హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం నేటి(మంగళవారం) నుంచి దీక్ష కొనసాగించనున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తెలిపారు. సోమవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు, బాపూఘాట్ లేదా నగర పరిధిలో ఎక్కడ అనుమతి ఇచ్చినా తమ దీక్ష కొనసాగుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఎమ్మార్పీఎస్‌పై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని, తమపై కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని అన్నారు.
ఢిల్లీలో దీక్ష చేసినప్పుడు టీఆర్‌ఎస్ నేతలెవరూ తమకు మద్దతు ఇవ్వలేదన్నారు. తాము వేసిన 13 ప్రశ్నలకు కేసీఆర్‌గానీ, కడియంగానీ ఇంతవరకు సమాధానం చెప్పలేదన్నారు. దళిత సీఎం విషయం లో కేసీఆర్ మాట తప్పారని, దళితుల్లో సీఎం స్థాయివ్యక్తి లేరని శ్రీహరి ప్రకటన చేసి దళితులను అవమానపరిచా రన్నారు. రాజయ్య బర్తరఫ్ కుట్రలో భాగమై ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని కడియం దోచు కున్నారని మంద కృష్ణ ఆరోపించారు.
తమపై పెట్టిన కేసుల కుట్రకు కడియం మూలకారకుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీహరి తన రాజకీయ భవిష్యత్ కోసం దళితులకు ద్రోహం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఇంట్లో వెయ్యిమందితో మీటింగ్ పెట్టుకోవచ్చు కానీ, పదిమందితో దీక్ష చేయనీయరా.. అని ప్రశ్నించారు. 100 రోజుల్లో వర్గీకరణ చేస్తానని చెప్పిన బీజేపీ ఇంకా ఆ దిశగా ముందుకు సాగడం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment