ములుగు: వరంగల్ జిల్లా మంగపేట మండలం కమలాపూర్‌లో మావోయిస్టుల పోస్టర్ కలకలం రేపింది. కేకేడబ్ల్యూ కార్యదర్శి దామోదర్ పేరుతో బుధవారం రాత్రి ఈ పోస్టర్ వెలిసింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా బిల్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించటంలో మంత్రి చందూలాల్, టీఆర్‌ఎస్ నేత రమేష్‌రెడ్డి విఫలమయ్యారని అందులో ప్రధానంగా ఆరోపించారు. బతుకులు బాగు పడతాయని ఆశపడిన గిరిజనులకు నిరాశే మిగిలిందని పేర్కొన్నారు. వారికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు.
శృతి, విద్యాసాగర్‌ల ఎన్‌కౌంటర్ బూటకమని తెలిపారు. వారిని పోలీసులే పట్టుకుని చంపేశారని ఆరోపించారు. నక్సలైట్ల ఎజెండా తమదంటున్న ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడటం దారుణమని పేర్కొన్నారు. ప్రజల చేతుల్లో ప్రభుత్వానికి శిక్ష తప్పదని అన్నారు. కాగా, ఎన్‌కౌంటర్ జరిగిన మూడు నెలలకు ఈ విధంగా పోస్టర్ రావటంపై స్థానికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం ఉదయం విషయం తెలిసిన పోలీసులు పోస్టర్‌ను తొలగించారని సమాచారం.