hamali
-
దాతలూ దయచూపండి!
సాక్షి, పెద్దపల్లి: హమాలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునే కార్మికుడు పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాడు. వైద్యానికి డబ్బు లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. ఓదెల మండలం కొమిర గ్రామానికి చెందిన నాగపూరి శ్రీనివాస్‌గౌడ్ నాలుగు నెలల క్రితం హైబీపీతో పక్షవాతానికి గురికాగా, కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. అతడికి భార్య శ్రీలత, ఇద్దరు కూతుర్లు అంజలి, భార్గవి ఉన్నారు. శ్రీనివాస్ పని చేస్తేనే కుటుంబం గడిచే పరిస్థితి. మంచానికే పరిమితం కావడంతో వైద్యంకోసం కుటుంబసభ్యులు తెలిసినవారి వద్ద రూ.10లక్షల వరకు అప్పు చేసి ఆపరేషన్ చేయించారు. అయినా కోలుకోలేదు. నాలుగు నెలల నుంచి కుటుంబ పోషణ భారం కావడంతో ఇద్దరు ఆడపిల్లలు చదువుకు దూరమయ్యారు. వైద్యానికి దాతలు సాయం చేస్తే కోలుకుంటాడని శ్రీనివాస్ కుటుంబసభ్యులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మూత్రపిండాల్లో రాళ్లు తొలగింపునకు ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారని కుటుంబసభ్యులు రోదిస్తూ తెలిపారు. ఆపరేషన్‌కు రూ.5లక్షలు అవుతాయని, తమ వద్ద చిల్లిగవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాతలు మానవత్వంతో సా యం చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. - దాతలు సాయం చేయాల్సిన ఫోన్ పే నంబర్ : 96761 73272 -
సోయా విక్రయానికి తెచ్చిన రైతుపై.. హమాలీ ఒక్కసారిగా..
ఆదిలాబాద్: భైంసా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో సోయా విక్రయానికి తెచ్చిన రైతుపై హమాలీ దాడి చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. లోకేశ్వరం మండలం వట్టోలికి చెందిన శ్రీనివాస్ సోయా విక్రయించేందుకు బుధవారం భైంసా యార్డుకు వచ్చాడు. బీట్ అనంతరం సోయాలు జల్లెడ పడుతుండగా కిందపడిన గింజలు తీసుకెళ్తానని రైతు కోరడంతో ఆగ్రహించిన హమాలీ రేకుడబ్బాతో కొట్టాడు. దీంతో రైతుకు కంటి వద్ద తీవ్రగాయం కావడంతో ఆగ్రహించిన రైతులు గాంధీగంజ్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం గాంధీగంజ్లోకి వెళ్లి బీట్ నిలిపివేయించారు. విషయం తెలుసుకున్న సీఐ ఎల్.శ్రీను, ఎస్సైలు శ్రీకాంత్, సందీప్ అక్కడికి చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. బాధిత రైతును ప్రథమ చికిత్స కోసం తరలించే క్రమంలో రైతులు అడ్డుకున్నారు. దాడి చేసిన హమాలీని అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అరెస్టు చేస్తామని సీఐ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బాధిత రైతు శ్రీనివాస్‌ను ఏరియాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. -
ఏపీలో హమాలీల చార్జీలు పెంపు
సాక్షి, అమరావతి: హమాలీలకు చెల్లించే చార్జీలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా మండల స్థాయి స్టాకు (ఎంఎల్ఎస్) పాయింట్ల నుండి రేషన్ షాపులకు సరుకులను తరలించేందుకు (లోడింగ్, అన్లోడింగ్ కింద) హమాలీలకు చెల్లించే చార్జీలను క్వింటాల్‌కు రూ.19 నుండి 22లకు పెంచుతూ పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన చార్జీలు ఈ ఏడాది జనవరి నుండి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. దీని వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.9.09 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణ అమరావతి: ఇంజనీరింగ్ పూర్తి చేసిన, ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణ ఇవ్వడానికి ప్రముఖ శిక్షణా సంస్థ ఎక్స్ఎల్ఆర్ ముందుకు వచ్చిందని స్కిల్ డెవలప్మెంట్ ఎండీ అర్జా శ్రీకాంత్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్ఎల్ఆర్ సంస్థ సీఈవో రామ్తవ్వ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ)తో మంగళవారం ఎంవోయు కుదుర్చుకున్నారని తెలిపారు. దీని ప్రకారం డేటా అనాలసిస్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, బిగ్ డేటా వంటి ఎమర్జింగ్ టెక్నాలజీల్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు, అధ్యాపకులకు ఎక్స్ఎల్ఆర్ సంస్థ శిక్షణ ఇవ్వనుందని పేర్కొన్నారు. -
వడ దెబ్బతో హమాలి మృతి
ఆదోని టౌన్: పట్టణంలోని బావూజీ పేటలో నివాసముంటున్న హమాలి బుడ్డ వీరప్ప (46) మంగళవారం వడదెబ్బకు గురై మృతి చెందాడు. వీరప్ప మార్కెట్ యార్డులో హమాలిగా పని చేసే ఇతను మార్కెట్ యార్డుకు అన్ సీజన్ కావడంతో కట్టెల తెచ్చేందుకు కొండకు వెళ్లాడు. కట్టెలు తీసుకొని ఇంటికి వచ్చి భోజనం చేస్తూనే సొమ్మసిల్లి పడిపోయాడు. కుటుంబీకులు ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. మృతుడికి భార్య శంకుతల, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
తెల్లారిన బతుకులు
- నాప బండల ట్రాక్టర్ బోల్తా - ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు - రాళ్లదొడ్డి- ఎర్రకోట గ్రామాల మధ్య ప్రమాదం - మృతుల నేత్రాలు దానం చేసిన బాధిత కుటుంబీకులు రాత్రిగా ఎత్తిన బండలలోడు.. మహా అంటే తెల్లవారుజాముకంతా దింపేస్తాం.. ఆ వెంటనే బయలుదేరి తెల్లారే సరికి ఇంటికి వస్తాం.. అనుకుంటూ నాప బండలలోడు ట్రాక్టర్‌తో బేతంచెర్ల నుంచి ఎమ్మిగనూరు బయలుదేరిన ఓ ముగ్గురిలో ఇద్దరి జీవితాలు మార్గంమధ్యలోనే తెల్లారిపోయాయి. వారు దింపేందుకు వెళ్తున్న బండలలోడే వారిపై పడి ప్రాణాలు బలితీసుకుంది. బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం మిగిల్చింది. ఎమ్మిగనూరురూరల్ : హమాలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఓ ఇద్దరి ప్రాణాలను ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. బేతంచెర్లలో ట్రాక్టరుకు నాప బండలను లోడు చేసుకుని ఎమ్మిగనూరు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడగా ఒకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి- ఎర్రకోట గ్రామాల మధ్య రహదారిపై తెల్లవారుజామున 2ః30 గంటల సమయంలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్ఐ వేణుగోపాల్ వివరాల మేరకు.. శనివారం రాత్రి బేతంచర్ల నుంచి ఎమ్మిగనూరుకు నాపబండలలోడుతో బయలుదేరిన ట్రాక్టర్(ఏపీ 21టీఎక్స్ 8461) తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. మలుపు దగ్గర అదుపు తప్పి ట్రాలీ, ఇంజిన్ బోల్తా పడింది. డ్రైవర్ మద్దిలేటిస్వామి(39)తోపాటు తలారి సురేష్(21), పెద్దమద్దిలేటిపై పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. రహదారిపై వెళ్తున్న వాహనదారులు గుర్తించి ఫోన్ చేయడంతో ఎమ్మిగనూరు రూరల్, పట్టణం, నందవరం ఎస్ఐలు వేణుగోపాల్, హరిప్రసాద్, జగన్మోహన్ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. బండలను తొలగించి అందులో ఇరుక్కుపోయిన ముగ్గురిని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన వీరిని ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అంబులెన్స్‌లో కర్నూలుకు తీసుకెళ్తుండగా డ్రైవర్ మద్దిలేటిస్వామి మరణించాడు. చికిత్స పొందుతూ తలారి సురేష్ మృతి చెందాడు. పెద్ద మద్దిలేటి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ వేణుగోపాల్ తెలిపారు. బాధిత కుటుంబాల్లో విషాదం.. ప్రమాదంలో మరణించిన డ్రైవర్ మద్దిలేటిస్వామి(39) బేతంచర్ల మండలం గోర్లగుట్టకు చెందిన వారు. ఈయనకు భార్య మద్దమ్మ, ముగ్గురు సంతానం. ఇదే ప్రమాదంలో మరణించిన తలారి సరేష్(21) బనగానపల్లె మండలం గోవిందిన్నెకు చెందినవారు. పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తుండగానే ఇలా తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయాడంటూ తండ్రి సుంకన్న బోరున విలపించాడు. గాయపడిన పెద్దమద్దిలేటిది కూడా బేతంచర్ల మండలం గోర్లగుట్టనే. విషయం తెలిసిన వెంటనే బాధిత కుటుంబాల వారు, బంధువులు పెద్ద ఎత్తున కర్నూలు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. వారి రోదనలతో ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో విషాదం అలుముకుంది. మృతుల నేత్రాలు దానం.. మృతులు మద్దిలేటి స్వామి, తలారి సురేష్ నేత్రాలను వారి కుటుంబ సభ్యులు దానం చేసినట్లు సీఐ జీ.ప్రసాద్, రూరల్ ఎస్ఐ వేణుగోపాల్ తెలిపారు. తీవ్ర విషాదం మధ్య డ్రైవర్ నేత్రాలను భార్య మద్దమ్మ, సురేష్ నేత్రాలను తండ్రి సుంకన్న వైద్యులకు అందించారు. -
రైతు ఆత్మహత్య
వెల్దుర్తి రూరల్: అప్పుల బాధతాళలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐదు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అతను చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పుల్లగుమ్మి గ్రామానికి చెందిన సుంకన్న (38), లక్ష్మీదేవి దంపతులకు ఐదుగురు కుమార్తెలు కాగా రెండు నెలల క్రితం కుమారుడు పుట్టాడు. సుంకన్న రెండేళ్ల క్రితం వరకు హమాలీ పని చేసి మానేశాడు. స్వగ్రామానికి చేరుకుని తన సొంత రెండున్నరెకరాల పొలంలో పంటలు సాగు చేశాడు. గత ఏడాది మిరప, ఉల్లి సాగు చేసి తీవ్రంగా నష్టపోయాడు. దాదాపు రూ. 3 లక్షలు అప్పు మిగిలింది. ఈ ఏడాది మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని కంది వేశాడు. ఇటీవల తన సొంత పొలంలో ఉల్లి సాగు చేసేందుకు అప్పు ఎవరూ ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈనెల 21వ తేదీన వెల్దుర్తి చేరుకున్న అతను మద్యంలో పురుగుమందు కలుపుకుని తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు గుర్తించి 108లో కర్నూలుకు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఇంటి పెద్ద మతి చెందడంతో భార్య, కుమార్తెలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిద్రిస్తున్న హమాలీపై నుంచి వెళ్లిన లారీ
తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లిలో ఘటన ఆదిబట్ల (రంగారెడ్డి జిల్లా): నిద్రిస్తున్న హమాలీ పైనుంచి లారీ వెళ్లడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతిచెందాడు. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగల్‌పల్లిలో చోటుచేసుకుంది. సీఐ జగదీశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. యాచారం మండలం పరిధిలోని చింతుల్ల గ్రామానికి చెందిన గ్యార యాదయ్య(36) మంగల్‌పల్లి గ్రామ సమీపంలోని వైష్ణవి అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో హమాలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈక్రమంలో ఆదివారం తెల్లవారుజామున ఆయన తన పని ముగించుకొని రైస్ మిల్లు ఆవరణలో నిద్రిస్తున్నాడు. అదే రైస్ మిల్లుకు చెందిన లారీ (ఏపీ 12 టీ 6304) ప్రమాదవశాత్తు నిద్రిస్తున్న యాదయ్య పైనుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యాదయ్యను మిల్లు సిబ్బంది హూటాహుటిన నగరంలోని గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో యాదయ్య ఆదివారం ఉదయం 6 గంటలకు మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ప్రమాదం జరిగిన తర్వాత లారీ డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పరారయ్యాడు. మృతుడికి భార్య, ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉందని సీఐ పేర్కొన్నారు. -
పాముకాటుతో హమాలీ మృతి
నష్టపరిహారం కోసం కార్మికుల ధర్నా గజ్వేల్ రూరల్ : పాముకాటుతో ఓ హమాలీ మృతి చెందిన సంఘటన గజ్వేల్ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గజ్వేల్ నగర పంచాయతీ సంగుపల్లికి చెందిన సాయిల్ల స్వామి (35) స్థానిక మార్కెట్ యార్డులో హమాలీగా పని చేస్తూ కుటుంబన్ని పోషిస్తున్నాడు. రోజులాగే మంగళవారం హమాలీ పని కోసం మార్కెట్ యార్డు వచ్చాడు, ఈ క్రమంలో మార్కెట్ యార్డులో స్వామిని పాముకాటు వేసింది. దీంతో తోటి హమాలీ కార్మికులు చికిత్స నిమిత్తం మేడ్చల్‌లోని మెడిసిటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ స్వామి మృతి చెందాడు. మృతికి భార్య ఓదవ్వ, ఇద్దరు కుమార్తెలు నాగమణి, నాగలక్ష్మి, కుమారుడు అజయ్‌లు ఉన్నారు. నష్టపరిహరం కోసం ధర్నా : బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని యార్డు కార్యాలయం ఎదుట స్వామి మృతదేహంతో కుటుంబ సభ్యులు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ధర్నా చేశారు. అయితే బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని మార్కెట్ యార్డు జాయింట్ డెరైక్టర్ హామీ ఇచ్చినట్లు సూపర్వైజర్ వీర్శెట్టి చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. అలాగే గడా హన్మంతరావు కూడా కార్మికుడి కుటుంబానికి న్యాయం చేస్తానని చెప్పారు. బాధిత కుటుంబాన్ని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ బూర్గులపల్లి ప్రతాపరెడ్డి పరామర్శించారు. -
నాటి హమాలీయే.. నేడు జెడ్పీ చైర్మన్!
-
హమాలీలకు పని భద్రత కల్పించాలి
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: బేవరేజస్ కార్పొరేషన్లో పని చేస్తున్న హమాలీలకు పని భద్రత కల్పించాలని డిమాండ్ చే స్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హమాలీలు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన దీక్షలు శుక్రవారానికి పదో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన హమాలీలు, సీఐటీయూ నాయకులు కలెక్టరేట్ వద్ద ఉన్న దీక్ష శిబిరానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రదర్శనగా కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని అక్కడ బైఠాయించారు. బేవరేజస్ కార్పొరేషన్ ఐఎంఎఫ్ఎల్ గౌడన్లలో టెండర్ విధానాన్ని రద్దుచేయాలని, హమాలీలకు పనిభద్రత కల్పించాలని, గుర్తింపు కార్డులు జారీ చేయాలని,పీఎఫ్ సౌకర్యం కల్పించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఐటీయూ జిల్లా కార్యదర్శి బత్తుల గణపతి మాట్లాడుతూ హమాలీలకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. 20 సంవత్సరాలుగా పని చేస్తున్న హమాలీలను వెళ్లగొట్టేందుకు టెండర్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది సరికాదని అన్నారు. సమస్యలు పరిష్కరించాలని ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వానికి మొరపెట్టుకున్న ఫలితం లేదని అన్నారు. సివిల్ సప్లయీస్ కార్పొరేషన్లో పని చేస్తున్న కార్మికులకు పీఎఫ్‌తో పాటు యూనిఫాం, జనశ్రీ బీమా పథకం, బోనస్, దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. దిగుమతి రేటును రూ.5 లకు పెంచాలని, డిపోల వద్ద కనీస సౌకర్యాలు కల్పించే వరకు ఉద్యమం ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా నాయకులు భూక్యా శ్రీను, విష్ణువర్ధన్, నర్సింహరావు, కుమారి, హమాలీల సంఘం నాయకులు మట్టయ్య, కిరణ్‌కుమార్, రామారావు, శ్రీనివాస్, రాంబాబు పాల్గొన్నారు.