
ఈ అన్నం మాకొద్దు..
నాగర్‌కర్నూల్‌టౌన్:
ఎప్పటికైనా తమకు మంచి భోజనం పెడతారన్న ఆశగా ఎదురుచూస్తున్న విద్యార్థినుల్లో ఓపిక నశించింది. రోజూ నాసిరకం భోజనం, నీళ్లచారు, కుళ్లిపోయిన కూరగాయలతో చేసిన వంటలు ఇక తినలేమంటూ భోజనాన్ని పడేసి పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సంఘటన బుధవారం మండలపరిధిలోని నాగనూల్ కస్తూర్భా బాలికల పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బుధవారం ఉదయం అల్పాహారం చేసేందుకు వచ్చిన విద్యార్థినులకు నాసిరకం అన్నం పెట్టడమే కాకుండా అందులో ఎలాంటి కూర లేకపోవడంతో ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిభోజనం పెట్టాలని ప్రత్యేకాధికారిణికి ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదన్నారు. పాఠశాలలో ప్రభుత్వం నిర్నరుుంచిన మెనూ అమలుకావడం లేదని, కుళ్లిపోయిన పండ్లు, ఒకే రకం కూరగాయలు వడ్డిస్తున్నారన్నారు, కొన్నిసార్లు దుర్వాసన భరించలేక పస్తులు ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు నెలలుగా కాస్మోటిక్ చార్జీలు కూడా ఇవ్వలేదన్నారు. దాదాపు రెండుగంటలపాటు ఆందోళన చేయడంతో ప్రత్యేకాధికారిణి విజయ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు.
దీంతో అక్కడికి చేరుకున్న సింగిల్‌విండో చైర్మన్ వెంకట్రాములు నాగర్‌కర్నూల్ తహశీల్దార్‌కు సమాచారం అందించారు. తహశీల్దార్ రాంరెడ్డి విద్యార్థినులతో మాట్లాడి ఇకపై ఇలాంటి తప్పు జరగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. మీరు వచ్చి వెళ్లాక ఒకటి, రెండు రోజులు మాత్రమే మంచి భోజనం పెడతారని, తర్వాత షరా మామూలేనంటూ వారు తహశీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన అప్పటికప్పుడు భోజనం తయారు చేయించాలని ప్రత్యేకాధికారిణి ఆదేశించారు. విద్యార్థులు పడేసిన నాసిరకం భోజనం, కూరగాయలను తహశీల్దార్ పరిశీలించి, ఇకపై ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ప్రత్యేకాధికారిని హెచ్చరించారు.