ఎనిమిది మంది నిందితులు పాల్గొన్నట్లు అనుమానం
పోలీసుల అదుపులో ఇద్దరు
మెదక్ జిల్లా రామక్కపేటలో దారుణం
దుబ్బాక: తల్లీకూతుళ్లపై అత్యాచారం చేశారు. ఈ సంఘటన మెదక్ జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గిరిజన బాలిక (17) దసరా పండగను పురస్కరించుకుని రాత్రి తోటి మిత్రులకు జమ్మీ ఇవ్వడానికి వెళ్లింది. ఈ సమయంలో అదే గ్రామానికి చెందిన కరుణాకర్ బైక్‌పై వచ్చాడు. తాను కూడా అటే వెళుతున్నానని చెప్పి ఆమెను ఎక్కించుకున్నాడు. అనంతరం ఆమె ముక్కు వద్ద మత్తు మందు పూసిన కర్చీఫ్‌ను ఉంచడంతో ృ్పహ కోల్పోయింది. అక్కడి నుంచి సమీపంలోని నీలగిరి తోటలోకి తీసుకెళ్లాడు. అప్పటికే మాటు వేసి ఉన్న కొంత మందితో కలసి కరుణాకర్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటి నుంచి వెళ్లిన కుమార్తె ఎంతకీ రాకపోవడంతో తల్లిదండ్రులు గ్రామంలో వెతక సాగారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన దిలీప్.. బాలిక తల్లి(40) వద్దకు మీ కుమార్తెను చూపుతానని చెప్పి ఆమెను బైక్‌పై సదరు నీలగిరి తోట వద్దకు తీసుకెళ్లగానే అదే గ్యాంగ్ ఈమెపై కూడా సామూహిక అత్యాచారానికి పాల్పడింది. అనంతరం ఆమెను దిలీప్ మళ్లీ బైక్‌పై ఎక్కించుకుని వస్తుండగా భర్త కనిపించడంతో బైక్‌పై నుంచి దూకి విషయాన్ని చెప్పింది. దీంతో ఇద్దరూ నీలగిరి తోటలోకి వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న కూతురుని చూసి నిశ్చేష్టులయ్యారు. బాధితులు శనివారం ఉదయం దుబ్బాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లీకూతుళ్లను వైద్య పరీక్షల నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా సామూహిక అత్యాచారంలో మొత్తం ఎనిమిది మంది పాల్గొన్నారని, వీరి వయస్సు సుమారు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండవచ్చని సమాచారం. సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్ రెడ్డి గ్రామానికి వచ్చి విచారణ చేశారు. కాగా, నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అదుపులో తీసుకున్నట్లు తెలిసింది.
నిందితులను కఠినంగా శిక్షించాలి: బలరాం నాయక్
మెదక్ జిల్లా దుబ్బాకలో ఇద్దరు గిరిజన మహిళలపై అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ డిమాండ్ చేశారు. గతంలో వరంగల్ జిల్లాలో కాలేజీ అమ్మాయిలపై యాసిడ్‌దాడి చేసిన వారిని పోలీసులు కాల్చి చంపినట్లుగా శిక్ష ఉండాలని పేర్కొన్నారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనను సీఎం, హోంమంత్రి సీరియస్‌గా తీసుకోవాలన్నారు. తెలంగాణలోని గిరిజనులు ఆ నిందితులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని, ఈ ఘటనను తాము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణలో విఫలం: పొంగులేటి
రాష్ట్రంలో శాంతి, భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌నేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి విమర్శించారు. హోంశాఖ నిర్వహణ కోసం వేలకోట్లు ఖర్చు చేస్తున్నా శాంతి, భద్రతల పరిరక్షణలో ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించారు. ఈ వైఫల్యం కారణంగా తాజాగా మెదక్ జిల్లా దుబ్బాకలో ఇద్దరు గిరిజన మహిళలు అత్యాచారానికి గురయ్యారని ఆరోపించారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, విపత్కర పరిస్థితుల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ఉద్దేశించిన 108 సర్వీసు వాహనాలకు డీజిల్ కొరత ఏర్పడిందని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు రావడం లేదని, ఈ విషయంలో ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందన్నారు.
తల్లీకూతుళ్లపై సామూహిక అత్యాచారం
Published Sun, Oct 5 2014 2:35 AM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement
Advertisement