాదయ్యను మిల్లు సిబ్బంది హూటాహుటిన నగరంలోని గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో యాదయ్య ఆదివారం ఉదయం 6 గంటలకు మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ప్రమాదం జరిగిన తర్వాత లారీ డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పరారయ్యాడు. మృతుడికి భార్య, ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉందని సీఐ పేర్కొన్నారు.