రేపు బాబ్లీ గేట్లు ఎత్తివేత
సాక్షి, కరీంనగర్/బాల్కొండ: మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు గేట్లను శనివారం ఎత్తనున్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీ నీటి మట్టం 90 టీఎంసీల నుంచి 9.22 టీఎంసీలకు, ఎల్‌ఎండీలో 24 టీఎంసీల నుంచి 7.04 టీఎంసీలకు తగ్గింది. ఇదే సమయంలో గతం లో వెలువడిన సుప్రీంకోర్డు తీర్పు ప్రకారం జూలై 1న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరుచుకోనుండటంతో ‘మహా’వరదపై ఆశలు పెరుగుతు న్నాయి. అక్టోబర్ 28 వరకు గేట్లు తెరిచే ఉండటం వల్ల ఈ నాలుగు మాసాలు మహారాష్ట్రలో కురిసే భారీ వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజె క్టులోకి నదీ ప్రవాహం ద్వారా భారీగా నీరు చేరే అవకాశం ఉంది.
అయితే.. ఎస్సారెస్పీ ఎగువన మహారాష్ట్ర సర్కార్ నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్, విష్ణుపురి, గైక్వాడ్ తదితర 11 ప్రాజెక్టులు నిండిన తరువాతనే ఎస్సారెస్పీలోకి వరద నీరు వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఏడాదిలో నాలుగు నెలలు (వర్షాకాలం) ఎత్తాలని సుప్రీం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారం ఏటా జూన్ 30న అర్ధరాత్రి తర్వాత గేట్లు ఎత్తుతున్నారు.
రెండేళ్ల క్రితం వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో మహారాష్ట్ర ప్రాజెక్టులు, తెలంగాణ ప్రాజెక్టులు డెడ్‌స్టోరేజీకి చేరాయి. గతేడాది కురిసిన వర్షాలకు అక్కడ, ఇక్కడ జలాశయాలు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరాయి. ఎస్సారెస్పీకి పెద్ద మొత్తంలో మహారాష్ట్రకు వరద నీరు చేరగా, సుమారు 102 టీఎంసీలు గోదావరిలోకే వదిలేసి 90 టీఎంసీలు నిల్వ చేశారు. ఈసారి కూడా బాబ్లీ గేట్లు తెరుస్తున్నందున మహారాష్ట్ర వరద నీరుపైనే ఆశలు వ్యక్తమవుతున్నాయి.