సాక్షి, అమరావతి: హమాలీలకు చెల్లించే చార్జీలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా మండల స్థాయి స్టాకు (ఎంఎల్‌ఎస్) పాయింట్ల నుండి రేషన్ షాపులకు సరుకులను తరలించేందుకు (లోడింగ్, అన్‌లోడింగ్ కింద) హమాలీలకు చెల్లించే చార్జీలను క్వింటాల్‌కు రూ.19 నుండి 22లకు పెంచుతూ పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన చార్జీలు ఈ ఏడాది జనవరి నుండి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. దీని వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.9.09 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు.
మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణ
అమరావతి: ఇంజనీరింగ్ పూర్తి చేసిన, ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణ ఇవ్వడానికి ప్రముఖ శిక్షణా సంస్థ ఎక్స్‌ఎల్‌ఆర్ ముందుకు వచ్చిందని స్కిల్ డెవలప్‌మెంట్ ఎండీ అర్జా శ్రీకాంత్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌ఎల్‌ఆర్ సంస్థ సీఈవో రామ్‌తవ్వ ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)తో మంగళవారం ఎంవోయు కుదుర్చుకున్నారని తెలిపారు. దీని ప్రకారం డేటా అనాలసిస్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, బిగ్ డేటా వంటి ఎమర్జింగ్ టెక్నాలజీల్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు, అధ్యాపకులకు ఎక్స్‌ఎల్‌ఆర్ సంస్థ శిక్షణ ఇవ్వనుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment