ప్రాణం తీసిన ప్రేమ.. ప్రేయసి సోదరులే..
ప్రేమ ఓ యువకుడి ప్రాణం తీసింది. ప్రేయసి తండ్రి, సోదరులే పట్టపగలే నడిరోడ్డుపై నరికేశారు.
♦ చెర్లపల్లిలో యువకుడి హత్య
♦ గొడ్డలితో నరికి చంపిన ప్రియురాలి తండ్రి, సోదరులు
♦ చెర్లపల్లిలో జగిత్యాల–ధర్మారం రోడ్డుపై ఘటన
ధర్మపురి: ప్రేమ ఓ యువకుడి ప్రాణం తీసింది. నిజమైన ప్రేమ త్యాగం కోరుకుంటుందంటారు. ఇక్కడ మాత్రం ప్రియుడి ప్రాణాన్నే బలికోరింది. ప్రేయసి తండ్రి, సోదరులే ప్రియుడిపాలిట కాలయములయ్యారు. మాటువేసి పట్టపగలే నడిరోడ్డుపై నరికేశారు. ఈ సంఘటన వెల్గటూర్ మండలం చర్లపల్లిలో మంగళవారం జరిగింది. పోలీసులు, మృతుడి బంధువుల కథనం ప్రకారం.. చెర్లపల్లి గ్రామానికి చెందిన జుంజుపల్లి సుధాకర్(28), ఇదే గ్రామానికి చెందిన సిరిగిరి సుమ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం సుమ తండ్రి రామయ్య, సోదరులు వరుణ్, హరీశ్‌కు తెలియడంతో సుమతో మాట్లాడొద్దని పలుమార్లు హెచ్చరించారు. అయినా సుధాకర్ పట్టించుకోలేదు. దీంతో అతడిపై కక్ష్య పెంచుకున్నారు.
ఈక్రమంలో ఓరోజు సుమ, సుధాకర్ ద్విచక్రవాహనంపై జగిత్యాల నుంచి వస్తుండగా బైక్ అదుపుతప్పి కిందపడ్డారు. ఈ సంఘటనలో సుమకు గాయాలయ్యాయి. దీంతో ఆమె కుటుంబ సభ్యులు సుధాకర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు అతడిపై 307 సెక్షన్ కింద కేసు నమోదైంది. ఈక్రమంలో సుధాకర్ ఓరోజు సుమ ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులతో గొడవ పడ్డాడు. వారిని బెదిరించాడు. దీంతో వారు మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేయగా మరో కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఇరువర్గాలు పరస్పరం ఘర్షణ పడుతున్నారు. దీంతో ఎలాగైనా సుధాకర్‌ను హతమార్చాలని నిర్ణయించుకున్న సుమ కుటుంబ సభ్యులు పథకం ప్రకారం.. మంగళవారం ఉదయం జగిత్యాల–ధర్మారం రోడ్డుపై ఆటోలో సుమ తండ్రి రామయ్య, సోదరులు వరుణ్, హరీశ్ కాపుకాచారు.
సుధాకర్ ద్విచక్రవాహనంపై బయటకు రాగానే ఆటోతో బైక్‌కు డ్యాష్ ఇచ్చారు. సుధాకర్ కిందపడగానే వెంటతెచ్చుకున్న గొడ్డలితో అతడి మెడపై నరికి పారిపోయారు. కొన ఊపిరితో ఉన్న సుధాకర్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. సుమ తండ్రి రామయ్యను పోలీసులు అదుపులోకి తీసుకోగా అతడి కొడుకులు పరారీలో ఉన్నారు. ప్రేమ విషయమై సుమతో పోలీసులు మాట్లాడగా, సుధాకర్ రెండేళ్లుగా తన వెంటపడుతున్నాడని, ప్రేమపేరుతో వేధిస్తున్నాడని ఆరోపించింది. మృతుడి అన్న రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ ప్రకాశ్ తెలిపారు.