హైకోర్టు కోసం ప్రధానిని కలుస్తా
భువనగిరి :తెలంగాణలో ప్రత్యేక హైకోర్టు సాధన కోసం ప్రధాని నరేంద్రమోడీని కలుస్తానని భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ తెలిపారు. తెలంగాణకు వెంటనే హైకోర్టును ఏర్పాటుచేయాలంటూ స్థానిక కోర్టు ఆవరణలో న్యాయవాదులు చేస్తున్న రిలే దీక్షా శిబి రాన్ని శనివారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయాక ఉమ్మడి కోర్టు ఉండడం వల్ల తెలంగాణ ప్రాంత న్యాయమూర్తులకు, న్యాయవాదులకు అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. స్వయం పాలన సాధించుకున్న తెలంగాణ ప్రజలకు స్వతంత్ర కోర్టు కూడా ఉండాలన్నారు.
ఇందుకోసం కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌ను కలిసి హైకోర్టు అవసరాన్ని వివరిస్తానన్నారు. అలాగే ప్రధానిని కలిసి హైకోర్టు కోసం విన్నవిస్తానన్నారు. దీక్షలో న్యాయవాదులు రావి సురేందర్‌రెడ్డి, గడీల నవీన్ కుమార్‌లు కూర్చున్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపీని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.రమేష్, న్యాయవాదులు వంచ దామోదర్‌రెడ్డి, జి.రవీందర్‌రెడ్డి, జి.బాబురావు, ఆకుల ఆంజనేయులు, శంకర్, కమలాకర్, విద్యాసాగర్, వేముల అశోక్, వెంకటేష్, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.