
కొత్తూరు(షాద్‌నగర్): గత పాలకుల నిర్లక్ష్యంతో అన్ని రంగాల్లో వెనుకబడిన రాష్ట్రాన్ని కేవలం మూడున్నర ఏళ్లలోనే అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చామని భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరులో నాట్కో ట్రస్ట్–ఎల్వీప్రసాద్ ఆస్పత్రి భాగస్వామ్యంతో నిర్మించిన కంటి ఆస్పత్రిని ఆయన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో కలసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో హరీశ్‌రావు మాట్లాడుతూ బలహీనంగా మారిన ప్రభుత్వ వ్యవస్థ బలోపేతానికి చర్యలు చేపట్టామన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించారని, దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో 540 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థికి సగటున లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్నారని మంత్రి వివరించారు. తల్లిదండ్రులు ప్రైవేట్ నుంచి తమ పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పించడానికి క్యూ కడుతున్నారన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు, వసతులు మెరుగుపర్చినట్లు చెప్పారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 35 తాలూకా ఆస్పత్రుల్లో డయాలసిస్ సెంటర్లు, 55 ఆస్పత్రుల్లో ఐసీయూలను ఏర్పాటు చేసినట్లు హరీశ్‌రావు చెప్పారు.
గ్రీన్‌ట్రిబ్యునల్‌లో కేసులతోనే ‘పాలమూరు’ఆలస్యం
పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడానికి ప్రతిపక్ష నేతలు చట్టాల్లోని లొసుగుల ఆధారంగా గ్రీన్‌ట్రిబ్యునల్‌లో కేసులు వేస్తున్నారని, దీంతో పనులు ఆలస్యమవుతున్నాయని హరీశ్ అన్నారు. ఏడాది లోపలే అడ్డంకులు, కేసులను పరిష్కరించుకొని చట్టపరంగా పనులు ప్రారంభించడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. 7 నెలల్లో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయడానికి సీఎం కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment