
విమానం మిస్సయిన మీరాకుమార్
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం నుంచి భువనేశ్వర్ వెళ్లాల్సిన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్ ఫ్లైట్ మిస్సయ్యారు. సాయంత్రం 5.15 గంటలకు ఆమె విమానం ఎక్కాల్సి ఉంది. అయితే, వీఐపీ లాంజ్‌లో కాంగ్రెస్ నేతలతో మాట్లాడుకుంటూ ఉండిపోయిన ఆమె సమయానికి లోపలికి వెళ‍్లలేకపోయారు. దీంతో విమానం వెళ్లిపోయింది. దీంతో రాత్రి 8 గంటలకు భువనేశ్వర్ వెళ్లే విమానం కోసం అక్కడే ఎదురుచూస్తున్నారు.
కాగా, రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని కోరేందుకు ఆమె హైదరాబాద్ వచ్చారు. అంతకుముందు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. తర్వాత నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ హాల్‌లో వామపక్ష నాయకులతో సమావేశమయ్యారు. తనకు మద్దతు ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు.