పరిహారంపై పట్టువిడుపు
నిర్వాసితులు ఎలా కోరుకుంటే అలా పరిహారం: కేసీఆర్
జీవో 123 లేదా 2013 భూసేకరణ చట్టం.. ఏది కావాలంటే అది వర్తింపజేస్తాం
మంత్రి హరీశ్‌తో ముఖ్యమంత్రి భేటీ.. అనంతరం పరిహారంపై ప్రకటన
నిర్వాసితులు ఆందోళన విరమించే అవకాశం
ప్రాజెక్టు పరిధిలో భారీగా పెరగనున్న పరిహార మొత్తం
2013 చట్టం ప్రకారం ఇస్తే 21 వేల ఎకరాలకు ఏకంగా రూ.2 వేల కోట్లు!
ఇదే విధంగా అన్ని ప్రాజెక్టులకు వర్తింపజేస్తే పెనుభారమే...
సాక్షి, హైదరాబాద్/సంగారెడ్డి
మల్లన్న సాగర్ రిజర్వాయర్ భూ సమీకరణ విషయంలో రైతుల ప్రయోజనాలు, వారి అభిప్రాయానికి అనుగుణంగానే ప్రభుత్వం పరిహారం అందిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూమి సేకరించడానికి ప్రస్తుతం రెండు విధానాలు అమలులో ఉన్నాయని, యూపీఏ ప్రభుత్వం 2013లో తెచ్చిన భూసేకరణ చట్టం అందులో ఒకటి కాగా.. మరొకటి తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన జీవో నెం.123 అని తెలిపారు. ఈ రెండింట్లో రైతులు ఎలా కావాలనుకుంటే అలా పరిహారం అందిస్తామని ప్రకటించారు.
మల్లన్న సాగర్ నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ద్వారా పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్, బీజేపీ, టీడీపీతోపాటు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం శనివారం తన అధికార నివాసానికి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును పిలిపించుకుని మల్లన్నసాగర్ భూసేకరణ వివాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పరిహారంపై ఈ మేరకు ప్రకటన వెలువడింది.
భారీగా పెరగనున్న వ్యయం
భూ సేకరణ చట్టం-2013ను అమలు చేస్తే మల్లన్నసాగర్ ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే 21 వేల ఎకరాలకు చెల్లించాల్సిన పరిహారం భారీగా ఉండనుంది. కనీసం రూ.2 వేల కోట్లు పరిహారం కింద చెల్లించే అవకాశం ఉంటుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సీఎం తాజా ప్రకటన తర్వాత.. జీవో 123 ద్వారా పరిహారం కోరుకునే రైతులుంటారని తాను అనుకోవడం లేదని ఆ అధికారి పేర్కొన్నారు. మల్లన్నసాగర్‌తో పాటు మిగతా ప్రాజెక్టుల కింద కూడా 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాల్సి వస్తే ప్రాజెక్టుల నిర్మాణానికి అయ్యే వ్యయం కంటే పరిహారం ఎక్కువగా ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
మూడు నెలల ఆందోళనకు ఫుల్‌స్టాప్
మల్లన్నసాగర్ నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గత మూడు మాసాలుగా ఆందోళన చేస్తున్నారు. వీరి ఆందోళనకు పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్‌రెడ్డితో పాటు సీపీఐ, సీపీఎం నేతలు ఏటిగడ్డ కిష్టాపూర్‌కు వెళ్లి అక్కడి నిర్వాసితులకు సంఘీభావం ప్రకటించారు. భూసేకరణ చట్టం 2013 ప్రకారం పరిహారం చెల్లించాలంటూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి శనివారం రెండ్రోజుల దీక్ష ప్రారంభించారు. మరోవైపు మల్లన్నసాగర్ నిర్వాసితులు తమకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి తాజా ప్రకటనతో మల్లన్నసాగర్ నిర్వాసితులు తమ ఆందోళన విరమించే అవకాశం ఉంది.
భూసేకరణకు త్వరలో నోటిఫికేషన్: కలెక్టర్
మల్లన్నసాగర్ ముంపు గ్రామాల రైతులకు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని , భూసేకరణ కోసం ఈ మేరకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని మెదక్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. శనివారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి బలవంతంగా భూమి సేకరించడం లేదని ఆయన స్పష్టంచేశారు. ఇప్పటి వరకు 1,600 ఎకరాలు రైతుల నుంచి సేకరించినట్లు వివరించారు. ఏటిగడ్డ కిష్టాపూర్‌లో ఇప్పటివరకు 145 మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 270 ఎకరాల భూమిని జీవో 123 ఉత్తర్వుల ప్రకారం రిజిస్ట్రేషన్ చేశారని వివరించారు.