సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో మహా బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 35 వేల మంది మహిళలు రంగురంగుల పూల బతుకమ్మలతో తరలిరాగా స్టేడియం కళకళలాడుతోంది. 19 రాష్ర్టాలకు చెందిన కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 15 రాష్ర్టాల నుంచి బ్రహ్మకుమారీలు తరలివచ్చి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ బొడ్డెమ్మ ఆడారు.
ఎల్బీ స్టేడియం పూలవనాన్ని తలపిస్తుంది. 31 జిల్లాల నుంచి తరలివచ్చిన మహిళలు వలయాకారంలో లయబద్దంగా బతుకమ్మ ఆడుతున్నారు. ఉయ్యాల పాటలతో ఎల్బీ స్టేడియం మార్మోగుతుంది. తెలంగాణ సంస్కృతి వైభవానికి ప్రతీకగా మహాబతుకమ్మ నిలిచింది. మహిళలందరూ గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించడమే లక్ష్యంగా బతుకమ్మ ఆడుతున్నారు. ఈ వేడుకల్లో జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మామిడి హరికృష్ణ, బుర్రా వెంకటేశం, పలువురు మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.