ఖమ్మంక్రైం: పొద్దుపొద్దునే..భారీ పేలుడుతో ఖమ్మంలోని ప్రధాన వ్యాపార, వాణిజ్య కూడలి అయిన కమాన్‌బజార్‌లోని వారంతా ఉలిక్కిపడ్డారు. చుట్టుపక్కల చాలాదూరం వరకు ఈ పేలుడు శబ్దం వినిపించడం, భూమి కంపించినట్లుగా మారడంతో సిటీ ప్రజలు కూడా ఏదో పెద్ద ప్రమాదమే జరిగిందని భయపడి నిద్రలేచారు. కమాన్‌బజార్‌లోని బెందడి రవీందర్‌నాథ్‌కు చెందిన ఓ భవనంలో వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన దేవాండ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి వస్త్రదుకాణం నిర్వహిస్తుండగా..తెల్లవారుజామున నాలుగు గంటల వేళ అందులో ఊహించని పేలుళ్లు చోటు చేసుకున్నాయి.ఈ ధాటికి..రెండంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. పక్కనే ఉన్న మరో రెండు షాపులు దెబ్బతిన్నాయి. చుట్టుపక్కల ఉన్న 20 దుకాణాలకు బీటలు వారి స్వల్ప నష్టం జరిగింది. ఈ ఘటనతో చుట్టుపక్కల నివాసాల్లోని వారంతా భయంతో వణికారు. అదే సమయంలో కరెంట్ సైతం పోయింది. పైకప్పు సీలింగ్‌లు కింద పడ్డాయి. అద్దాలు పగిలిపోవడంతో భూకంపం వచ్చిందనుకుని అరుపులు, కేకలు వేస్తూ..రోడ్డు మీదకు చేరారు. ఆ వీధిలో అంతా పొగజూరి ఉండడంతో కాసేపటికి..ఈ దుకాణం నేలమట్టమైన విషయాన్ని గుర్తించి ప్రమాద తీవ్రతతో జంకారు.
అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అప్రమత్తం
ఈ సమాచారంతో..ఖమ్మంలోని అగ్నిమాపక కేంద్రం నుంచి రెండు అగ్నిమాపక వాహనాలు, నేలకొండపల్లి నుంచి ఓ ఫైరింజన్‌తో సిబ్బంది చేరుకున్నారు. పేలుడు సంభవించిన దుకాణం వెనుక గల భవనంలో నిద్రిస్తున్న..దేవాండ్ల శ్రీనివాస్ మంటల్లో చిక్కుకుని..తనను కాపాడాలని కేకలు వేస్తుండటంతో వన్‌టౌన్ సీఐ రమేష్ ఆధ్వర్యంలో ఎస్సైలు సురేష్, మొగిలి, సిబ్బంది అప్రమత్తమై నిచ్చెన వేసి ఆ వ్యక్తిని కాపాడారు. అప్పటికే అతను తీవ్రంగా గాయపడ్డాడు. వన్‌టౌన్ సీఐ రమేష్..నిచ్చెనతో పైకి తీసుకొచ్చారు. స్థానికులు సహకరించారు. ఎదురుగా సుమంగళి వస్త్ర దుకాణం ఎదుట మంటలు వస్తుండటంతో ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులంతా కేకలు వేశారు. పోలీసులు, ఫైర్‌సిబ్బంది అగ్గిని ఆర్పి..బయటకు తీసుకొచ్చారు. జిల్లా అగ్నిమాపక అధికారి జయప్రకాష్ నాయక్ ఆధ్వర్యంలో అగ్నిమాపక సహాయ అధికారి రేమండ్, ఖమ్మం అగ్నిమాపక అధికారి రాంరెడ్డి, రెస్క్యూటీమ్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. మున్సిపాలిటీ నుంచి తెప్పించిన రెండు జేసీబీల ద్వారా భవన శకలాలను తొలగించారు. ఈ ప్రమాదం మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో జరిగి ఉంటే..జనం రద్దీ ఉండే ఈ ప్రాంతంలో పెను ప్రమాదం జరిగేదని, ప్రాణాపాయం తప్పిందని ఊపిరిపీల్చుకున్నారు.
సందర్శించిన సీపీ, నాయకులు
ఉదయం పూట సంఘటన స్థలాన్ని సీపీ తఫ్సీర్ ఇక్బాల్ సందర్శించారు. సమగ్ర దర్యాప్తు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. భవన యజమాని బెందడి రవీందర్‌నా«థ్ హైదరాబాద్‌లో ఉండగా..పోలీసులు ఖమ్మంకు పిలిపించారు. సీపీ వెంట ఏసీపీ వెంకట్రావు, ఆర్‌ఐ శ్రీనివాస్, సీఐలు రమేష్, షుకూర్, రాజు, నరేందర్, పలువురు సిబ్బంది ఉన్నారు. పోలీస్ హెడ్‌క్వార్టర్ నుంచి వచ్చిన బాంబ్, డాగ్‌స్క్వాడ్ వారు విస్ఫోటనం జరిగిన ప్రాంతంలో పలు ఆధారాలను సేకరించారు. ఖమ్మం మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, మేయర్ పాపాలాల్, కార్పొరేటర్లు కమర్తపు మురళి, అఫ్రోజ్ సమీనాలు సంఘటన స్థలాన్ని సందర్శించారు. సోమవారం కమాన్‌బజార్‌లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దుకాణాలను బంద్ చేయించారు.
షాప్‌ను అద్దెకు తీసుకున్న శ్రీనివాస్ ఏం చేశాడు?
ఈ రెండతస్తుల భవనాన్ని వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన దేవాండ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి కిరాయికి తీసుకున్నాడు. ఇందులో వస్త్ర దుకాణాన్ని నడుపుతున్నాడు. ఇతడికి నర్సంపేటలోనూ షాపు ఉంది. గత కొంతకాలంగా వ్యాపారం సరిగ్గా కొనసాగకపోవడంతో అతను అద్దె కూడా చెల్లించట్లేదు. షాపు ఖాళీ చేయాలని చెప్పడంతో గత మూడు రోజులుగా కొంత సామగ్రి తరలిస్తున్నాడు. బిల్డింగ్ యజమాని బెందడి∙రవీందర్‌నాథ్‌కు మధ్య కిరాయి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. దీంతో..శ్రీనివాసే ఆ ఇంట్లో బాంబు పెట్టి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సంఘటనలో అతను తీవ్రంగా గాయపడడంతో..పేలుడు పదార్థాలు నిల్వ ఉంచడం వల్లనే ఇలా జరిగి ఉండొచ్చని పోలీస్ అధికారులు భావిస్తున్నారు. క్షతగాత్రుడిని పోలీసులు విచారిస్తున్నారు. విస్ఫోటనం చెందిన భవనం వెనుక గదిలో అతడితోపాటు ఇంకెవరైనా ఉన్నారా..? ఈ సంఘటనతో వారు పారిపోయారా..? అనే దానిపై కూడా కూపీ లాగుతున్నారు.
జిలెటిన్‌స్టిక్స్ ఉన్నాయా..?
ఈ భవనాన్ని అద్దెకు తీసుకుని వస్త్రదుకాణం నిర్వహిస్తున్న శ్రీనివాస్..జిలెటిన్ స్టిక్స్ లేదా డిటోనేటర్లు నిల్వ ఉంచి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత విద్యుత్‌షార్ట్ సర్క్యూట్‌తో జరిగిందనుకున్నప్పటికీ..పేలుడు పదార్థాల వల్లే ఈ భారీ విధ్వంసం చోటు చేసుకుందని అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతంలో పలు దుకాణాల్లో అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ చేస్తుండటంతో ప్రమాదవశాత్తూ..సిలిండర్లు పేలాయా..? దీపావళి టపాసులు నిల్వ ఉంచారా..? అని కూడా పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే కేవలం పేలుడు పదార్థాల వల్లే..ఇలా జరిగిందని ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం.
కడప కారులో డైరీ..
ప్రమాదం జరిగిన భవనం వద్ద నిలిపిఉన్న కారు ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందినది. ఇందులో పోలీసులు సోదా చేశారు. ఓ డైరీ, పలు వస్తువులు లభించినట్లు తెలుస్తోంది. ఇదే కారులో రెండు రోజుల క్రితం నలుగురు వ్యక్తులు వచ్చి శ్రీనివాస్ వస్త్రదుకాణంలో ఉన్నారని, వారిపై కూడా తమకు అనుమానం ఉందని స్థానికులు చెబుతున్నారు. కొంతకాలంగా తమిళం మాట్లాడేవ్యక్తులు వస్తుండేవారని, అనుమానాస్పదంగా తిరిగారని స్థానికులు చెబుతున్నారు. సీజ్ చేసిన కారు కడప జిల్లా రాయచోటి పట్టణానికి చెందిన షేక్ షరీఫ్ సన్నాఫ్ మహమూద్ పేరు మీద రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది.
పిల్లలను తీసుకుని పరిగెత్తాం..
మాది పేలుడు జరిగిన దుకాణం పక్కనే ఫ్యాన్సీ షాప్. పొద్దున నాలుగ్గంటలప్పుడు మంచి నిద్రలో ఉన్నాం. ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వినిపించింది. సీలింగ్ అంతా ఊడిపడింది. పిల్లలను తీసుకుని పరిగెత్తుకుంటూ బయటకొచ్చాం. మా దుకాణం షట్టర్లు ఊడిపడ్డాయి. ఇల్లు దెబ్బతింది.
– శ్రీదేవి, లావణ్య ఫ్యాన్సీ
వస్తువులన్నీ పడిపోయాయి..
మా ఇంటి ఎదురుగానే ఈ దుకాణం ఉంది. పేలుడు సంభవించడంతో మా ఇంట్లో ఉన్న సామాన్లన్నీ చిందరవందరగా పడిపోయాయి. ఒక్కసారిగా ఏం జరిగిందో అని కిందికి వచ్చి చూశా. ఎదురుగా మంటలు వస్తున్నాయి. పోలీసులు, ఫైర్‌సిబ్బంది మమ్మల్ని బయటకు తీసుకొచ్చారు.
– బవిరిశెట్టి లక్ష్మీకాంత్, స్థానికుడు
నమ్మలేకపోయాం..
ఇలాంటి పేలుడు సినిమాల్లోనే చూస్తూ ఉంటాం. కానీ మా కళ్లముందే ఇంత భారీ విస్ఫోటనం జరగడంతో తునాతునకలుగా అద్దాలు, వస్తువులన్నీ పడిపోయాయి. ఈ దృశ్యాలను చూసి మేం అస్సలు నమ్మ
లేకపోయాం. చాలా భయమేసింది. వామ్మో..ఇలా జరగొద్దు.
– కమర్తపు కిరణ్‌కమార్, స్థానికుడు
అంతదూరం వినిపించింది..
మా ఇల్లు ప్రభాత్ టాకీస్ దగ్గర్లో ఉంది. కమాన్‌బజార్‌లో పేలిన బాంబు శబ్దం మా ఇంటివరకూ వినిపించింది. అంతా ఉలిక్కిపడ్డాం. కరెంటు కూడా పోయింది. కొద్దిసేపటికి కమాన్‌బజార్‌లో బాంబు పేలిందని తెలిసి..ఇక్కడికి వచ్చిచూస్తే..ఆగమాగంగా ఉంది.
– కిషోర్, స్థానికుడు
Comments
Please login to add a commentAdd a comment