హైదరాబాద్: చట్టం తనపని తాను చేసుకుపోతుందని అంటారు కానీ అది ఎప్పటికీ జరగడం లేదని కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్‌వీకే ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘రాజ్యాంగబద్ధ సంస్థలు– చట్టబద్ధ పాలన’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ.. అవినీతి నేరాలను పరిశోధించటం కోసం ఏర్పాటుచేసిన సంస్థపైనే ఆరోపణలు వస్తే ఇక అవినీతిని నిరోధించడం ఎలా అని ప్రశ్నించారు.
సమాచార చట్టం కింద సీబీఐని ఎందుకు ఉంచలేదని ప్రశ్నించారు. సీబీఐలో ఉన్న 11 మందిని తీసేశారని, వారిని ఎక్కడికి బదిలీ చేశారో ఇంతవరకు తెలియదన్నారు. సీబీఐ డైరెక్టర్‌ను ఒక్కసారిగా తీసివేస్తే ఉన్న కేసు విషయాలు ఎవరు విచారణ చేపట్టాలని ప్రశ్నించారు. సీబీఐ డైరెక్టర్‌ను నియమించే సెలక్షన్ కమిటీలో ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండటం ఏమిటని ప్రశ్నించారు. ఇక సీబీఐ కన్నా గొప్ప సంస్థ ఆర్‌బీఐ అని, సీబీఐలో దొంగలు కనపడతారు కానీ ఆర్‌బీఐలో కనబడరని ఎద్దేవా చేశారు. ఏ రాజకీయ పార్టీ కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వచ్చి పారదర్శకత కోసం మా సమాచారం ఇస్తామని ముందుకు రాదని అన్నారు.
సభకు అధ్యక్షత వహించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, ఎస్‌వీకే ట్రస్ట్ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చాక చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని పాలిస్తుందని విమర్శించారు. రాజ్యాంగాన్ని రద్దు చేయటం లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వీకే ట్రస్ట్ మేనేజింగ్ కమిటీ సభ్యుడు ఎస్.వినయ్‌కుమార్, సీపీఎం రాష్ట్ర నాయకుడు నంద్యాల నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చట్టం తన పని తాను చేసుకుపోతుందా?
Published Sun, Jan 27 2019 3:03 AM | Last Updated on Thu, Jul 11 2019 9:08 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment