తక్కువ ధరకే ‘సింగరేణి’ విద్యుత్!
- యూనిట్ ధర రూ.4.10గా ప్రతిపాదించిన యాజమాన్యం
- రూ.3.26కు ఖరారు చేసిన ఈఆర్సీ
- ప్రైవేటు విద్యుత్‌తో పోల్చితే చాలా తక్కువ
- వినియోగదారులు, డిస్కంలకు లబ్ధి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ప్రైవేటు కంపెనీల విద్యుత్‌తో పోల్చితే సింగరేణి విద్యుత్ చాలా తక్కువ ధరకే లభించనుంది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ) ఇటీవల సింగరేణి విద్యుత్ తాత్కాలిక ధరను అత్యంత తక్కువగా యూనిట్‌కు రూ.3.26గా ఖరారు చేసింది. వచ్చే ఏడాది మార్చి వరకు, లేదా ఈఆర్సీ తుది ధరను ఖరారు చేసే వరకు ఈ తాత్కాలిక ధరతోనే రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు సింగరేణి విద్యుత్‌ను కొనుగోలు చేయనున్నాయి. తాత్కాలిక ధర తక్కువగా ఉండటంతో సమీప భవిష్యత్తులో ఈఆర్సీ ఖరారు చేయనున్న తుది ధర సైతం స్వల్ప హెచ్చుతగ్గులతో తక్కువగానే ఉండనుంది.
ఈ మేరకు సింగరేణి నుంచి డిస్కంలు కొనుగోలు చేసే విద్యుత్ ధర తక్కువగా ఉంటే వినియోగదారులపై డిస్కంలు విధించే చార్జీలు కూడా తక్కువగా ఉండనున్నాయి. ఏపీకి చెందిన థర్మల్ పవర్‌టెక్ అనే ప్రైవేటు కంపెనీ నుంచి రూ.4.15 లకు యూనిట్ చొప్పున విద్యుత్ కొనుగోలు చేసేందుకు కొన్ని నెలల కింద ప్రభుత్వం దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ప్రైవేటు విద్యుత్‌లో థర్మల్ పవర్‌టెక్ ధరే తక్కువ. అయితే ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి నుంచి లభించే విద్యుత్ ధరతో పోల్చితే మాత్రం చాలా ఎక్కువ.
ధర తగ్గించిన ఈఆర్సీ
ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లో 1,200 (25600) మెగావాట్ల సామర్థ్యంతో సింగరేణి బొగ్గు గనుల సంస్థ నిర్మించిన సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఎస్టీపీపీ) నుంచి ఇటీవల విద్యుదుత్పత్తి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ విద్యుత్ ధరలను ఖరారు చేయాలని సింగరేణి యాజమాన్యం ఇటీవల ఈఆర్సీని అభ్యర్థించింది. రూ.7,622 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు నుంచి ఏటా 7,460 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరగనుందని సింగరేణి నివేదించింది. ప్లాంట్ పెట్టుబడి వ్యయం ఆధారంగా యూనిట్ విద్యుదుత్పత్తికి రూ.2.41ల స్థిర వ్యయం కానుందని ప్రతిపాదించింది. స్థిర, చర వ్యయం కలిపి యూనిట్ ధర రూ.4.10గా ఖరారు చేయాలని కోరింది. అయితే యూనిట్ ధర రూ.4 లోపే ఉండాలని ఈఆర్సీకి ట్రాన్స్‌కో విజ్ఞప్తి చేసింది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన 600 మెగావాట్ల తొలి యూనిట్ గత అక్టోబర్ 25న, మరో 600 మెగావాట్ల రెండో యూనిట్ కొన్ని రోజుల కిందట వాణిజ్య ఉత్పత్తి (సీఓడీ) ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఈఆర్సీ తక్షణమే విద్యుత్ ధరను ఖరారు చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో సింగరేణి విద్యుత్‌కు సంబంధించిన తాత్కాలిక టారీఫ్‌ను ఖరారు చేసింది. మెగావాట్‌కు రూ.5.19 కోట్లు చొప్పున నిర్మాణ వ్యయం జరిగిందని పరిగణనలోకి తీసుకుని.. విద్యుత్ స్థిర వ్యయం రూ.1.55, చర వ్యయం రూ.1.71గా నిర్ణయించింది. స్థిర, చర వ్యయం కలిపి యూనిట్ విద్యుత్‌ను తాత్కాలిక ధర రూ.3.26తో విక్రయించాలని ఆదేశించింది. 31 మార్చి 2017 వరకు ఈ ధర అమల్లో ఉండనుంది. అప్పటిలోగా ఆ తర్వాత 25 ఏళ్ల కాలానికి సంబంధించిన తుది ధరను ఈఆర్సీ ఖరారు చేయనుంది. తుది ధర యూనిట్‌కు రూ.3.50 నుంచి రూ.4 లోపు ఉండే అవకాశాలున్నాయి.