‘స్థానిక’ సమరానికి సన్నద్ధం | Medchal Malkajgiri Ready For ZPTC And MPTC Elections | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ సమరానికి సన్నద్ధం

Published Mon, Apr 15 2019 8:13 AM | Last Updated on Mon, Apr 15 2019 8:13 AM

Medchal Malkajgiri Ready For ZPTC And MPTC Elections - Sakshi

సాక్షి, మేడ్చల్‌ జిల్లా: మేడ్చల్‌– మల్కాజిగిరి జిల్లాలో 42 ఎంపీటీసీ, నాలుగు ఎంపీపీ, నాలుగు జెడ్పీటీసీ స్థానాలతోపాటు జిల్లా ప్రజా పరిషత్‌ (జెడ్పీ) చైర్మన్‌ స్థానానికి సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసిన అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణపై మరో సమరానికి సన్నద్ధమవుతోంది. మే నెలలో మూడు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. జిల్లాలో 61 గ్రామ పంచాయతీల పరిధిలో 42 ఎంపీటీసీలు, నాలుగు జెడ్పీటీసీ, నాలుగు ఎంపీపీ స్థానాలు మాత్రమే ఉండటంతో మొదటి దశలోనే స్థానిక ఎన్నికలను పూర్తి చేస్తామని జిల్లా  అధికార యంత్రాంగం రాష్ట్ర ఎన్నికల సంఘానికి  ప్రతిపాదనలు నివేదించింది. ఈ నెల 18న జరిగే కలెక్టర్ల సమావేశంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశం ఫైనల్‌ కానున్నట్లు సమాచారం. జిల్లాలోని శామీర్‌పేట్‌ మండలంలో కొత్తగా ఏర్పడిన మూడు చింతలపల్లి రెవెన్యూ మండలంగా మాత్రమే కొనసాగనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మండల పరిషత్‌ విషయానికి వస్తే మూడు చింతలపల్లి ఉమ్మడి శామీర్‌పేట్‌ మండలం పరిధిలోనే ఉంటుందని పేర్కొంటున్నారు. 

650 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రం
మేడ్చల్‌ జిల్లాలో 61 గ్రామ పంచాయతీల పరిధిలో 42 ఎంపీటీసీ స్థానాల్లో 1.39 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 650 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రం చొప్పున 297 పోలింగ్‌ కేంద్రాలను  ఏర్పాటు చేసిన యంత్రాంగం అన్ని వసతులు ఉండేలా చర్యలు తీసుకుంది. ఎన్నికల నిర్వహణలో రెండు వేల మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.39 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించిన అధికార యంత్రాంగం అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకోనుంది.   

4 మండలాలతో మేడ్చల్‌ జెడ్పీ
సాక్షి, మేడ్చల్‌ జిల్లా: మేడ్చల్‌– మల్కాజిగిరి జిల్లా ప్రజాపరిషత్‌ (జెడ్పీ)నాలుగు మండలాలకు మాత్రమే పరిమితమైంది. మేడ్చల్‌ అసెంబ్లీ నియోజకవర్గాన్ని మినహాయిస్తే మిగతా నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు జీహెచ్‌ఎంసీ పరిధితో పాటు మున్సిపాలిటీలు కొనసాగుతున్నాయి. దీంతో మేడ్చల్‌ నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, 61 గ్రామ పంచాయతీలు, 42 ఎంపీటీసీ స్థానాలతో మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా ప్రజాపరిషత్‌ (జెడ్పీ)ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 

రిజర్వేషన్లు ఇలా..
మేడ్చల్‌ జెడ్పీ చైర్మన్‌ స్థానాన్ని జనరల్‌ కేటగిరికి రిజర్‌ చేశారు. దీంతో  నాలుగు మండలాల పరిధిలోని జెడ్పీటీసీ స్థానాలకు తీవ్ర పోటీ నెలకొనే అవకాశముంది. జిల్లాలోని నాలుగు మండలాల పరిధిలో 61 గ్రామ పంచాయతీలు ఉండగా, 42 ఎంపీటీసీ స్థానాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఘట్‌కేసర్‌ మండలంలో 11 గ్రామ పంచాయతీలకు సంబంధించి తొమ్మిది ఎంపీటీసీ స్థానాలు, కీసర మండలంలో 11 గ్రామ పంచాయతీల పరిధిలో ఎనిమిది ఎంపీటీసీ స్థానాలు, శామీర్‌పేట్‌ మండలంలో 22 గ్రామ పంచాయతీలకు సంబంధించి 15 ఎంపీటీసీ స్థానాలు, మేడ్చల్‌ మండలంలో 17 గ్రామ పంచాయతీలకు సంబంధించి 10 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. ఘట్‌కేసర్‌ మండలంలో తొమ్మిది ఎంపీటీసీ స్థానాల్లో ఎస్సీకి రెండు రిజర్వు చేయగా, ఇందులో ఒకటి ఎస్సీ జనరల్, ఒకటి ఎస్సీ మహిళకు కేటాయించారు. బీసీకి రెండు స్థానాలు రిజర్వు చేయగా ఒకటి బీసీ మహిళ, ఒకటి బీసీ జనరల్, ఇతరులకు ఐదు స్థానాలు రిజర్వు చేయగా, ఇందులో మహిళలకు రెండు , జనరల్‌కు మూడు కేటాయించారు.  
కీసర మండలంలో ఎనిమిది ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఇందులో ఎస్సీ మహిళకు ఒకటి రిజర్వు చేశారు. బీసీలకు మూడు స్థానాలు కేటాయించారు. ఇందులో రెండు స్థానాలు బీసీ జనరల్‌కు కేటాయించగా, ఒక స్థానాన్ని బీసీ మహిళకు రిజర్వు చేశారు. ఇతరులకు నాలుగు స్థానాలు కేటాయించారు. వీటి రెండు స్థానాలు మహిళలకు, రెండు స్థానాలు జనరల్‌కు రిజర్వు చేశారు.  
మేడ్చల్‌  మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఒకటి ఎస్టీ మహిళకు రిజర్వు చేశారు. ఎస్సీలకు సంబంధించి ఒకటి మాత్రమే కేటాయించగా మహిళలకు రిజర్వు చేశారు. బీసీలకు మూడు స్థానాలు కేటాయించగా ఇందులో ఒకటి మహిళలకు, రెండు స్థానాలు బీసీ జనరల్‌కు రిజర్వు చేశారు. ఇతరులకు ఐదు స్థానాలు రిజర్వు చేశారు. ఇందులో మహిళలకు రెండు స్థానాలు, జనరల్‌కు మూడు స్థానాలు కేటాయించారు.  
శామీర్‌పేట్‌ మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ఇందులో ఎస్టీ మహిళకు ఒకటి రిజర్వు చేశారు. ఎస్సీలకు మూడు స్థానాలు కేటాయించగా.. ఇందులో ఒకటి మహిళకు, రెండింటిని జనరల్‌ (ఎస్సీ)కు రిజర్వు చేశారు. బీసీలకు మూడు స్థానాలు రిజర్వు కాగా, ఇందులో ఒకటి మహిళ, రెండు జనరల్‌కు కేటాయించారు. ఇతరులకు ఎనిమిది స్థానాలు రిజర్వు చేయగా, ఇందులో నాలుగు మహిళ, నాలుగు జనరల్‌కు కేటాయించారు. 

ఎంపీపీ ఇలా..  
జిల్లాలో నాలుగు మండలాలు ఉన్నాయి. శామీర్‌పేట్‌ ఎంపీపీ స్థానాన్ని ఎస్సీ జనరల్‌కు రిజర్వు చేశారు. కీసర ఎంపీపీ స్థానం బీసీ జనరల్, ఘట్‌కేసర్‌ ఎంపీపీ స్థానాన్ని ఆన్‌రిజర్వుడ్‌కు కేటాయించారు. మేడ్చల్‌ ఎంపీపీ స్థానాన్ని జనరల్‌ మహిళకు రిజర్వు చేశారు. 

జెడ్పీటీసీ ఇలా..
శామీర్‌పేట్‌ జెడ్పీటీసీ స్థానాన్ని ఎస్సీ మహిళకు కేటాయించారు. కీసర జెడ్పీటీసీ స్థానాన్ని బీసీ జనరల్‌కు, ఘట్‌కేసర్‌ స్థానాన్ని అన్‌రిజర్వుడ్‌కు కేటాయించారు. మేడ్చల్‌ జెడ్పీటీసీ స్థానాన్ని జనరల్‌ మహిళకు రిజర్వు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement