సాక్షి, హైదరాబాద్: జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించి వేగంగా అడుగులు పడుతున్నాయని ఉద్యాన వర్సిటీ వర్గాల సమాచారం. వాటిని ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చిస్తానని ఇటీవల గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో వాటి విలీనం తప్పదని చెబుతున్నారు. వాటి విలీనంతో రైతులకు మరింత మేలు జరుగుతుందని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) డైరెక్టర్ జనరల్ త్రిలోచనా మహాపాత్ర కూడా హైదరాబాద్‌లో ఇటీవల పేర్కొన్నారు.
కాగా, విలీనాన్ని ఉద్యాన వర్సిటీ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, వ్యవసాయ వర్సిటీ వర్గాలు ఆహ్వానిస్తున్నాయి. రెండింటినీ కలిపితే ఉద్యాన పరిశోధనలకు బ్రేక్ పడుతుందని ఉద్యాన వర్గాలు చెబుతున్నాయి. విలీనం ఆలోచనను విరమించుకోవాలని కోరుతూ ఉద్యాన వర్సిటీ అధికారులు ఉద్యాన వర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌గా ఉన్న వ్యవసాయ కార్యదర్శి సి.పార్థసారథి నేతృత్వంలో గవర్నర్‌ను కలవాలని నిర్ణయించినట్లు ఉద్యాన వర్సిటీ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ఉద్యాన వర్సిటీని విలీనం చేశాక వ్యవసాయ శాఖలో ఉద్యాన శాఖను కూడా కలిపే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ రెండు శాఖలను విలీనం చేయాలని గతేడాదే ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించినా ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కు తగ్గింది.
ఒకే దగ్గర సేవలంటూ..
రైతులు వ్యవసాయ పంటలతో పాటు ఉద్యాన పంటలు సాగు చేస్తారు. పశు పోషణ కూడా చేపడతారు. రైతులు మూడు అవసరాలకు మూడు వర్సిటీలకు వెళ్లడం కష్టమన్న చర్చ జరుగుతోంది. కాబట్టి వ్యవసాయ, ఉద్యాన, పశు విశ్వవిద్యాలయాలు వేర్వేరుగా ఉండటమెందుకు అన్న వాదన తీసుకొస్తున్నారు. అయితే వ్యవసాయ, ఉద్యాన వర్సిటీలు ఐకార్ పరిధిలోకి వస్తాయి. పశు విశ్వవిద్యాలయం మాత్రం వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వీసీఐ) పరిధిలో ఉంటుంది. మూడింటినీ కలపడం కష్టమైన పనని, ఐకార్ పరిధిలో ఉన్న వ్యవసాయ, ఉద్యాన వర్సిటీలను విలీనం చేయాలని యోచిస్తున్నారు. వీటిని కలపకుంటే నిధులు విడుదల చేయబోమని కూడా ఓ సందర్భంలో ఐకార్ హెచ్చరించినట్లు ఉద్యాన వర్సిటీ వర్గాలు చెప్పాయి.
విలీనం కుట్ర!
‘విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరుగుతుంటాయి. పరిశోధనలు జరిగే చోటకు రైతులు పెద్దగా రారు. వేర్వేరుగా ఉండటం వల్లే మరింత ప్రయోజనం. విలీనంలో ఏదో కుట్ర దాగుంది’అని ఉద్యాన వర్సిటీ అధికారి ఒకరు అనుమానం వ్యక్తం చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన అధికారులు కొందరు విలీనాన్ని కోరుకుంటూ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శిస్తున్నారు. వాస్తవానికి వ్యవసాయ వర్సిటీల్లో జరిగే పరిశోధనల్లో 40 నుంచి 50 శాతం వరకు ఉద్యాన పంటలకు సంబంధించినవేనని పేర్కొంటున్నారు. నిధుల భారాన్ని తగ్గించుకునేందకు ఐకార్ ఈ ఆలోచన చేస్తోందని ఆరోపిస్తున్నారు.
8 ఏళ్ల కిందే రెండు వర్సిటీల ఏర్పాటు..
ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో భాగంగానే ఉద్యాన విభాగం ఉండేది. వ్యవసాయ, ఉద్యాన రంగాలు ప్రత్యేకంగా ఉంటే పరిశోధనలు మరింత ఊపందుకుంటాయని 8 ఏళ్ల కింద అప్పటి ప్రభుత్వం రెండు వర్సిటీలను వేరు చేసింది. తెలంగాణ వచ్చాక రెండు వర్సిటీలను వేర్వేరుగా ఏర్పాటు చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వైస్‌చాన్స్‌లర్‌ను నియమించిన ప్రభుత్వం ఉద్యాన వర్సిటీని మాత్రం పట్టించుకోలేదు. వ్యవసాయశాఖ కార్యదర్శినే ఉద్యాన వర్సిటీ వీసీగా కొనసాగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment