ronald ross collector
-
పాలమూరుకు కొత్తశోభ..!
సాక్షి, మహబూబ్‌నగర్ : రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు నెలాఖరులో చేపట్టిన 30 రోజుల గ్రామ ప్రణాళిక స్ఫూర్తితో రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా స్థానిక మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రత్యేక చొరవతో గత నెల 15న మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోనూ పట్టణ ప్రణాళిక ప్రారంభమైన విషయం తెలిసిందే. నెల రోజుల పాటు పట్టణంలో విస్తృతంగా పర్యటించి.. సమస్యల గుర్తింపుతో పాటు వాటి పరిష్కారానికి గడువు విధించుకుని పనులు పూర్తి చేయాలన్న మున్సిపల్ అధికారులకు మిగతా అన్ని శాఖాధికారుల సహాయ సాకారాలు సంపూర్ణంగా అందాయి. ఫలితంగా మహబూబ్‌నగర్ పట్టణం సమస్య లు లేని మున్సిపాలిటీ దిశగా అడుగులేస్తోంది. ఫలితమిచ్చిన శాఖల సమన్వయం.. మహబూబ్‌నగర్ మున్సిపాలిటినీ సమస్యలు లేని పురపాలికగా, ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు కలెక్టర్ రొనాల్డ్‌రోస్, మున్సిపల్ కమిషనర్ వడ్డే సురేందర్ ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు గత నెల 12న స్ధానిక మున్సిపల్ కార్యాలయంలో సమావేశమైన మిగతా అన్నిశాఖల జిల్లాస్థాయి అధికారులతో సమావేశమై ప్రణాళిక అమలులో భాగంగా పనుల గుర్తింపుతో పాటు వెంటనే చేయాల్సిన పనులు.. తర్వాత చేపట్టాల్సిన పనుల జాబితాను సిద్ధం చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం పట్టణంలో 41 వార్డులుండగా.. ఒక్కో వార్డుకు ఓ జిల్లా లేదా డివిజన్‌స్థాయి అధికారితో పాటు ఓ మున్సిపల్ సిబ్బందిని నియమించారు. ఈ క్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కేవలం కార్యక్రమం ప్రారంభానికే పరిమితం కాకుండా తనూ అధికారులతో కలిసి వార్డు బాట పట్టారు. తనవంతుగా పారిశుద్ధ్య పనులూ చేశారు. ప్రతి రోజూ గుర్తించిన సమస్యలతో పాటు పరిష్కరించిన వాటి వివరాలు కలెక్టర్‌తో కలిసి తెలుసుకున్నారు. నిరంతర పర్యవేక్షణతో నియమిత స్పెషలాఫీసర్లు సైతం వార్డుల్లో విస్తృతంగా పర్యటించి సమస్యలకు పరిష్కారమార్గాలు చూపించారు. అయితే గుర్తించిన పనుల పూర్తికి ప్రత్యేక నిధుల మంజూరు లేకపోయినా.. అవసరమైన నిధులను జనరల్ ఫండ్ నుంచి వాడుకోవాలని అధికారులు నిర్ణయించారు. సాధించిన ప్రగతి ఇదీ.. పట్టణ సుందరీకరణ.. ఆదర్శ నగరం లక్ష్యంగా మొత్తం 22 అంశాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకున్నారు. పట్టణంలో అన్ని జంక్షన్ల అభివృద్ధి, పరిసరాల పరిశుభ్రత కోసం కాలనీల అసోసియేషన్ల భాగస్వామ్యం, వీధుల్లో చెత్త కుప్పల తొలిగింపు, డ్రెయినేజీలు శుభ్రం, ఖాళీ స్థలాల్లో పెరిగిన పిచ్చి మొక్కల తొలగింపు, దోమల నిర్మూలన చర్యలు, కూలిపోయిన ఇళ్లు, పాడుబడ్డ గృహాల తొలగింపు, రోడ్లపై గుంతల పూడ్చివేత, పందుల నిర్మూలన, ప్లాస్టిక్ వాడకం నిర్మూలనలో భాగంగా జరిమానాల విధింపు, నీటి సరఫరా పైప్లైన్ల లీకేజీల మరమ్మతు, మొక్కలు నాటడం, వీధి దీపాల మరమ్మతు, కొత్తవి ఏర్పాటుతో పాటు రోడ్ల నిర్మాణం, విస్తరణ పనుల వేగవంతం, జడ్చర్ల–మహబూబ్‌నగర్ రహదారి విస్తరణ పనుల పూర్తిపై ప్రధానంగా దృష్టిసారించిన అధికారులు ఆ మేరకు పనులు చేపట్టారు. ఇప్పటి వరకు అత్యధికంగా 2,078 ఓపెన్ ప్లాట్లను గుర్తించిన స్పెషలాఫీసర్లు ఇప్పటి వరకు 1630 ప్లాట్లలో ఉన్న పిచ్చి మొక్కలు, కంప చెట్లను, నీటి నిల్వలను తొలగించి చదును చేశారు. ముందుగా ఓపెన్ ప్లాట్లలో పెరిగిన చెట్లు, నీటి నిల్వ గురించి ఆయా యజమానులకు సమాచారం అందజేసి మూడు, నాలుగు రోజుల్లో వాటిని శుభ్రం చేసుకోవాలని నోటీసులు ఇచ్చారు. స్పందించని యజమానుల ప్లాట్లను మున్సిపల్ అధికారులే శుభ్రం చేసి.. జేసీబీ, డంపింగ్ యార్డు వరకు చెత్త తరలింపు కోసం ఇతర వాహనాలకు అయ్యే ఖర్చును జరిమానా పేరిట వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు రూ.4లక్షలకు పైగా జరిమానాలు వసూలు చేశారు. ఇక మీదట ఓపెన్ ప్లాట్లలో చెట్లు పెరగకుండా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అత్యధికంగా మూడో వార్డులో 230 ఓపెన్ ప్లాట్లను గుర్తించిన ప్రత్యేకాధికారులు 120 ప్లాట్లను చదును చేశారు. 19వ వార్డులో 150 ప్లాట్లకు గానూ 25, 16వ వార్డులో 111 ప్లాట్లకు 76, 12వ వార్డులో 104 ప్లాట్లకు 99, ఏడో వార్డులో 93 ప్లాట్లకు 90, 41వ వార్డులో 93 ప్లాట్లకు గానూ 81 ప్లాట్లు చదును చేశారు. ఇప్పటికే పట్టణంలో లోపించిన పారిశుద్ధ్యంతో విష జ్వరాలు, డెంగీ వంటి వ్యాధులు ప్రబలిన నేపథ్యంలో అధికారులు తీసుకున్న ఓపెన్ ప్లాట్ల చదును కార్యక్రమంపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందరి కృషితోనే.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్, కలెక్టర్ రొనాల్డ్ రోస్, స్పెషలాఫీసర్లందరీ సమష్టి కృషితో గడిచిన కొన్ని రోజుల్లోనే పట్టణంలో అనేక సమస్యలు తీరాయి. పట్టణ ప్రణాళికలో భాగంగా స్పెషలాఫీసర్లు గుర్తించిన పనుల్ని రెండు, మూడు రోజుల్లోనే పరిష్కరించుకుంటున్నం. కార్యక్రమం గడువుకు ఇంకా సమస్య ఉన్నందునా మిగిలిన సమస్యలన్నీ పరిష్కరిస్తాం. అయితే ఈ కార్యక్రమం నెల రోజులకే పరిమితం కాకూడదు. ప్రజలూ పట్టణ పౌరులుగా తమ బాధ్యతను గుర్తించుకుని పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు సహకరించాలి. ముఖ్యంగా ఓపెన్ ప్లాట్ల విషయంలో ఆయా యజమానులు శ్రద్ధ తీసుకుని పిచ్చి మొక్కలు పెరగకుండా, నీటి నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలి. – వడ్డే సురేందర్, మున్సిపల్ కమిషనర్ -
సమాజం.. ఆరోగ్యం
మహబూబ్‌నగర్ రూరల్ : ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడం అవసరమని.. ఇదే అందరి లక్ష్యం కావాలని కలెక్టర్ రొనాల్డ్ రోస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యాన శనివారం పోషణ్ అభియాన్ కార్యక్రమంపై మేళా ఏర్పాటుచేశారు. డీడబ్ల్యూఓ జి.శంకరాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ రొనాల్డ్ రోస్ ముఖ్యఅతిథిగా హాజరు కాగా, జాయింట్ కలెక్టర్ వెంకట్రావ్, ఐసీడీఎస్ రీజినల్ ఆర్గనైజర్ రాజ్యలక్ష్మి, ఫుడ్ కమిషనర్ మెంబర్ శారద, ఇన్చార్జి డీఎంహెచ్ఓ కృష్ణ, మాస్ మీడియా మేనేజర్ వేణుగోపాల్‌రెడ్డి, స్వచ్ఛ భారత్ జిల్లా ఇన్చార్జి ధృతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాతృత్వం ఎంతో గొప్పదైన మాతృత్వ మధురిమ అనుభవిస్తున్న వారు పిల్లలకు తల్లి పాటే పట్టాలని కోరారు. తల్లి పాల విశిష్టతను అంగన్వాడీ టీచర్లు ప్రతీ తల్లికి వివరిస్తే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. అలాకాకుండా బిడ్డలకు పోత పాలు పడితే పిల్లల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని భవిష్యత్ తరాలు ప్రమాదంలో పడతాయని కలెక్టర్ హెచ్చరించారు. పోషకాహారం ఎంత ముఖ్యమో పోషణ అభియాన్ ద్వారా అవగాహన కల్పిస్తారని తెలిపారు. అనంతరం పలువురు చిన్నారులకు కలెక్టర్, జేసీ అన్నప్రాసన చేయించారు. ఇదిలా ఉండగా పోషణ్ అభియాన్‌లో భాగంగా కూరగాయలను, ఇతర పోషక పదార్థాలను అంగన్వాడీ టీచర్లు ప్రదర్శనలో ఉంచారు. ఓటుహక్కుపై అవగాహన కల్పించాలి జిల్లాలోని అంగన్వాడీ టీచర్లు మహిళలకు ఓటుహక్కుపై అవగాహన కల్పించాలని కలెక్టర్ రొనాల్డ్ రోస్ సూచించారు. ఈసారి అత్యాధునిక ఓటింగ్ యంత్రాలతో ఓటింగ్ జరగనుందని తెలిపారు. ఓటర్లు ఎవరూ కూడా ఓటు అమ్ముకోవద్దని వివరించడంతో పాటు ప్రతిఒక్కరు ఓటు వినియోగించుకునేలా చూడాలన్నారు. ఆకట్టుకున్న నృత్యాలు పోషణ్ అభియాన్ మేళాలో అంగన్వాడీ టీచర్లు, ఎఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. టీచర్ల అందెల సవ్వడితో ఫంక్షన్ హాల్ మార్మోగింది. గిరిజన సంప్రదాయ నృత్యంతో పాటు దాండియా పాటలు, నృత్యాలతో హోరెత్తించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ఈఓ సుజాత, సీడీపీఓలు రాజేశ్వరి, స్వప్నప్రియ, పారిజాత, లక్ష్మి, వెంకటమ్మ, డీసీపీఓ నర్మద, సఖి కేంద్రం ఇన్చార్జి మంజుల, సీనియర్ అసిస్టెంట్ యాదయ్య, జూనియర్ అసిస్టెంట్లు శిరీష, రాజశేఖర్, వెంకటేష్ పాల్గొన్నారు. -
సోషల్ కలెక్టర్లు!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రస్తుతం అంతా టెక్నాలజీ యుగం.. అందులోను సోషల్ మీడియా అత్యంత శక్తివంతంగా పనిచేస్తోంది. వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలు ఉర్రూతలూగిస్తున్నాయి. డిజిటల్ కాలానికి అనుగుణంగా పరిపాలనలో కూడా వేగవంతమైన మార్పులు తీసుకొచ్చేందుకు కలెక్టర్లు తీవ్రంగా కృషిచేస్తున్నారు. ముఖ్యంగా పాలమూరు ప్రాంతంలోని మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ కలెక్టర్లు ఫేస్బుక్, ట్విట్టర్లో ప్రత్యేక పేజీలను క్రియేట్ చేసి తమ రోజు వారి కార్యక్రమాలను పోస్ట్ చేస్తున్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండేందుకు ఎప్పటికప్పుడు కార్యక్రమాల వివరాలను పొందుపరచాలని అధికారులను ఆదేశిస్తున్నారు. అంతేకాదు ఈ–ఆఫీస్ విధానాన్ని తీసుకొచ్చి సరికొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. ప్రతీ ఫైల్‌ను ఆన్లైన్లోనే పరిశీలించేలా పరిష్కరించేలా చూస్తున్నారు. టెక్నాలజీ విషయంలో మహబూబ్‌నగర్ కలెక్టరేట్ అధికారులు మరో అడుగు ముందుకు వేసి ఏకంగా యాప్‌ను క్రియేట్ చేశారు. ఈ యాప్ ద్వారా జిల్లా సమగ్ర సమాచారాన్ని అందజేయడంతో పాటు అధికారుల వివరాలు, ఫిర్యాదుల విభాగం వివరాలు ఎప్పటికప్పుడు పొందుపరుస్తున్నారు. యాప్‌లో సమాచారం అప్డేట్గాఉండేలా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ప్రజలతో మమేకం వేగంగా, పారదర్శకంగా పనులను నిర్వర్తించడానికి జిల్లాల యంత్రాంగాలు పోటీ పడుతున్నాయి. ఆధునిక యుగానికి అనుగుణంగా అధికారులు కూడా వేగాన్ని అందుకోవాలని కలెక్టర్లు సూచిస్తున్నారు. ఈ మేరకు వాట్సప్ గ్రూపుల ద్వారా జిల్లా యంత్రాంగంలో సరికొత్త ఒరవడి తీసుకొస్తున్నారు. అదే విధంగా ప్రజలతో నేరుగా సంబంధాలు కొనసాగేలా సామాజిక మాధ్యమాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఈ విషయంలో మహబూబ్‌నగర్ కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఏకంగా జిల్లా అధికార యంత్రానికి మొత్తం శిక్షణ ఇప్పించారు. ఈ నేపథ్యంలోనే మహబూబ్‌నగర్ కలెక్టర్ ట్విట్టర్‌ను 1,756 మంది ఫాలో అవుతున్నారు. ఇప్పటి వరకు ట్విట్టర్లో 1,101 పోస్టులు ట్వీట్ చేశారు. అంతేకాదు ఫేస్బుక్లో కూడా మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌ను 3,221 మంది ఫాలో అవుతున్నారు. అదే విధంగా వనపర్తి కలెక్టరేట్ ట్విట్టర్‌ను 1,361 మంది ఫాలో అవుతుండగా, ఇప్పటి వరకు 81 పోస్టులు ట్విట్ చేశారు. అలాగే ఫేస్బుక్ ఖాతాలో కూడా వనపర్తి కలెక్టర్‌ను 1,275 మంది ఫాలో అవుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ ట్విట్టర్‌ను 1,116 మంది ఫాలో అవుతుండగా... ఇప్పటి వరకు 330 పోస్టులు ట్వీట్ చేశారు. పేస్‌బుక్‌లోనూ కూడా గద్వాల కలెక్టర్‌ను 507 మంది ఫాలో అవుతున్నారు. ఇక సోషల్ మీడియాలో నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ కొంత మేర వెనుకబడి ఉందని చెప్పాలి. అంత వేగంగా దూసుకెళ్లడం లేదు. ట్విట్టర్లో కేవలం 143 మంది మాత్రమే ఫాలోవర్స్ ఉండగా.. ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక్కటే ట్వీట్ చేశారు. అలాగే ఫేస్ బుక్‌లో కూడా అంతగా యాక్టివ్‌గా ఉండడం లేదు. కళ్లెదుట సమాచారం టెక్నాలజీ వినియోగంలో మహబూబ్‌నగర్ కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ముందంజలో ఉన్నారని చెప్పాలి. సామాజిక మాధ్యమాలతో పాటు మొబైల్‌యాప్‌ను రూపొందించి సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. ప్రజలెవరైనా ప్లే స్టోర్ ద్వారా ‘మహబూబ్‌నగర్ డిస్ట్రిక్’ పేరుతో ఉన్న యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో జిల్లా సమగ్ర సమాచారాన్ని పొందుపరిచారు. జిల్లా అధికారుల ఫోన్ నంబర్లను శాఖల వారీగా ఉంచా రు. ఏయే పథకాల కోసం ఎవరిని సంప్రదించాలనే వివరాలూ ఉన్నాయి. అంతేకాదు సదరుయాప్ ద్వారా ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసే అవకాశముంది. యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులను సత్వ రం పరిష్కరించాలని జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ ఆదేశించారు. పని విధానాన్ని పరిశీలించడం కోసం కలెక్టర్ రొనాల్డ్‌రోస్ స్వయంగా మయూరి నర్సరీలో తాగునీటి సమస్యపై పోస్టు చేశారు. వెంటనే అటవీశాఖ సిబ్బంది స్పందించి సమస్యను పరిష్కరించారు. ఇలా ఎప్పటికప్పుడు స్వయంగా కలెక్టర్ పరిశీలిస్తుండటంతో జిల్లా యంత్రాంగం అలర్ట్‌గా ఉంటుంది. అలాగే తన వద్దకు వచ్చే ఫైల్స్ అన్ని కూడా ఈ–ఆఫీస్ ద్వారానే పంపించాలని ఆదేశించారు. అలాగైతేనే సంతకం చేస్తానని లేకపోతే లేదని స్పష్టం చేశారు. -
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు
మహబూబ్‌నగర్ న్యూటౌన్: తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మామిడి ఉత్పత్తులపై సర్వే నిర్వహించి అంచనాలు సిద్ధం చేయాలని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మామిడి అధికంగా ఉత్పత్తి అయ్యే బాలానగర్, రాజాపూర్, నవాబ్‌పేట, దామరగిద్ద, కోస్గి, గండీడ్ మండలాల్లో రైతులకు వచ్చే ఆదాయం, ఉత్పత్తులు వంటి వివరాలతో నివేదికను గురువారం లోగా సమర్పించాలన్నారు. అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పి మామిడి ఉత్పత్తులను అమ్మితే మంచి ధరలు వచ్చే అవకాశముందని తెలిపారు. సమావేశంలో డీఆర్డీఓ ఆనంద్‌కుమార్, ఉద్యానవన శాఖ అధికారి సరోజినిదేవి, డీపీఎం నాగమల్లిక పాల్గొన్నారు. -
ప్రొఫెసర్ల తీరు మారేనా!
* వైద్య కళాశాలకు తరుచూ గైర్హాజరు * తీవ్రంగా పరిగణిస్తున్న కలెక్టర్ * నేడు వైద్యాధికారులతో సమీక్ష * సెలవులో వెళ్లిన ప్రిన్సిపల్ నిజామాబాద్ అర్బన్ : మెడికల్ కళాశాల పనితీరుపై కలెక్టర్ రొనాల్డ్‌రోస్ మంగళవారం సమీక్ష నిర్వహించనున్నారు. వైద్యసేవలు మెరుగు పర్చేందుకు అధికారులతో కలిసి ప్రణాళిక రూపొందించనున్నారు. మెడికల్ కళాశాలకు గైర్హాజరవుతున్న ప్రొఫెసర్లపై నివేదికను పరిశీలించి ఎలాంటి చర్యలు తీసుకోవాలో సమీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ జిజియాబాయి రెండు రోజులపాటు సెలవులో వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. గత శనివారం నిర్వహించిన సమీక్షలో వైద్య కళాశాల ప్రొఫెసర్లు గైర్హాజరు కావడంపై కలెక్టర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించా రు. సమీక్ష సమావేశానికి 12 మంది ప్రొఫెసర్లు గైర్హాజరు కావడాన్ని తీ వ్రంగా పరిగణించిన కలెక్టర్ తనను కలిసేంత వరకు విధులలో చేరవద్దని ఆదేశించారు. దీంతో గైర్హాజరయిన ప్రొఫెసర్లు కలెక్టర్ తీసుకునే చర్యల నుంచి తప్పించుకునే పనిలో పడ్డారు. యూనివర్సిటీ, డీఎంఈ కార్యాలయాలలో ప్రత్యేక పనులు ఉన్నందున కలెక్టర్ సమీక్షకు గైర్హాజరు అయినట్లు పత్రాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. మరి కొందరు అనారోగ్యం పేరిట మెడికల్ సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారని తెలిసింది. స్థానికంగా ఉండడానికి ఇష్టపడని కొందరు ప్రొఫెసర్లు ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలోనూ వైద్య ఆరోగ్య శాఖలో 16 మంది వైద్యులు స్థానికంగా ఉండడం లేదని, తరుచూ గైర్హాజరవుతున్నారని గత కలెక్టర్ ప్రద్యుమ్న వారి హెచ్ఆర్ఏను నిలిపి వేశారు. ఒక్కొక్కరికి సుమారు రూ. 60 వేల నుంచి రూ. 70 వేల వరకు వచ్చే అవకాశం ఉంది. కలెక్టర్ హెచ్ఆర్ఏ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయడంతో వారంతా ఖంగుతిన్నారు. అయితే, అంతలోనే కలెక్టర్ బదిలీ కావడంతో ఆదేశాలు బుట్టదాఖలయ్యాయి. శాఖలోని ఓ అధికారి పర్సంటేజీల పర్వానికి శ్రీకారం చుట్టారు. ఒక్కొక్కరు రూ. 30 వేల చొప్పున చెల్లిస్తే హెచ్ఆర్ఏ విడుదల చేయిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. వైద్యులు ఒప్పుకోవడమే ఆలస్యం ఇన్చార్జి కలెక్టర్‌ను బురిడీ కొట్టించి హెచ్ ఆర్ఏ విడుదల చేయించుకున్నారు. వైద్యుల పని తీరు బాగోలేదని కలెక్టర్ హెచ్ఆర్ఏను నిలపి వేస్తే అధికారులు ఇన్చార్జి కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించి నిధులు మం జూరు చేయించుకోవడం గమనార్హం. ఈ విషయమై జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి గోవింద్‌వాగ్మోరేను వివరణ కోరగా స్పందించలేదు.