అజ్ఞాతం వీడాలి..
నల్లగొండ క్రైం : మావోయిస్టులు అజ్ఞాతాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీపావళి సందర్భంగా శనివారం జనమైత్రి పోలీసులో భాగంగా మావోయిస్టు కుటుంబ సభ్యులకు దుస్తులు, బియ్యం, కిరాణా సామగ్రి, స్వీట్లు, కొంత నగదును స్థానిక పోలీసు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తుపాకి పట్టి పనిచేయడం వలన వెలకట్టలేని ప్రాణాలను పోగొట్టుకుని కన్నవారికి కడుపుకోతను మిగిల్చడమే తప్ప ఏమీ సాధించలేరని అన్నారు.
ఉమ్మడి జిల్లా నుంచి 9 మంది కాగా ఇందులో నల్లగొండ జిల్లా నుంచి ఐదుగురు, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల నుంచి ఇద్దరు చొప్పున అజ్ఞాతంలో పనిచేస్తున్నారని అన్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల బాగోగులను చూసుకునేందుకు చేదోడు వాదోడుగా ఉండాలన్నారు. లొంగిపోతే రివార్డులతో పాటు ప్రభుత్వం అందిస్తున్న పథకాలన్ని వర్తిస్తాయన్నారు. గతంలో లొంగిపోయిన వారికి వ్యవసాయ భూములు, ఉపాధి అవకాశాలను కల్పించామని గుర్తు చేశారు.
సారూ.. ఆయనను రప్పించండి
సారూ నీ దండం పెడతా...కుటుంబ పోషణ దుర్భరంగా మారింది...ఎలాగైనా ఆయనను ఇంటికి రప్పిం చండి అంటూ గుర్రంపోడు మండలం చామలోడుకు చెందిన మావోయిస్టు పన్నాల యాదయ్య భార్య అంజమ్మ ఎస్పీ కాళ్లపై పడి గోడును వెళ్లబోసుకుంది. అంజమ్మ దీన స్థితికి చలించిపోయిన ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి వెంటనే వెన్నుతట్టి పైకిలేపి ఓదార్చారు. నీ ఆవేదనను మీడియా ద్వారా తెలియజేయమని సూచించారు.
బిడ్డా.. ఇంటికి రా...
బిడ్డా ఇంటికి రా నీకెందుకు ఈ కష్టాలు....సాధించేమి లేదు...ఇంటికి రా ...ప్రభుత్వం ఇచ్చే సహకారంతో పా టు జిల్లా ఎస్పీ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. నీవు ఇంటికొస్తేఅందరం కలిసి సంతోషంగా గడుపుదాం.
- చిన్న హుస్సేన్, మావోయిస్టు జాన్‌బీ తండ్రి