చలి మంట కాగుతున్న ప్రజలు
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: ఉమ్మడి జిల్లాపై చలి పంజా విసురుతోంది. పెథాయ్ తుపాన్ ప్రభావంతో వీస్తున్న చలిగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో చల్లటి గాలులు వస్తుండడంతో గజగజ వణుకుతున్నారు. దీనికి తోడు కనిష్ట ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పడిపోతుండడంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. గత వారం, పది రోజుల క్రితం కనిష్ట ఉష్ణోగ్రతలు 12 నుంచి 15 డిగ్రీలు నమోదు కాగా, రెండు, మూడు రోజుల నుంచి చలి తీవ్రత పెరిగింది. నవంబర్‌లోనే సాధారణ స్థాయిని దాటిన కనిష్ట ఉష్ణోగ్రతలు.. ప్రస్తుతం మరింత దిగజారాయి. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఉదయం పది గంటలు దాటుతున్నా సాధా రణ స్థాయికి రాని పరిస్థితి నెలకొంది. చలి గాలులకు చిన్నారులు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
పెథాయ్ తుపాన్ ప్రభావం..
ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. నైరుతి బంగాళఖాతంలో కొనసాగుతున్న పేథాయ్ తుఫాన్ ప్రభావం ఉమ్మడి జిల్లా ప్రజలను వణికిస్తుంది. దీంతో గత మూడు, నాలుగు రోజుల నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోతున్నాయి. ఈనెల 13న 14.2 డిగ్రీల వరకు నమోదు కాగా, ఆదివారం తెల్లవారుజామున 6.4 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రత పడిపోయింది. ఈఏడా ది అత్యల్పంగా నవంబర్ మాసంలో 7.9 డిగ్రీలు నమోదు కాగా, ఆ తర్వాత 6.4 డిగ్రీలు కనిష్టంగా నమోదైంది. తెల్లవారుజామున మంచు కురుస్తుండడంతో పాల వ్యాపారులు, పేపర్‌బాయ్‌లు, పారిశుధ్య కార్మికులు, ఉదయం పూట పనులకు వెళ్లే ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రాష్ట్రంలోనే అత్యల్పంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. గాలిలో తేమ శాతం పెరిగిపోవడం, వాతావరణంలో వచ్చిన మార్పుల మూల ంగా చలి తీవ్రత పెరుగుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాత్రి వేళల్లో చలి తక్కువగా ఉన్నప్పటికీ తెల్లవారుజామున, ఉద యం పూట దీని ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. చలి తీవ్రత పెరుగుతుండడంతో గ్రామాలు, పట్టణాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో యువకులు, వృద్ధులు చలిమంటలు కాగుతున్నారు.
కమ్ముకుంటున్న పొగమంచు..
పెథాయ్ తుఫాన్ కారణంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పొగ మంచు కమ్ముకుంటోంది. ఉమ్మడి జిల్లాలో గతేడాది కనిష్ట ఉష్ణోగ్రత 3.5కి పడిపోయింది. రాష్ట్రంలోనే అత్యల్పంగా 3.5 డిగ్రీలు, గరిష్టంగా 29.7 డిగ్రీ సెల్సియస్‌గా ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ఇప్పటి వరకు ఇంత తక్కువ ఉష్ణోగ్రత నమోదు కాలేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. పెథాయ్ తుఫాన్ కారణంగా ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులతో ప్రజలు చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామున పొగమంచు కమ్ముకోవడంతో బయటకురాలేని పరిస్థితి ఉంటుంది. రాత్రి 7 గంటలు దాటితే చలి పంజా విసురుతోంది. గ్రామాల్లో, అటవీ çపరిసర ప్రాంతాల్లో చలి మరింత తీవ్రంగా ఉంటోంది.
అత్యల్పంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు..
గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు ఈసారి అత్యల్పంగా నమోదువుతన్నాయి. గత నాలుగైదు రోజుల నుంచి వణికిస్తున్న చలి ప్రకా రం డిసెంబర్, జనవరిలో తీవ్రత మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా జిల్లాలో 2012 జనవరిలో కనిష్ట ఉష్ణోగ్రత 3.7 డిగ్రీలకు పడిపోయింది. 2014 డిసెంబర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 3.9 డిగ్రీలుగా నమోదైంది. 2017 జనవరిలో కనిష్ట ఉష్ణోగ్రత 4 డిగ్రీలకు పడిపోయింది. 2018 జనవరిలో కనిష్ట ఉష్ణోగ్రతలు 3.5 డిగ్రీలకు పడిపోయాయి.
వారం రోజులుగా ఉష్ణోగ్రతలు..
తేదీ గరిష్టం కనిష్టం
10 31.8 16.4
11 31.8 14.7
12 28.8 12.0
13 27.8 14.2
14 27.8 12.2
15 27.8 10.8
16 26.8 6.4
ఏజెన్సీ ప్రాంతాల్లో జీవనంపై ప్రభావం..
ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరగడంతో జనజీవనంపై ప్రభావం చూపుతుంది. పంట పొలాల్లో రైతులు పంటకు నీరివ్వడం, చెట్లు, చెరువులు ఉన్న ప్రాంతాల్లో చలికి జనం అల్లాడిపోతున్నారు. చలి తీవ్రతకు వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటలు దాటితే గాని భానుడు కనిపించడం లేదు. పట్టణాలు, గ్రామాలు అని తేడా లేకుండా ఉదయం, సాయంత్రం చలి మంటలు కాగుతూ ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. తెల్లవారుజామున విపరీతంగా మంచు కురుస్తుండడంతో ఉదయం పూట పనులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల అవస్థలు వర్ణణాతీతం. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
చలి నుంచి ఉపశమనం ఇలా..
- శీతాకాలంలో వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. ఉదయం చలి తీవ్రత తగ్గిన తర్వాత 7 నుంచి 8గంటలకు నడకకు వెళ్లడం మంచిది.
- తాజా ఆకుకూరలు, ఉసిరికాయలు, బొప్పాయి, అనాస వంటి పండ్లు, ఖర్జూరం ఎక్కువగా తీసుకోవాలి.
- కూల్‌డ్రింక్స్, ఫాస్ట్‌ఫుడ్ తీసుకోవడం తగ్గించాలి.
- చలి తీవ్రత తగ్గేంత వరకు ఉన్ని దుస్తులు ధరించాలి.
- వాహనాలపై వెళ్లేవారు ముఖానికి హెల్మెట్ లేదా మాస్క్‌ను ధరించాలి.
- పొడి చర్మం ఉన్నవారు మాయిశ్చరైజింగ్ కోల్డ్‌క్రీములతో మర్థన చేసుకోవాలి.
- స్నానానికి వాడే సబ్బుల్లో సున్నం శాతం ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి.
- పూర్తి చన్నీళ్లతో కాకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.
తుపాన్‌తో వాతావరణంలో మార్పులు
పెథాయ్ తుపాన్ కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. గంటకు 12 నుంచి 15 కిలో మీటర్ల వేగంతో బలంగా గాలులు వీస్తున్నాయి. సోమవారం 20 మిల్లీ మీటర్ల వర్షం పడే అవకాశముంది. ఈ గాలులు వారం రోజుల పాటు ఇలాగే ఉంటే శనగ, మొక్కజొన్న తదితర పంటలపై ప్రభావం చూపనుంది. చీడపీడలు పట్టే అవకాశముంది. పంట దిగుబడి కోసం రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. మనుషులతో పాటు జంతువులపై కూడా చలి ప్రభావం ఉంటుంది. – శ్రీధర్ చౌహాన్, వ్యవసాయ శాస్త్రవేత్త, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment