అయ్యో..మర్చిపోయా.. | Metro Passengers Forget Daily Usage Items In Hyderabad | Sakshi
Sakshi News home page

అయ్యో..మర్చిపోయా..

Published Sat, Aug 10 2019 3:05 AM | Last Updated on Sat, Aug 10 2019 5:33 AM

Metro Passengers Forget Daily Usage Items In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టిఫిన్‌ బాక్సులు, బ్యాగులు, పెన్నులు, బిరియానీ ప్యాకెట్‌.. వస్తువేదైతేనేం.. అయ్యో మరిచిపోయా అని అనుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందట.. మెట్రో జర్నీలో సిటీజనం తరచూ వస్తువులను మరిచిపోతున్నారట. అయితే.. వారి వస్తువులను మెట్రో సిబ్బంది భద్రంగా అప్పజెప్పుతున్నారు.. ఇందుకోసమే మెట్రో లాస్ట్‌ అండ్‌ ప్రాపర్టీ ఆఫీస్‌ పనిచేస్తోంది. నగరంలోని మెట్రో రూట్లలో నిత్యం 3 లక్షల మంది ప్రయాణిస్తుంటారు.. వీరిలో నెలకు కనీసం 200 మంది తమ వస్తువులను పోగొట్టుకుంటున్నట్లు మెట్రో అధికారులు చెబుతున్నారు. ప్రయాణ సమయంలో హడావుడి, సమయానికి ఆఫీసుకు చేరుకోవాలన్న తొందరలో చాలా మంది లగేజీ స్కానింగ్‌ యంత్రాల వద్దనే తమ వస్తువులను మరచిపోతున్నారట.  

అప్పజెప్పుతున్నారిలా..  
లగేజీ స్కానర్ల వద్ద వస్తువులను మరిచిపోతే.. స్టేషన్‌ కంట్రోలర్‌ మైక్‌లో అనౌన్స్‌ చేస్తారు. అప్పటికీ.. సంబంధిత వ్యక్తులు రానట్లయితే.. వాటిని జాగ్రత్తగా ట్యాగ్‌ చేస్తున్నారు. 3రోజులపాటు సదరు స్టేషన్‌ కంట్రోలర్‌ రూమ్‌లో ఉంచుతున్నారు. ఆ వ్యక్తి అప్పటికీ స్టేషన్‌లో సంప్రదించని పక్షంలో.. వాటిని లాస్ట్‌ అండ్‌ ప్రాపర్టీ ఆఫీస్‌(ఎల్‌పీఓ)కు పంపుతున్నారు. ప్రయాణికులు మరచిపోయే వస్తువుల్లో ఆహార పదార్థాలు ఉంటే.. అవి చెడిపోయే ప్రమాదమున్నందున వాటిని మాత్రం ఎప్పటికప్పుడు పడేస్తారు.

 

ఆభరణాలు మరిచిపోయారు..  
ఇటీవల శివ అనే అతను మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ వద్ద ఒక బ్యాగ్‌ మరచిపోయారు. మెట్రో సిబ్బంది ఆ బ్యాగ్‌ను భద్రపరిచారు. ఇందులో సుమారు రూ.3 లక్షల విలువైన బంగారు ఆభరణాలున్నాయి. ఈ బ్యాగును సదరు ప్రయాణికునికి అప్పజెప్పినట్లు మెట్రో అధికారులు తెలిపారు. అదే సమయంలో పర్సులో ఇమిడే కత్తులు, ఇతర మారణాయుధాలు, డ్రగ్స్‌ తదితర విషయాలను క్షుణ్ణంగా పరిశీలించే విషయంపై మెట్రో భద్రతా సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణనిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీని కోసం లగేజీ స్కానింగ్‌ యంత్రాలు ఉపయోగిస్తున్నారు. అలాగే.. మద్యం తాగి వచ్చేవారికి భద్రతా సిబ్బంది నో ఎంట్రీ చెబుతున్నారు. ప్రయాణికున్ని క్షుణ్ణంగా తనిఖీ చేసే సమయంలో మద్యం వాసన గుప్పుమంటే సదరు మందుబాబులను వెనక్కి పంపేస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement