పాతబస్తీలో పెరుగుతున్న వలస కూలీలు | Migrant laborers in Hyderabad | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో పెరుగుతున్న వలస కూలీలు

Published Mon, Jul 15 2019 10:51 AM | Last Updated on Mon, Jul 15 2019 10:51 AM

Migrant laborers in Hyderabad - Sakshi

పాతబస్తీలో పనుల కోసం ఎదురు చూస్తున్న అడ్డా కూలీలు

చార్మినార్‌: సకాలంలో వర్షాలు పడకపోవడం...గ్రామాల్లో వ్యవసాయం లేకపోవడం...కుటుంబ భారం మీద పడడంతో పేద రైతులు పాతబస్తీ బాట పడుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా....పేద కూలీల బతుకులు మారడం లేదు. పాతబస్తీకి శివారు జిల్లాల నుంచి కూలీల వలస ఆగడం లేదు. పాలమూరు, నల్గొండ, మెదక్‌ తదితర జిల్లాల నుంచి పాతబస్తీకి వలసలు పెరుగుతూనే ఉన్నాయి. అడ్డా కూలీ పనులు చేసుకోవడానికి పాతబస్తీకి వస్తున్న పేదలకు అద్డె ఇల్లు దొరక్క ఖాళీ స్థలాలు, ఫుట్‌పాత్‌లపై తాత్కాలిక గుడిసెల వేసుకుని జీవనం సాగిస్తున్నారు. ప్రతి రోజు ఉదయాన్నే డబీర్‌పురా చౌరస్తా, బడాబజార్, కోకాకీతట్టీ, లాల్‌దర్వాజా మోడ్, ఛత్రినాక, బేలా చౌరస్తా, తాడ్‌బన్, సంతోష్‌నగర్, ఎర్రగుంట, యాకుత్‌పురా చౌరస్తాల్లో పేద కూలీలు పనుల కోసం నిరీక్షిస్తుంటారు. పనులు దొరకనప్పుడు  ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల నాయకులు సభలు, సమావేశాలు నిర్వహించేందుకు కూడా వీరందరిని సమీకరించి ఉపా ధి కల్పించి ఎంతో కొంత ముట్టచెబుతున్నారు.

ప్రభుత్వాలు మారినా...
ప్రభుత్వాలు.... ప్రజా ప్రతినిధులు మారుతున్నా.... పేద కూలీల బతుకులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు గడుపుతున్న పేద కూలీలు రోజంతా కష్టించి పని చేసినా... ఒక్కోసారి కనీస వేతనాలు కూడా దొరకడం లేదు. డబుల్‌ బెడ్‌ రూం, రేషన్‌కార్డులు, కనీస వేతనాల అమలు, ప్రమాద బీమా, పింఛన్లు తదితర సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళుతున్నా... వినిపించుకునే నాథుడే కరువయ్యారు.  

పూడికతీత పనుల్లో...
డ్రైనేజీ పూడిక తీత పనుల సందర్భంగా విష వాయువులు వెలువడి పేద కూలీలు మృతి చెందిన సంఘటనలు గతంలో అక్కడక్కడ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇలాంటి ఇరుకు నాలాల్లో పూడికతీత పనులు చేపట్టేప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా సంబంధిత అధికారులు వ్యవహరిస్తే ప్రమాదాలు తగ్గుతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement