శనివారం బీజేపీలో చేరిన మాధవీలత. చిత్రంలో కేంద్ర మంత్రి నితిన్ గట్కరీ, బండారు దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సినీ నటి, హీరోయిన్ మాధవీలత భారతీయ జనతా పార్టీలో చేరారు. శనివారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, సీనియర్ నాయకులు బండారు దత్తాత్రేయ సమక్షంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. గతంలో మాధవీలత పవన్ పార్టీ జనసేన తరపున ప్రచారం చేస్తానంటూ చెప్పారు. ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై నటి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఫిలిం ఛాంబర్ ఎదుట సైతం నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో గత కొద్దికాలంగా మాధవీ లత జనసేనలో చేరబోతున్నారంటూ వార్తలు సైతం హల్‌చల్ చేశాయి. అయితే ఆమె అనూహ్యంగా శనివారం బీజేపీలో చేరారు.
ఆమెతో పాటు కార్వాన్ కాంగ్రెస్ నేత అమర్ సింగ్, కేయూ మాజీ వీసీ వైకుంఠంలు కూడా బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ మాట్లాడుతూ.. చాలా మంది ప్రముఖులు బీజేపీలో చేరడానికి వస్తున్నారని చెప్పారు. అన్ని రంగాల ప్రజలు బీజేపీ పట్ల ఆకర్షితులు అవుతున్నారని, ఇది పార్టీ ఎదుగడానికి దోహదపడుతుందన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. పార్టీలో చేరిన వారిని స్వాగతిస్తున్నామని, తెలంగాణ పార్టీ మరింత బలపడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కొత్త చేరికలతో పార్టీ మరింత బలోపేతం అవుతుందంటూ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment