జీవితం మీద ఆశలు వదులుకున్నాం..
భువనగిరి : ‘వరదనీటితో క్యాంపస్ గదులు నిండిపోయాయి.. కరెంట్ లేదు.. తాగడానికి మంచినీళ్లు లేవు.. తినడానికి తిండిలేదు.. ఇంటికి ఫోన్ చేద్దామంటే కలవడం లేదు.. మా ‘నిట్’ కళాశాల విమానాశ్రయానికి దగ్గరలో ఉన్నా ఎలా చేరుకోవాలో తెలియదు.. జీవితం మీద ఆశలు వదులుకున్నాం.. ఇక మమ్మల్ని ఆ దేవుడే రక్షించాలి అనుకుంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపాం.. శనివారం యూనివర్సిటీ అధికారులు ఒక ట్రక్‌లో విమానాశ్రయానికి పంపిన తర్వాత జీవితంమీద ఆశలు చిగురించాయి.. బతికి బయట పడ్డామన్న ఆనందం కలిగింది.. ఇంటికి వస్తున్నానని ఇక అక్కడి నుంచే ఫోన్ చేసిచెప్పా’ అని జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్ వరదల్లో చిక్కుకున్న భువనగిరి మండలం అనాజిపురం గ్రామానికి చెందిన విద్యార్థి గోగు మధుసూదన్ తెలిపారు.
ఆదివారం రాత్రి స్వగ్రామానికి చేరుకున్న ఆయన అక్కడి పరిస్థితులను వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. నేను శ్రీనగర్‌లోని హజరత్‌బాల్‌లో ఉన్న ఎన్‌ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్నా. కాగా ఈ నెల4 వతేదీ నుంచి జమ్మూకాశ్మీర్‌లో కనీవిని ఎరుగని రీతిలో వర్షాలు కురిశాయి. 7వ తేదీన రాత్రి కురిసిన భారీ వర్షాలకు మా కళాశాల పై భాగంలో గల దల్‌లేక్(సరస్సు) నిండి వరద నీరు పొంగి పొరలింది. దాంతో లోతట్టు ప్రాంతంలో ఉన్న మా క్యాంపస్‌లోకి వరద నీర ంతా వచ్చి చేరింది.
క్రమంగా పెరుగుతున్న వరద నీటితో మా తరగతి గదిలో ఉన్న సామగ్రిని కూడా తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. క్యాంపస్‌లోకి నీరు వస్తుండడాన్ని గమనించిన సిబ్బంది మమ్మల్ని కాశ్మీర్‌లోని కాశ్మీర్ యూనివర్సిటీకి తరలించారు. మా క్యాంపస్‌లో 1500 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. ఫుడ్, మంచినీరు లేదు. ఎవరికైనా ఫోన్‌చేద్దామనుకుంటే ఎయిర్‌సెల్ సిమ్ మాత్రమే పనిచేస్తుంది. అది కూడా పై అంతస్తుకు వెళ్తే కొంతమేర సిగ్నల్ మాత్రమే వస్తోంది. దీంతో చాలా టెన్షన్ పడ్డాం.
కుటుంబ సభ్యులకు ఇతరులకు ఫోన్లు కలవక పోవడంతో చాలా ఇబ్బంది పడ్డాం. వర్షం తగ్గిన తర్వాత నాలుగైదు అంతస్తులపై నుంచి చేస్తే అప్పుడు ఫోన్ కలుస్తుందని మిత్రుడు ఒకరు తెలిపాడు. అప్పుడు పై అంతస్తులోకి వెళ్లి ఇంటికి ఫోన్ చేశా. కాగా ఈ కళాశాలలో నాతో పాటు తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 24 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 16 మంది అబ్బాయిలం, 8 మంది అమ్మాయిలు ఉన్నాం.
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధి కె రామ్మోహన్‌రావు, తెలంగాణ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలచారిలు మాతో పలు మార్లు ఫోన్లో మాట్లాడారు. స్థానిక ప్రభుత్వం , కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సాయమూ చేయలేదు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణానికి సంబంధించిన టికెట్టు ఏర్పాటు చే యడం ద్వారా శనివారం శ్రీనగర్ నుంచి ఢిల్లికి, ఢీల్లి నుంచి హైదరాబాద్‌కు విమానంలో వచ్చాం. నేను సురక్షితంగా ఇంటికి చేరుకోవడంతో మా కుటుంబ సభ్యులు ఆనందంతో ఉన్నారు. నన్ను చూసేందుకు బంధువులు వస్తున్నారు. మాకు అన్ని విధాలా సహకరించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు.