
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. తొలి దశ ప్రాజెక్టును ప్రైవేటు, పబ్లిక్ భాగస్వామ్య(పీపీపీ) విధానంలో చేపట్టినా రెండో దశ మాత్రం ప్రభుత్వ ప్రాజెక్టుగానే పట్టాలెక్కనుంది. తొలి దశ ప్రాజెక్టులోని కారిడార్లతో పోల్చితే రెండో దశలోని కారిడార్ల పరిధిలో జన సాంద్రత తక్కువగా ఉన్న నేపథ్యంలో పీపీపీ విధానంలో పెట్టుబడులు రాబట్టుకోవడం కష్టమని ఈ నిర్ణయం తీసుకుంది. తొలి దశ కింద మూడు మార్గాల్లో(కారిడార్లలో) మెట్రో నిర్మాణ పనులు జరుగుతుండగా.. రెండో దశ కింద రూ.9,378 కోట్ల అంచనా వ్యయంతో మరో మూడు మార్గాల్లో మొత్తం 62 కిలోమీటర్ల పొడవున ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది.
తొలి దశకు కొనసాగింపుగా..
మెట్రో తొలి దశ ప్రాజెక్టుకు సంబంధించి రూ.14,132 కోట్ల అంచనా వ్యయంతో మూడు కారిడార్ల పరిధిలో పనులు చేపట్టారు. తొలి కారిడార్‌లో భాగంగా మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు 29 కి.మీ.లు, రెండో కారిడార్‌లో జేబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 15 కి.మీ.లు, మూడో కారిడార్‌లో నాగోల్ నుంచి రాయ్‌దుర్గ్ వరకు 28 కి.మీ.ల మెట్రో నిర్మాణం జరుగుతోంది. ఇప్పటి వరకు 85 శాతం పనులు పూర్తయ్యాయి. తొలి దశ కింద చేపట్టిన మూడు కారిడార్లకు కొనసాగింపుగా రెండో దశ కింద.. నాలుగో కారిడార్‌గా గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ పార్కు నుంచి శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 30.7 కిలోమీటర్ల పొడవున ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు. ఐదో కారిడార్‌లో భాగంగా బీహెచ్‌ఈఎల్ నుంచి మియాపూర్ మీదుగా లక్డికాపూల్ వరకు 26.2 కిలోమీటర్ల మార్గం ఏర్పాటు కానుంది. తొలి దశలోని మూడో కారిడార్ (నాగోల్ నుంచి రాయ్‌దుర్గ్) విస్తరణలో భాగంగా నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు 5.1 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మించనున్నారు.
కేంద్రానికి ప్రతిపాదనలు..
మెట్రో రెండో దశకు సంబంధించిన ప్రాథమిక ప్రాజెక్టు నివేదిక(పీపీఆర్), సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ల రూపకల్పన బాధ్యతలను ఢిల్లీ మెట్రో రైలు సంస్థ(డీఎంఆర్‌సీఎల్)కు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ(హెచ్‌ఎంఆర్‌ఎల్) అప్పగించగా.. ఈ మేరకు పీపీఆర్‌ను డీఎంఆర్‌సీఎల్ సమర్పించింది. రూ.9,378 కోట్ల అంచనా వ్యయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమ యాజమాన్య ప్రాజెక్టు(ఈక్వల్ ఓనర్‌షిప్ ప్రాజెక్టు)గా రెండో దశను చేపట్టాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెట్టుబడి వాటాలు పోగా మిగిలిన వ్యయాన్ని విదేశీ ఆర్థిక సంస్థల నుంచి రుణాల రూపంలో సమీకరించాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలను ఆమోదించాలని కోరుతూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ ఇటీవల కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖకు లేఖ రాశారు. విదేశీ ఆర్థిక సంస్థల రుణాలను ఆకట్టుకునే సామర్థ్యం కలిగిన ప్రాజెక్టుల జాబితాలో మెట్రో రెండో దశను చేర్చేలా కేంద్ర విదేశాంగ శాఖకు ఈ లేఖను పంపించాలని(ఫార్వార్డ్ చేయాలని) విజ్ఞప్తి చేశారు.
రెండు భాగాలుగా రెండో దశ
మెట్రో రెండో దశను రాష్ట్ర ప్రభుత్వం రెండు భాగాలుగా విభజించింది. రెండో దశ(ఏ) కింద బయోడైవర్సిటీ పార్క్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 4వ కారిడార్‌ను, రెండో దశ(బీ)లో భాగంగా బీహెచ్‌ఈఎల్ నుంచి లక్డికాపూల్ వరకు ఐదో కారిడార్‌ను, మూడో కారిడార్ విస్తరణ పేరుతో నాగోల్–ఎల్బీనగర్ మార్గాల్లో మెట్రోను నిర్మించనుంది. రూ.9,378 కోట్లతో రెండో దశ ప్రాజెక్టును చేపట్టనుండగా 22 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు, 18 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీ డిపాజిట్లు, 60 శాతం విదేశీ ఆర్థిక సంస్థల రుణాల ద్వారా నిధులు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment