
టీడీపీలో మరో వికెట్ డౌన్
హైదరాబాద్: తెలంగాణ టీడీపీలో మరో వికెట్ పడింది. కూకట్ పల్లి టీడీపీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శనివారం టీఆర్ఎస్ లో చేరారు. మెదక్ జిల్లా జగదేవ్పూర్లోని ఫాంహౌస్లో కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబి కండువా కప్పుకొన్నారు. అయితే టీఆర్ఎస్ పార్టీలోకి కృష్ణారావు చేరికను అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, టీడీపీ నేత నారా లోకేశ్ ఫోన్ లో ఎంతగా ప్రయత్నించినా.. కృష్ణారావు మాత్రం ఆయనకు అందుబాటులోకి రాలేదు. ఇదిలా ఉండగా ఈరోజు ఉదయం లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో జరిగిన టీడీపీ సమావేశానికి కూడా కృష్ణారావు హాజరు కాలేదు. సోమవారం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కృష్ణారావు టీడీపీని వీడటం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. ఐదో అభ్యర్థిని ఎలాగైనా గెలిపించుకోవాలన్న కేసీఆర్ పట్టు కారణంగానే కృష్ణారావు చేరినట్లు తెలుస్తోంది.
ఇంతకుముందే తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వర రావు తదితరులు టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. దీంతో క్రమంగా తెలంగాణ ప్రాంతంలో టీడీపీ తన పట్టును కోల్పోతున్నట్లు అవుతోంది.