
మెట్రోలో ప్రయాణిస్తున్న మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి తదితరులు
సాక్షి, సిటీబ్యూరో: నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు దూరం..8 కి.మీ. ఈ దూరాన్ని కేవలం 8 నిమిషాల వ్యవధిలోనే మెట్రో రైలులో చేరుకోవచ్చు. అదేంటి ప్రతి నిమిషానికి ఓ కిలోమీటరు దూరం ప్రయాణించడం ఎలా సాధ్యం అంటే...80 కేఎంపీహెచ్ వేగంతో మార్గమధ్యంలోని ఏడు స్టేషన్లలో ఎక్కడా మెట్రోరైలు నిలపకుండా జర్నీ చేస్తే ..కేవలం నిమిషానికో కిలోమీటరు జర్నీని హ్యాపీగా పూర్తి చేయవచ్చని మెట్రో రైడ్ నిరూపించింది. శనివారం మున్సిపల్ మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులు, నగర ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులతో కలిసి మెట్రో జర్నీ చేశారు. ఈ రైడ్ పట్ల వారంతా సంతృప్తి వ్యక్తంచేశారు. రణగొణ ధ్వనులు..ట్రాఫిక్ రద్దీ....గతుకుల రహదారులపై కుదుపుల ప్రయాణం, కాలుష్యం వంటి సమస్యలకు మెట్రో జర్నీ చెక్‌పెట్టనుందని పేర్కొన్నారు. ఈ జర్నీలో నగర ఎమ్మెల్యేలు ఎన్‌వీఎస్‌స్ ప్రభాకర్, వివేకానంద, గోపీనాథ్, చింతల రాంచంద్రారెడ్డి, మేయర్ రామ్మోహన్, హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, ఎల్‌అండ్‌టీ మెట్రో ఎండీ శివానంద్ నింబార్గీ తదితరులు పాల్గొన్నారు.
మెట్రో వేళలే ప్రతిబంధకం!
ఈ నెల 29 (బుధవారం) నుంచి నాగోల్–అమీర్‌పేట్(17 కి.మీ), మియాపూర్–అమీర్‌పేట్(13కి.మీ)రూట్లో సిటీజన్లకు మెట్రో రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మార్గంలో తొలి మూడునెలలపాటు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే మెట్రో రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ తర్వాత ప్రయాణికుల ఫీడ్‌బ్యాక్‌నుబట్టి ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకే మెట్రో రైళ్లను నడుపుతామని మెట్రో అధికారులు చెబుతున్నారు. అయితే ఐటీ, బీపీఓ, కెపిఓ రంగాల్లో దూసుకుపోతున్న విశ్వనగరంలో ఉద్యోగుల పనివేళలు షిఫ్టులవారీగా 24 గంటలపాటు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో మెట్రో రైళ్లను కనీసం ఉదయం 5 నుంచి అర్థరాత్రి ఒంటింగట వరకు నడపాలని సిటీజన్లు కోరుకుంటున్నారు.
మెట్రో ప్రయాణ సమయం ఇలా...
నాగోల్–అమీర్‌పేట్(17 కి.మీ): ఈ రూట్లో ప్రతి 10–15 నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది. ఈ రూట్లోని 14 స్టేషన్ల వద్ద ఒక్కో స్టేషన్‌లో రైలు 20 సెకన్లపాటు ఆగుతుంది. 25 నిమిషాల్లో గమ్యస్థానం చేరుకోవచ్చు.
మియాపూర్–అమీర్‌పేట్(13కి.మీ): ఈ రూట్లో ప్రతి 10–15 నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది. ఈ రూట్లోని మొత్తం 10 స్టేషన్లున్నాయి. ఒక్కో స్టేషన్‌లో 20 సెకన్లపాటు రైలు ఆగుతుంది. 20 నిమిషాల్లో గమ్యం చేరుకోవచ్చు.
బాలారిష్టాలివే...
♦ స్టేషన్ల వద్ద పార్కింగ్ సదుపాయం లేదు. మొత్తం 24 స్టేషన్లకు 11 చోట్లనే పార్కింగ్ వసతులున్నాయి.
♦ ప్రతీస్టేషన్‌వద్ద సుందరీకరణ పనులు కొలిక్కిరాలేదు. ప్రారంభ ముహూర్తం దగ్గరపడుతున్నా పనులు నత్తనడకన సాగుతున్నాయి. పలు చోట్ల నిర్మాణ వ్యర్థాలు డంప్‌గా పడిఉన్నాయి.
♦ ప్రతీ స్టేషన్ వద్ద క్యాబ్‌లు, ఆటోలు, బస్సులు నిలిపేందుకు స్థలాలు లేవు.
♦ పలు స్టేషన్ల వద్ద ఫుట్‌పాత్‌లు, స్ట్రీట్‌ఫర్నీచర్ ఇంకా ఏర్పాటుకాలేదు.
♦ స్టేషన్లకు సమీపంలో ఉన్న ముఖ్యభవంతులకు స్కైవాక్‌లు ఏర్పాటుచేయలేదు.
♦ 24 స్టేషన్ల నుంచి ఆర్టీసీ కేవలం 50 ఫీడర్ బస్సులు మాత్రమే నడుపుతుంది. వీటిని రెట్టింపు చేయాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment