కలెక్టర్ రొనాల్డ్‌రోస్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రస్తుతం అంతా టెక్నాలజీ యుగం.. అందులోను సోషల్ మీడియా అత్యంత శక్తివంతంగా పనిచేస్తోంది. వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలు ఉర్రూతలూగిస్తున్నాయి. డిజిటల్ కాలానికి అనుగుణంగా పరిపాలనలో కూడా వేగవంతమైన మార్పులు తీసుకొచ్చేందుకు కలెక్టర్లు తీవ్రంగా కృషిచేస్తున్నారు. ముఖ్యంగా పాలమూరు ప్రాంతంలోని మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ కలెక్టర్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో ప్రత్యేక పేజీలను క్రియేట్ చేసి తమ రోజు వారి కార్యక్రమాలను పోస్ట్ చేస్తున్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండేందుకు ఎప్పటికప్పుడు కార్యక్రమాల వివరాలను పొందుపరచాలని అధికారులను ఆదేశిస్తున్నారు. అంతేకాదు ఈ–ఆఫీస్ విధానాన్ని తీసుకొచ్చి సరికొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. ప్రతీ ఫైల్‌ను ఆన్‌లైన్‌లోనే పరిశీలించేలా పరిష్కరించేలా చూస్తున్నారు. టెక్నాలజీ విషయంలో మహబూబ్‌నగర్ కలెక్టరేట్ అధికారులు మరో అడుగు ముందుకు వేసి ఏకంగా యాప్‌ను క్రియేట్ చేశారు. ఈ యాప్ ద్వారా జిల్లా సమగ్ర సమాచారాన్ని అందజేయడంతో పాటు అధికారుల వివరాలు, ఫిర్యాదుల విభాగం వివరాలు ఎప్పటికప్పుడు పొందుపరుస్తున్నారు. యాప్‌లో సమాచారం అప్‌డేట్‌గాఉండేలా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు.
ప్రజలతో మమేకం
వేగంగా, పారదర్శకంగా పనులను నిర్వర్తించడానికి జిల్లాల యంత్రాంగాలు పోటీ పడుతున్నాయి. ఆధునిక యుగానికి అనుగుణంగా అధికారులు కూడా వేగాన్ని అందుకోవాలని కలెక్టర్లు సూచిస్తున్నారు. ఈ మేరకు వాట్సప్ గ్రూపుల ద్వారా జిల్లా యంత్రాంగంలో సరికొత్త ఒరవడి తీసుకొస్తున్నారు. అదే విధంగా ప్రజలతో నేరుగా సంబంధాలు కొనసాగేలా సామాజిక మాధ్యమాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఈ విషయంలో మహబూబ్‌నగర్ కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఏకంగా జిల్లా అధికార యంత్రానికి మొత్తం శిక్షణ ఇప్పించారు. ఈ నేపథ్యంలోనే మహబూబ్‌నగర్ కలెక్టర్ ట్విట్టర్‌ను 1,756 మంది ఫాలో అవుతున్నారు. ఇప్పటి వరకు ట్విట్టర్‌లో 1,101 పోస్టులు ట్వీట్ చేశారు. అంతేకాదు ఫేస్‌బుక్‌లో కూడా మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌ను 3,221 మంది ఫాలో అవుతున్నారు. అదే విధంగా వనపర్తి కలెక్టరేట్ ట్విట్టర్‌ను 1,361 మంది ఫాలో అవుతుండగా, ఇప్పటి వరకు 81 పోస్టులు ట్విట్ చేశారు. అలాగే ఫేస్‌బుక్ ఖాతాలో కూడా వనపర్తి కలెక్టర్‌ను 1,275 మంది ఫాలో అవుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ ట్విట్టర్‌ను 1,116 మంది ఫాలో అవుతుండగా... ఇప్పటి వరకు 330 పోస్టులు ట్వీట్ చేశారు. పేస్‌బుక్‌లోనూ కూడా గద్వాల కలెక్టర్‌ను 507 మంది ఫాలో అవుతున్నారు. ఇక సోషల్ మీడియాలో నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ కొంత మేర వెనుకబడి ఉందని చెప్పాలి. అంత వేగంగా దూసుకెళ్లడం లేదు. ట్విట్టర్‌లో కేవలం 143 మంది మాత్రమే ఫాలోవర్స్ ఉండగా.. ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక్కటే ట్వీట్ చేశారు. అలాగే ఫేస్ బుక్‌లో కూడా అంతగా యాక్టివ్‌గా ఉండడం లేదు.
కళ్లెదుట సమాచారం
టెక్నాలజీ వినియోగంలో మహబూబ్‌నగర్ కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ముందంజలో ఉన్నారని చెప్పాలి. సామాజిక మాధ్యమాలతో పాటు మొబైల్‌యాప్‌ను రూపొందించి సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. ప్రజలెవరైనా ప్లే స్టోర్ ద్వారా ‘మహబూబ్‌నగర్ డిస్ట్రిక్’ పేరుతో ఉన్న యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో జిల్లా సమగ్ర సమాచారాన్ని పొందుపరిచారు. జిల్లా అధికారుల ఫోన్ నంబర్లను శాఖల వారీగా ఉంచా రు. ఏయే పథకాల కోసం ఎవరిని సంప్రదించాలనే వివరాలూ ఉన్నాయి. అంతేకాదు సదరుయాప్ ద్వారా ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసే అవకాశముంది. యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులను సత్వ రం పరిష్కరించాలని జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ ఆదేశించారు. పని విధానాన్ని పరిశీలించడం కోసం కలెక్టర్ రొనాల్డ్‌రోస్ స్వయంగా మయూరి నర్సరీలో తాగునీటి సమస్యపై పోస్టు చేశారు. వెంటనే అటవీశాఖ సిబ్బంది స్పందించి సమస్యను పరిష్కరించారు. ఇలా ఎప్పటికప్పుడు స్వయంగా కలెక్టర్ పరిశీలిస్తుండటంతో జిల్లా యంత్రాంగం అలర్ట్‌గా ఉంటుంది. అలాగే తన వద్దకు వచ్చే ఫైల్స్ అన్ని కూడా ఈ–ఆఫీస్ ద్వారానే పంపించాలని ఆదేశించారు. అలాగైతేనే సంతకం చేస్తానని లేకపోతే లేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment