
రాజయ్యూ.. వారు మారలేదయ్యూ...
- పరిష్కారానికి నోచుకోని కేఎంసీ సమస్యలు
- నిర్దేశించిన గడువు దాటినా.. కానరాని మార్పు
డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజయ్య తొలిసారిగా జూన్ 16న వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రి, కాకతీయ మెడికల్ కళాశాలలో పర్యటిం చారు. అధికారులతో సమీక్షించి సమస్యల పరిష్కారం దిశగా పలు సూచనలు చేశారు. 15 రోజుల గడువు కూడా విధించారు. నిర్దేశించిన గడువు దాటినా... ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా కేఎంసీలో పరిస్థితులు ఉన్నారుు.
సాక్షి, హన్మకొండ : డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజయ్య తొలిసారిగా జూన్ 16 కేఎంసీ, కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా ఎంజీఎం, కేఎంసీలలో నెలకొన్న సమస్యలపై ప్రత్యేకంగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. కేఎంసీలో స్వయంగా తిరిగి అక్కడి పరిస్థితులను పర్యవేక్షించారు. సమస్యలు పరిష్కరించాలంటూ అక్కడికక్కడే ఆదేశాలు జారీచేశారు. మంత్రి నిర్దేశించిన పదిహేను రోజుల గడువు పూర్తయినా సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. డిప్యూటీ సీఎం ఆదేశాలను అమలుచేయడంలో ఎంజీఎం, కేఎంసీ పరిపాలనా అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో పక్షం రోజులు గడిచినా పరిస్థితుల్లో మార్పు రాలేదు.
అధ్వానంగా హాస్టళ్ల నిర్వహణ
కాకతీయ మెడికల్ కళాశాలలో పరిశుభ్రత మచ్చుకైనా కానరావడం లేదు. మెస్‌లు, బాత్‌రూంలు, టాయిలెట్లు.. ఇలా ప్రతీదీ కంపుకొడుతోంది. కాలం చెల్లిన ఫ్రిడ్జ్‌లు, పెచ్చులు ఊడుతున్న భవనాలు, దుమ్ముతో పేరుకుపోయిన మెస్, తలుపులు లేని టాయిలెట్లు, దుర్వాసన వెదజల్లుతున్న మూత్రశాలలు ఇప్పటికీ యథాస్థితిలోనే ఉన్నాయి. హాస్టల్ గదులకు రంగులు వేయడంతోపాటు శానిటేషన్ పనులు చేపట్టాలని మంత్రి రాజయ్య పర్యటన సందర్భంగా ఆదేశించారు.
అయినా వాటి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే చందంగా ఉంది. హాస్టల్ భవనం, అందులోని గదులు భూత్‌బంగాళాను తలపిస్తున్నాయి. కాలేజీలో డ్రైనేజీ వ్యవస్థే లేకపోవడం గమనార్హం. మెస్‌లో భోజనం చేశాక చేతులు కడుక్కునే ఏర్పాటు కూడా లేకపోవడం ఇక్కడి దుస్థితికి అద్దం పడుతోంది. మెస్ కిచెన్‌లో గ్యాస్ మాత్రమే ఉపయోగించాలన్న ఆదేశాలూ బుట్టదాఖలవుతున్నాయి.
అన్నింటికీ ఇబ్బందులే..
కేఎంసీలో మూడు బాయ్స్ హాస్టళ్లున్నాయి. వీటిలో పాత హాస్టల్‌కు నీరు సక్రమంగా అందకపోవడంతో మరో హాస్టల్‌కి వెళ్లి స్నానం చేయాల్సి వస్తోందని కేఎంసీకి వచ్చిన డిప్యూటీ సీఎంకు విద్యార్థులు అప్పట్లో మొరపెట్టుకున్నారు. దీంతో కళాశాలకు అదనంగా తాగునీటి పైపులైన్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను రాజయ్య ఆదేశించారు.
అదేవిధంగా లోవోల్టేజీ కారణంగా హాస్టల్‌లోని రీడింగ్ రూముల్లో లైట్లు సక్రమంగా పనిచేయడం లేదని, దీనివల్ల పరీక్షల సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మెడికల్ విద్యార్థులు విన్నవించారు. స్పందించిన మంత్రి.. కేఎంసీ ఆవరణలోని అరెకరం స్థలంలో సబ్‌స్టేషన్‌కు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. కానీ ఇంతవరకు వీటికి సంబంధించి అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. మంత్రి వచ్చి వెళ్లిన తర్వాత ఒక్క అధికారి కూడా హాస్టల్‌ను సందర్శించిన దాఖలాలు లేవని విద్యార్థులు చెబుతున్నారు.
సమస్యల్లో నర్సింగ్ విద్యార్థులు
రీడింగ్ రూంకు ఫర్నిచర్ కావాలని నర్సింగ్ విద్యార్థులు.. మంత్రి రాజయ్యను కోరడంతో పీజీ హాస్టల్‌లో లక్షల రూపాయల విలువచేసే టేకు ఫర్నిచర్‌కు మర్మతులు చేయించి నర్సింగ్ విద్యార్థులకు అప్పగించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అయితే అధికారులు మాత్రం కిందిగదిలో ఉన్న ఫర్నిచర్‌ను పై గదుల్లోకి తరలించి చేతులు దులుపుకున్నారు తప్పితే రీడింగ్ రూం సంగతి పట్టించుకోలేదు. అంతేకాక విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాల్సి ఉండగా ఆ ఊసెత్తేవారే కరువయ్యారు.
కానరాని హెల్ప్‌డెస్క్
నిత్యం వేలాదిమంది రోగులు, వారి బంధువులు వచ్చే ఎంజీఎం ఆస్పత్రిలో ఏ రోగి ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని ఎంపీ సీతారాంనాయక్ కోరారు. ఇందుకోసం పీఆర్‌ఓలుగా కొనసాగుతున్న ఉద్యోగులను ఉపయోగించుకోవాలని సూచించారు. కాస్త శ్రద్ధ పెడితే పరిష్కారం లభించే సమస్య అయినా సరే అధికారులు హెల్ప్‌డెస్క్ ఏర్పాటుకు ముందుకు రాలేదు.