
ప్రశాంత్‌నగర్ (సిద్దిపేట): తెలంగాణ ఉద్యమంలో సాహిత్యం కీలక పాత్ర పోషించిందని, వెయ్యి ప్రశ్నలకు కేవలం ఒక కవిత, పాటతో మన కవులు, కళాకారులు జవాబు ఇచ్చారని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం పట్టణం లో నిర్వహించిన మంజీర రచయితల సంఘం (మరసం) 32వ వార్షికోత్సవ సభకు ఆయన హాజరై మరసం జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
మంజీరా నది ప్రవహించినట్లుగా మరసం సభ్యులు తమ కవితలు, రచనలు, కళలతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లోని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారన్నారు. ఉద్యమంలో మరసం సభ్యులు కీలక పాత్ర పోషించి, ఉద్యమానికి ఊపిరిలూదారన్నారు. యాచించడం కాదు శాసించి తెలంగాణ సాధించుకోవాలని నాడు ప్రొఫెసర్ జయశంకర్ అన్న మాట ప్రజల్లో చొచ్చు కెళ్లిందన్నారు.
రాష్ట్రాలు విడిపోతే సంక్షోభాలు వస్తాయని అంటూ ఉద్యమాన్ని నీరుగారుస్తున్న వేళలో ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్న ఇద్దరు విడిపోతే భూగోళం బద్దలవుతదా అనే వాక్యంతో వెయ్యి మందికి సమాధానం చెప్పారన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ను అనేక మంది హేళన చేసినపుడు, నాడు సిపాయిల తిరుగుబాటు విఫలమైనప్పుడు అలాగే ఉంటే నేడు స్వతంత్ర భారత్ సిద్ధించేదా అని రాసిన కేసీఆర్ పాట ప్రజల్లోకి బలంగా వెళ్లిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment