మణుగూరులో మతలబేంది.. | Medaram fair tendering process | Sakshi
Sakshi News home page

మణుగూరులో మతలబేంది..

Published Wed, Jan 13 2016 1:22 AM | Last Updated on Sun, Sep 3 2017 3:33 PM

Medaram fair tendering process

మేడారం జాతర టెండర్ల ప్రక్రియను.. మేడారంలో లేదా, మండలం కేంద్రం తాడ్వాయిలో గానీ, డివిజన్ కేంద్రం ములుగులోనైనా, జిల్లా కేంద్రం వరంగల్‌లో నిర్వహించకుండా ఖమ్మం జిల్లా మణుగూరును ఎంచుకున్నారు.
 
వరంగల్ మేడారం జాతర నిర్వహణ ఏర్పాట్లలో అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. బెల్లం సేకరణ టెండర్ల ప్రక్రియను అధికారులు హడావుడిగా.. రహస్యంగా నిర్వహిస్తుండడంపై ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా వన దేవతలను దర్శించుకునే భక్తులు మొక్కుల రూపంలో అమ్మవార్ల గద్దెల వద్ద బంగారం(బెల్లం) సమర్పిస్తారు. జాతర సమయంలో వేల క్వింటాళ్ల బెల్లం గద్దెల ప్రాంగణంలో పోగవుతుంది. ఇలా పోగైన బెల్లాన్ని అక్కడి నుంచి తొలగిస్తూ ఎప్పటికప్పుడు గద్దెల ప్రాంగణాన్ని శుభ్రపరచడం కష్టమైన పనిగా ఉంటోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని మొదటి సారిగా 2012 జాతర సమయంలో వనదేవతలను దర్శించుకున్న భక్తులకు బెల్లం ప్రసాదంగా ఇవ్వాలని పాలనా యంత్రాం గం నిర్ణయించింది. గద్దెల వద్ద భక్తులు సమర్పించిన బెల్లాన్ని పోగు చేసి అక్కడి నుంచి తీసుకుపోవడం, భక్తులకు ప్రసాదంగా బెల్లాన్ని ఇవ్వడం పనులను టెండరు పద్ధతిలో ఏజెన్సీ ప్రాంతంలోని యువజన సంఘాలకు అప్పగించారు. అప్పటి జాతరలో బెల్లం పోగుచేసే టెండర్ పొందిన కాంట్రాక్టర్‌కు ఊహించిన విధంగా లాభాలు వచ్చాయి. ఈ విషయాన్ని గుర్తించిన మరి కొంత మంది 2014 జాతర సమయంలో ఈ పనులను దక్కించుకునేందుకు ప్రయత్నించారు. రాజకీయంగా అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి సాధించుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారాయి. గత జాతరలో బెల్లం సేకరణ పనులు దక్కించుకున్న బృందానికి ఇప్పుడు అనుకూల పరిస్థితులు లేవు. లాభదాయకమైన ఈ టెండరును పొందేందుకు వ్యూహాలు రచించారు. పోటీ లేకుండా పనులు దక్కించుకునేలా దేవాదాయ శాఖ అధికారులతో అవగాహన కుదుర్చుకున్నారు. దేవాదాయ శాఖ అధికారులు మరింత ముందుడుగు వేశారు. గత జాతరలో కేవలం రూ.1.60లక్షలకు దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు పెద్ద మొత్తంలో లాభాలు రావడంతో ఈ వ్యూహాన్ని రచించినట్లు సమాచారం.

పక్క జిల్లాలో టెండర్లు
మేడారం జాతర టెండర్ల ప్రక్రియను.. మేడారంలోగానీ, మండలం కేంద్రం తాడ్వాయిలో గానీ, డివిజన్ కేంద్రం ములుగులో గానీ, జిల్లా కేంద్రం వరంగల్‌లో గానీ నిర్వహించకుండా ఖమ్మం జిల్లాను ఎంచుకున్నారు. మణుగూరు పట్టణం శివలింగాపూర్‌లోని శ్రీనీలకంఠేశ్వరస్వామి ఆలయంలో బుధవారం(జనవరి 13న) బెల్లం పోగుచేసే టెండర్ల ప్రక్రియను నిర్వహిస్తున్నారు. మేడారంతో ఎలాంటి సంబంధమూలేని మణుగూరు లో టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే దేవాదాయ శాఖ అధికారులు ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఏడాది మాదిరిగా వరంగల్ జిల్లా కేంద్రంలో టెండర్లు నిర్వహిస్తే ఎక్కువ మంది పోటీపడేవారని, దీని వల్ల దేవాదాయ శాఖకు ఆదాయం వచ్చేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మేడారం జాతర ఏర్పాట్ల పనుల కోసం ఇప్పటివరకు నిర్వహించిన టెండర్లన్నీ ఈ-ప్రొక్యూర్‌మెంట్ పద్ధతిలో నిర్వహించారు. దేవాదాయ శాఖ బాక్సు టెండర్లను నిర్వహించినా జిల్లాలోనే జరిగాయి. ఇప్పడు టెండరు ప్రక్రియ ఒకేసారి పక్క జిల్లాకు మార్చడం చర్చనీయాంశంమైంది. మరోవైపు హడావుడిగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. మేడారం జాతర జరిగే తేదీ ఏడాది క్రితమే నిర్ణయమైంది. ఇన్నాళ్లూ పట్టించుకోని దేవాదాయ శాఖ అధికారులు... జాతర దగ్గరపడుతున్న సమయంలో టెండరు ప్రక్రియను చేపట్టారు. అంతా వారంలోపే పూర్తయ్యేలా హడావుడిగా పూర్తి చే స్తుస్తుండడంతో దేవాదాయ శాఖపై విమర్శలు వస్తున్నారుు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement